సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. శనివారం ఢిల్లీలోని పహర్‌గంజ్- అంబేద్కర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వేదికకు చేరుకున్న సమయంలో సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో.. తాను ప్రయాణిస్తున్న రాణీ ఝాన్సీ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించకూడదని అధికారులను ఆదేశించారు. తిరిగి అదే మార్గంలో ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు.
చీపురు పట్టిన ప్రధాని, బీజేపీ నేతలు..
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం చీపురు పట్టి పరిసరాలు శుభ్రం చేశారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మీకేం తెలుసునంటూ వారిని ప్రశ్నించారు. తమకు ఈ కార్యక్రమం గురించి అవగాహన ఉందని, తాము ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామంటూ వారు సమాధానం ఇవ్వడంతో మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే మోదీ కేవలం ప్రచారం కోసమే.. సాధారణ పౌరుడిలా ట్రాఫిక్‌లో ప్రయాణించారని.. ఇదో పబ్లిక్ స్టంట్ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ
Comments
Please login to add a commentAdd a comment