‘స్మార్ట్’గా దోచేద్దాం!
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సర్కారు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య నేత ఓ ప్రైవేటు కంపెనీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. సదరు సంస్థకు కోట్ల రూపాయలు కట్టబెట్టడం, కమీషన్ల రూపంలో భారీయెత్తున ముడుపులు బొక్కేయడమే దీని వెనుక అసలు రహస్యమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌ల పరిధిలో మీటర్ రీడింగ్ తీసే దాదాపు 4,500 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది.
వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ల రీడింగ్‌లో అవకతవకలు, క్షేత్రస్థాయి సిబ్బంది యజమానులతో కుమ్మక్కై తక్కువ రీడింగ్ నమోదు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. అవకతవకలు అరికట్టాలంటే స్మార్ట్ మీటర్లు అవసరమని అధికారులు నివేదించారు. 500 యూనిట్లు దాటుతున్న వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించాలని డిస్కమ్‌లు సిఫారసు చేశాయి. వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లే ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇలాంటి వినియోగదారులు కేవలం 83,110 మంది మాత్రమే ఉంటారు. అయితే ముడుపులపై కన్నేసిన ముఖ్యనేత గృహ వినియోగానికీ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.