ఉద్యోగుల ‘వెత’నాలు | Private Employees Not Getting Salaries Due To Lockdown | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ‘వెత’నాలు

Published Thu, Apr 9 2020 1:28 AM | Last Updated on Thu, Apr 9 2020 7:11 AM

Private Employees Not Getting Salaries Due To Lockdown - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేటు రంగం ఉద్యోగులు వేతనాల కోసం కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు. సాధారణంగా ప్రతి నెలా తొలివారంలోనే యాజమాన్యాలు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంటాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఈసారి ఏప్రిల్‌ తొలివారం గడిచినా మెజార్టీ ఉద్యోగులకు వేతనాలందలేదు. రాష్ట్రంలో సంఘటిత రంగంలో దాదాపు 45లక్షల మంది ఉద్యోగులున్నారు.  వీరిలో అత్యధికంగా విద్యారంగానికి సంబంధించిన స్కూళ్లు, కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్లు, కోచింగ్‌ సెంటర్లలో 20లక్షల మంది వరకు ఉన్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ తదితర సౌకర్యాలు కల్పించట్లేదు. దీంతో సంఘటిత రంగంలో అధికారిక లెక్కల ప్రకారం 19.5లక్షల మంది ఉన్నారు. కరోనా కట్టడికి ఈనెల 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అత్యవసర సేవలందించే సంస్థలు మినహా మిగతావన్నీ మూతబడ్డాయి. దీంతో రోజువారీ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఆయా సంస్థలకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు చెల్లించే ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 14 వరకు వేతనంతో కూడిన సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిబంధన ప్రకారం ప్రతి కంపెనీలో ఉద్యోగికి పూర్తి వేతనం ఇవ్వాలి. అయితే ఏప్రిల్‌ తొలివారం గడిచినా చాలా సంస్థలు వేతనాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు.

కోతలు.. ఎగవేతలు
కొన్ని సంస్థలు రెండుమూడు రోజుల నుంచి వేతనాలు చెల్లిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 30శాతం సంస్థలు వేతనాలిచ్చినట్లు కార్మిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే చాలా సంస్థలు వేతనాల్లో సగమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో వేతన చెల్లింపుల ప్రక్రియ కార్మికశాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించకున్నా పని దినాల ప్రకారం వేతనాలు చెల్లిస్తాయి. నిర్దేశిత తేదీలను ప్రామాణికంగా తీసుకుని ఆ మేరకు వేతనాలిస్తారు. అయితే గతనెల 22 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు పనిచేసిన రోజులను ప్రామాణికంగా తీసుకున్న కంపెనీలు పూర్తి వేతనం ఇస్తుండగా, ఆ తర్వాత పనిదినాలను పరిగణనలోకి తీసుకున్న కంపెనీలు మాత్రం కోత విధిస్తున్నాయి. కొన్ని కంపెనీలు.. పరిస్థితులు కుదుటపడ్డాక చూద్దామన్నట్టు ఉద్యోగులకు చెబుతున్నాయి.

ప్రతిపాదనల్లోనే ‘అడ్వాన్స్‌’..
వేతనాలు చెల్లించని పలు సంస్థలు ఉద్యోగులతో కొన్ని రకాల ప్రతిపాదనలు తెస్తున్నాయి. లాక్‌డౌన్‌తో సంస్థ లావాదేవీలు నిలిచిపోవడంతో కుటుంబ ఆర్థిక అవసరాలకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌ రూపంలో ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ, ఇంతవరకు ఇచ్చిన దాఖలాల్లేవు. కొన్ని సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చి ఆమేరకు చెల్లింపులు చేసినట్లు కార్మికశాఖ అధికారి ఒకరు చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా ఉద్యోగులకు వేతనాలిచ్చిన అనంతరం కార్మికశాఖకు సమాచారమివ్వాలనే నిబంధన ఆధారంగా అన్ని సంస్థల వివరాలు తెలుసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement