తప్పు మాదేనా?
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19?
నాకు ఒక్కగానొక్క కొడుకు. వచ్చే నెలకి పదిహేడేళ్ల్లు నిండుతాయి. పేరు వరుణ్. నేనూ, మా వారు ప్రైవేట్ ఉద్యోగులం. ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్లడం లేదు. వరుణ్‌ని చూసుకోవడానికే పూర్తి సమయం కేటాయిస్తున్నాను. ఎప్పటికి కోలుకుంటాడో అని కొండంత దిగులును దిగమింగుకొని గంపెడాశతో బతుకుతున్నాను. నాలాంటి సమస్య పిల్లలున్న తల్లిదండ్రులకు ఎవరికీ రాకూడదని, ముందే జాగ్రత్త తీసుకుంటారని చెబుతున్నాను.
మా వరుణ్ బాగా చదివేవాడు. చూడటానికి సినిమా హీరోలా ఉంటాడని మా బంధువులు, స్నేహితులు ఎప్పుడు కలిసినా అనేవారు. పదవ తరగతి 9.5 శాతం మార్కులతో పాసయ్యాడు. ఇంకో నాలుగైదేళ్లు కష్టపడితే చాలు వాడి జీవితం ఒక గాడిన పడుతుందని సంబరపడ్డాను. అప్పటి వరకు ఉద్యోగం చేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆలోచించాను. కానీ, నా ఆలోచనను మా వాడు తలకిందులు చేశాడని తెలిసేవరకు చాలా ఆలశ్యమైంది. ఓ రోజు ఆఫీస్‌లో ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్... ‘ఔటర్‌రింగ్‌రోడ్డు యాక్సిడెంట్‌లో మీ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
ఆసుపత్రిలో అడ్మిట్ చేశాం...’ అని. విలవిల్లాడిపోయాను. కాలేజీలో ఉండాల్సిన వాడు ఔటర్‌రింగ్ రోడ్డుకు ఎందుకెళ్లాడు?! ఎప్పుడెళ్లాడు?! అనుకుంటూనే ఆసుపత్రికి వెళ్లాను. మా అదృష్టం బాగుండి వాడు ప్రాణాలతో మాకు దక్కాడు. కానీ, ఎటూ కదల్లేక పడి ఉన్న వాడిని చూస్తూ ప్రతి క్షణం మేమే ప్రాణాలతో ఎందుకున్నామా? అని బాధపడుతూ ఉన్నాం. మా తప్పిదమే మా ఈ శిక్షకు కారణమైందని ఇప్పటికీ తిట్టుకుంటున్నాం.
టెన్త్‌లో డిస్టింక్షన్‌లో పాసైన వరుణ్ ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లో 40 శాతం అత్తెసరు మార్కులతో పాసయ్యాడు. వచ్చే ఏడాది బాగానే కవర్ చేస్తాడులే అని సరిపెట్టుకున్నాను. కానీ, సెకండియర్‌లో రెండు సబ్జెక్టులు మిగిలిపోయాయి. వీడి క్లాసు పిల్లలు బి.టెక్‌కు వెళుతున్నారు. వీడు ఫెయిలై మళ్లీ అదే క్లాస్‌కి వెళుతున్నాడు. ఇంట్లోనే ఉంటే ఆ సబ్జెక్టులు కూడా పాసవలేడని, డబ్బులు కట్టి మళ్లీ కాలేజీకి పంపిస్తున్నాం.
అసలేమైందంటే, పదవతరగతి పూర్తయ్యాక డబ్బులు ఎక్కువైనా పర్వాలేదని, ముందే మంచి కాలేజీలో ఎం.పి.సి సీటు తీసుకున్నాం. మొదట్లో వరుణ్ కాలేజీకి వెళ్లనంటే వెళ్లనన్నాడు. వాడికి హిస్టరీ అంటే ఇష్టం. అందుకే అదే సబ్జెక్ట్ ఉన్న కోర్స్ చేస్తానన్నాడు. దాంట్లో భవిష్యత్తు ఉండదని మేం వారించాం. తిట్టాం. బుజ్జగించాం. ఎమ్‌టెక్ చేసి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే విదేశాలకు వెళ్లి లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చని నచ్చజెప్పాం. ఎట్టకేలకు ‘సరే’ అన్నాడు. కానీ, కాలేజీకి వెళ్లాలంటే ఫోన్ కావాలన్నాడు. ల్యాప్ టాప్ అవసరమన్నాడు.
వాడు చదువుకుంటే చాలు అనుకొని మా శక్తికి మించి వాడు కోరినవన్నీ కొనిస్తూనే వచ్చాం. కొనిచ్చిన వస్తువులు కనపడక అడిగితే అరిచేవాడు. తప్పు పడుతున్నారని కోపం తెచ్చుకొని చేతికి అందిన వస్తువునల్లా విసిరికొట్టేవాడు. వీడి ప్రవర్తనకు విసిగి వరుణ్ నాన్నగారు కొన్నిసార్లు వాడి మీద చేయి కూడా చేసుకున్నారు. మా వారికి తెలియకుండా వరుణ్ బుద్దిగా ఉండటానికి నేనే అడిగినప్పుడల్లా ఎంతో కొంత డబ్బిచ్చేదాన్ని. అప్పటికి చెప్పింది బాగానే వినేవాడు.
వరుణ్ రోజూ కాలేజీకి వెళుతున్నాడనే అనుకున్నాను. కానీ, కాలేజీ ఎగ్గొట్టి స్నేహితులతో సినిమాలకు, షికారులకు, బైక్ రేసింగ్‌లకు వెళుతున్నాడని, ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తున్నాడని, దగ్గర ఉన్న వస్తువులు అమ్మేసి స్మోకింగ్ వంటి వ్యసనాల వైపుకు మళ్లాడని తెలిసేసరికి చాలా ఆలశ్యమైపోయింది. క్లాసులకు హాజరవకుండా కాలేజీవారినే ఏమార్చేవాడని, చదువుకోకుండా డబ్బులిచ్చి రికార్డులు రాయించుకునేవాడని తెలిసి ఆశ్చర్యపోయాను. టాలెంట్ ఉండీ, ఇలా అడ్డదారిలో ఆనందాలను వెతుక్కోవడానికి మేమే కారణం అని తెలిసి నివ్వెరపోయాం.
- గాయత్రి (వరుణ్ తల్లి)