ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ స్కీమ్.. | government pension scheme for private employees | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ స్కీమ్..

Published Mon, Jan 5 2015 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM

ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ స్కీమ్..

ప్రైవేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ స్కీమ్..

నేనొక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. మాలాంటి వాళ్ల కోసం ప్రభుత్వ పెన్షన్ స్కీమ్‌లు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇలాంటి స్కీముల్లో నెలకు ఎంత మొత్తం కనీసంగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది?           
- సూర్యప్రకాశ్, అనంతపురం

భారత ప్రభుత్వం ద నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)ను ఆఫర్ చేస్తోంది. భారతీయులెవరైనా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. 2004, ఏప్రిల్ 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి ఇది తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగులు కాని వారూ ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఏడాదికి కనీస మొత్తం రూ.6,000 ఇన్వెస్ట్ చేయాలి. ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. మీరు రిటైరయ్యేంత వరకూ మీరు మీ సొమ్ములు వెనక్కి తీసుకోవడానికి లేదు. మీరు రిటైరైన తర్వాత మీరు పొదుపు చేసిన దాంట్లో 40% మొత్తం యాన్యూటీగా మారుతుంది. దీంతో మీకు క్రమం తప్పకుండా పెన్షన్ వస్తుంది. మిగిలిన 60 శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను రాయితీలు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకూ పన్ను రాయితీ పొందొచ్చు. పెన్షన్ ఫం డ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) అధీకృత ఏ పాయింట్-ఆఫ్-సేల్(పీఓఎస్) వద్దనైనా మీరు ఎన్‌పీఎస్ అకౌంట్ ప్రారంభించొచ్చు.

నేను పూర్తి వివరాలు తెలుసుకోకుండానే అవైవా సేవ్‌గార్డ్ యులిప్‌లో 2006లో ఇన్వెస్ట్ చేశాను.  ఆ తర్వాత ఈ స్కీమ్‌లో  భారీగా చార్జీలు ఉన్నాయని గుర్తిం చాను. కానీ సరెండర్ చార్జీలు కూడా అధికంగా ఉండటంతో చేసేదేం లేక ఈ స్కీమ్‌లోనే కొనసాగుతున్నాను. ఎనిమిదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ నాకు చెప్పుకోదగ్గ రాబడులు రాలేదు. ఇప్పుడు నేనేం చేయాలి?                 
- సువర్చల, హైదరాబాద్

అవైవా సేవ్‌గార్డ్ అనేది నాన్-పార్టిసిపేటింగ్ యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. ప్రతీ ఏడాది ఈ స్కీమ్‌లో వ్యయాల పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తారు. ప్రతీ ఏడాది ప్రీమియం అలకేషన్ చార్జీల కింద 4 నుంచి 6 శాతం వసూలు చేస్తారు. ఇక ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలు 0.75 శాతం నుంచి 1.75 శాతం రేంజ్‌లో ఉంటాయి. పాలసీ నిర్వహణ చార్జీలు కూడా ఉంటాయి. మీ పాలసీ టెర్మ్, మీరు చెల్లించే ప్రీమియమ్‌లను బట్టి నెలా నెలా విభిన్నమైన రేట్లలో వీటిని వసూలు చేస్తారు.

ఇక చివరగా మోర్టాలిటీ చార్జీ కూడా ఉంటుంది. ఇలాంటి ప్లాన్‌లో ఈ తరహా అధిక చార్జీలు ఉంటాయి. కాబట్టి వీటి రాబడులు తక్కువగా ఉంటాయి. సాంప్రదాయ బీమా స్కీమ్‌లు భారీ స్థాయి రిటర్న్‌లు ఇవ్వలేవు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ స్కీమ్‌లు సురక్షితమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడమే దీనికి ప్రధాన కారణం. ఈ పాలసీని ఏడు నుంచి ఎనిమిదేళ్లలోపు సరెండర్ చేస్తే ముఖ విలువలో 1 శాతంగా సరెండర్ చార్జీలు చెల్లించాలి. ఎనిమిదేళ్లు దాటితో ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. ఇప్పటిదాకా ఎదురు చూశారు. కాబట్టి ఎనిమిదేళ్లు పూర్తయ్యేదాకా వేచి ఉండి, అ తర్వాత ఈ ప్లాన్ నుంచి వైదొలగండి. ఆ వచ్చిన మొత్తాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు కేటాయించండి. 

ఎక్కువ కవర్ ఉండే టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. ఈ తరహా టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. రెండో  భాగాన్ని బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోండి. హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, టాటా బ్యాలెన్స్‌డ్, బిర్లా సన్‌లైఫ్ 95 వంటి ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఈ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు.

మా నాన్నగారు ఇటీవలనే ఆస్తి పంపకాలు చేశారు. నా వాటా కింద రూ.90 లక్షల వరకూ వచ్చాయి. మరో 5 నుంచి 8 ఏళ్ల వరకూ నాకు వీటితో అవసరం లేదు. గతంలో మీ జవాబులను  చదివి నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ మొత్తాన్ని మొదట ఏదైనా డెట్ లేదా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా ఏదైనా బ్యాలెన్స్‌డ్/ఈక్విటీ ఫండ్‌కు బదిలీ చేయాలి. అయితే ఈ విధానంలో పన్ను సంబంధ అంశాలు ఎలా ఉంటా యి? డెట్ ఫండ్స్ నుంచి మూడేళ్లలోపు ఇన్వెస్ట్‌మెంట్స్ ను ఉపసంహరించుకుటే ఆదాయపు పన్ను చెల్లిం చాల్సి ఉంటుందా?     
- రామారావు, హైదరాబాద్

ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయవచ్చు. ఇలా చేస్తే ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని కొత్తగా మరో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లుగా భావిస్తారు. అందుకే డెట్ ఫండ్ నుంచి మూడేళ్లలోపే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరిస్తే దానిపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చిన రాబడులను మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement