ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభం
న్యూఢిల్లీ: పిల్లల పేరిట పింఛను పథకం ప్రారంభించి, ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ‘ఎన్‌పీఎస్ వాత్సల్య’ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ పథకాన్ని 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఎన్‌పీఎస్ పథకం మెరుగైన రాబడులను అందిస్తోందని, భవిష్యత్ ఆదాయం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు మంత్రి సీతారామన్ చెప్పారు.
ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగంలో 14 శాతం, కార్పొరేట్ డెట్‌లో 9.1 శాతం, జీ–సెక్‌లలో 8.8 శాతం చొప్పున రాబడులు ఉన్నట్టు వివరించారు. ‘పీఎం వాత్సల్య పథకాన్ని అమలు చేసే క్రమంలో దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ సరీ్వసెస్ విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల తెలిపారు.
ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..?
ఆన్‌లైన్‌లో లేదంటే ఆఫ్‌లైన్‌లో బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.1,000తో ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించొచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరుమీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్ ఎన్‌పీఎస్ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్లు నిండే వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే ఎన్‌పీఎస్ వాత్సల్య ప్రారంభించేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి, కొందరు పిల్లలను పేరిట ఖాతాలు తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపదగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment