recruitment process
-
హైకోర్టు ఆవరణలో మళ్లీ ఎత్తు పరీక్ష
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత నోటిఫికేషన్లో ‘ఎత్తు’ విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులను తాజా నోటిఫికేషన్ కింద అనర్హులుగా ప్రకటించడంపై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు తమ పర్యవేక్షణలోనే ‘ఎత్తు’ పరీక్ష నిర్వహిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు ప్రాంగణంలోనే దీనికి సంబంధించిన కొలతలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఎత్తు విషయంలో అధికారులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, ఒక్కో పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. తాము ప్రతిపాదించిన విధంగా ఎత్తు కొలిచే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు.. ఎస్సై నియామక ప్రక్రియలో భాగమైన దేహదారు ఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలి చిన అధికారులు అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్, మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్లో అర్హులుగా ప్రకటించిన తమను ఎత్తు విషయంలో తాజా నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించారన్నారు. వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఎస్సై నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు వెల్లడించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్‌పై శుక్రవారం జస్టిస్ నరేంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా ఎత్తు కొలిచామని ప్రభుత్వ న్యాయవాది జీవీఎస్ కిషోర్‌కుమార్ ధర్మాసనానికి నివేదించారు. ఈ పరీక్షలో పిటిషనర్లు అర్హత సాధించలేదన్నారు. అయితే, ఈ విషయాన్ని సింగిల్ జడ్జి సరైన కోణంలో పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ స్పందిస్తూ.. 2018లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన అభ్యర్థులు, తాజా నోటిఫికేషన్లో ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. వాదనలు విన్న ధర్మాసనం, తమ పర్యవేక్షణలో హైకోర్టు ప్రాంగణంలోనే మరోసారి ఎత్తు పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. -
ఏఐ.. చేస్తుందిక ఇంటర్వ్యూ!
సాక్షి, అమరావతి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) సర్వాంతర్యామిగా మారింది. అన్ని రంగాల్లోకి దూసుకువస్తోంది. మనుషులు చేయాల్సిన పనులన్నీ.. చక్కబెట్టేస్తోంది. తాజాగా కంపెనీల ఉద్యోగ నియామక ప్రక్రియలోనూ ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమయ్యింది. అమెరికాకు చెందిన ‘రెజ్యూమ్ బిల్డర్’ అనే వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా 43 శాతం కంపెనీలు ‘ఏఐ’ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటున్నాయని నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం 10 శాతం కంపెనీలు ఎంపికల్లో ఏఐను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. అలాగే 15 శాతం కంపెనీలు పూర్తిగా ఏఐపైనే ఆధారపడి ఇంటర్వ్యూలు చేయాలనుకుంటున్నాయని వెల్లడించింది. దాదాపు మూడింట రెండు వంతుల కంపెనీలు.. ఏఐ ఇంటర్వ్యూల వల్ల నియామక సామర్థ్యం మెరుగుపడుతుందని బలంగా విశ్వసిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం కృత్రిమ మేధకు పూర్తిగా పగ్గాలు అప్పగించేందుకు సిద్ధంగా లేవు. ఏఐ కంటే అధునాతన అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్‌లు అభ్యర్థుల ఎంపికలో మరింత మెరుగ్గా పని చేస్తాయని అభిప్రాయపడ్డాయి. అలాగే హెచ్ఆర్ ఉద్యోగులు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఏఐ నిపుణుల కోసం వేట.. ప్రస్తుతం ‘ఏఐ’లో నైపుణ్యం కలిగిన వారికి మంచి డిమాండ్ ఉంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత మార్చి నుంచి మే నెల వరకే వీరి కోసం 24% ఎక్కువ ప్రకటనలు వెలువడ్డాయి. వచ్చే త్రైమాసికాల్లో ఇది కనీసం 30% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలపై భారత్‌కు చెందిన స్పెక్ట్రమ్ టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో ఏఐ సంబంధిత సాంకేతికతలో కంపెనీలు ఎక్కువగా పెట్టుబడి పెట్టనున్నాయని.. ఏఐ నిపుణుల కోసం డిమాండ్‌ను పెంచుతున్నాయని వెల్లడైంది. ఏఐ నిపుణులను ఆకర్షించడంలో కూడా తీవ్ర పోటీ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణులను అందించే దేశాల్లో భారత్ టాప్‌లో ఉండగా.. ఏఐ ఆధారిత ఉద్యోగ ప్రకటనల్లో దేశంలోనే బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై కేంద్రంగా ఏఐ నిపుణుల కోసం వేట కొనసాగుతోంది. ఏఐ రంగంలో అనుభవమున్న వారితో పాటు కొత్తవారిని 1:2 నిష్పత్తిలో నియమించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లకు ఎక్కువ అవకాశాలున్నాయని నివేదిక వెల్లడించింది. -
అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఒకేసారి 9,231 కొలువుల భర్తీకి ఒకే దఫా 9 నోటిఫికేషన్లు జారీ చేసిన బోర్డు.. నూరు శాతం ఉద్యోగాల్లో నియామకాలు జరిపేలా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టులన్నీ బోధన రంగానికి సంబంధించినవే. కాగా ఒక అభ్యర్థి మూడు నుంచి నాలుగు పోస్టులకు (వేర్వేరు సబ్జెక్టులకు) దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ పరీక్షలన్నీ వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తుండటంతో ఇలాంటి వారంతా వివిధ పరీక్షలకు హాజరై అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టకుంటే ఖాళీలు ఎక్కువగా మిగిలేపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అవరోహణ (డిసెండింగ్ ఆర్డర్)విధానాన్ని అమలు చేయాలని టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్ణయించింది. ఈ పద్ధతిలో నియామకాలు చేపడితే పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేపట్టవచ్చని బోర్డు అంచనా వేస్తోంది. తొమ్మిది కేటగిరీల్లో కొలువులు... ఐదు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో గురుకుల డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లో 9,231 పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో డిగ్రీ లెక్చరర్ (డీఎల్), జూనియర్ లెక్చరర్(జేఎల్), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులున్నాయి. కొన్ని పోస్టులు కాలేజీలు, స్కూళ్లలో ఉండడంతో రెండింటికీ దాదాపుగా ఒకే అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే డిగ్రీ లెక్చరర్‌కు అర్హతలున్న అభ్యర్థులు, జూనియర్ లెక్చరర్‌తో పాటు పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అవరోహణ పద్ధతి ఇలా.. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను నియామక సంస్థలు ఒక క్రమ పద్ధతిలో చేపడతాయి. ఇష్టానుసారంగా చేపడితే అన్ని పోస్టులూ భర్తీకాక తిరిగి ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. తాజాగా గురుకుల నియామకాల బోర్డు పరిధిలో 9 వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అంతా బోర్డు పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించినప్పటికీ నియామకాల కౌన్సెలింగ్‌ను మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. ప్రస్తుతం 9 కేటగిరీల్లో కొలువులున్నాయి. వీటిని పైస్థాయి నుంచి కింది స్థాయికి అవరోహణ క్రమంలో విభజించిన తర్వాత వాటికి కౌన్సెలింగ్ నిర్వహించి నియామకాలు చేపడతారు. అంటే ముందుగా డిగ్రీ కాలేజీల్లో కొలువులు భర్తీ చేసిన తర్వాత జూనియర్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేస్తారు. ఆ తర్వాత పాఠశాలల్లో పైస్థాయి పోస్టులైన పీజీటీ, టీజీటీ తర్వాత ఇతక కేటగిరీ పోస్టుల్లో నియామకాలు చేపడతారు. దీంతో ప్రకటించిన పోస్టులన్నీ పూర్తిస్థాయిలో భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇలా కాకుండా కిందిస్థాయి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎంపికైన అభ్యర్థి, ఆ తర్వాత పైస్థాయి పోస్టుకు ఎంపికైతే కిందిస్థాయి పోస్టును వదిలేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ ఖాళీ భర్తీ కాకుండా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
Telangana: అంగన్వాడీ పోస్టుల భర్తీలో గోల్మాల్.. ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోస్టర్ పాటింపులో గందరగోళం తలెత్తిందని, మరోవైపు ఇన్స్ట్రక్టర్లకు రిజర్వ్ చేసిన పోస్టులను ఇతరులతో భర్తీ చేశారని, దివ్యాంగుల కోటాలోనూ అనర్హులను ఎంపిక చేశారంటూ అభ్యర్థులు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఎదుట నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతరుల ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా కమిషనరేట్ అధికారులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. 434 పోస్టులకి వేలల్లో దరఖాస్తులు ►రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 434 గ్రేడ్–2 సూపర్వైజర్(ఎక్స్టెన్షన్ ఆఫీసర్) పోస్టులకు గతేడాది సెప్టెంబర్ 30న ఆ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త వారితో కాకుండా ఇప్పటికే అంగన్వాడీల్లో టీచర్లుగా పనిచేస్తూ పదేళ్ల అనుభవం ఉండి పదోతరగతి ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించింది. ఈ పోస్టుల్లో 5 శాతం కోటాను అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్లు, మిడిల్ లెవల్ ట్రైనింగ్ సెంటర్లో పనిచేస్తున్న కోఆర్డినేటర్లు/ఇన్స్ట్రక్టర్లకు రిజర్వ్ చేయగా... మరో 15 శాతం మార్కులను ఇప్పటికే కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సూపర్వైజర్లకు కేటాయించింది. కానీ కాంట్రా క్టు సూపర్వైజర్ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో వారంతా ఈ నోటిఫికేషన్ పరిధిలోకి రాకుండానే ప్రభుత్వ కొలువుల్లో చేరిపోయారు. ఇక నోటిఫికేషన్ వెలువడిన క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23వేల మంది అంగన్వాడీ టీచర్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఏడాది జనవరి రెండో తేదీన అర్హత పరీక్ష నిర్వహించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ... ఫిబ్రవరిలో ఫలితాలను ప్రకటించింది. ఆ తర్వాత మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాలను రూపొందించి ప్రాథమిక అర్హుల జాబితా అనంతరం... ఇటీవల తుది జాబితాను విడుదల చేసి వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తుది జాబితాలో నిబంధనలు పాటించకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. ►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 434 పోస్టులకు హైదరాబాద్, వరంగల్ రీజియన్లు వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. మొత్తం పోస్టుల్లో 427 పోస్టులు భర్తీ అయ్యాయి. 7 పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. భర్తీ చేసిన 427 పోస్టుల్లో 15 మంది ఇన్స్ట్రక్టర్లకు అవకాశం కల్పించారు. ►5 శాతం పోస్టులను ఇన్స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ క్రమంలో సగటున 22 పోస్టులు ఇన్స్ట్రక్టర్లు/కోఆర్డినేటర్లకు దక్కాల్సి ఉండగా... కేవలం 15 పోస్టులతోనే సరిపెట్టారు. అయితే రిజర్వ్ చేసిన పోస్టులను కమ్యూనిటీ రిజర్వేషన్లతో భర్తీ చేయడం.. పలు అనుమానాలకు తావిచ్చినట్లయింది. ►కొన్నిచోట్ల కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా మెరిట్‌ను పరిశీలిస్తే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థి అర్హత సాధించగా... అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు. ఉదాహరణకు జోన్–7 పరిధిలో ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 10.125 మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగం వచ్చింది. కానీ అదే ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థికి 13.125 మార్కులు వచ్చినా కొలువు దక్కలేదు. ►ఇక ఖమ్మం జిల్లాలోని ఓ అభ్యర్థి దరఖాస్తులో వైకల్యం లేదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ సదరు అభ్యర్థికి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం దక్కింది. వాస్తవానికి వైకల్యం ఉన్న అభ్యర్థికి కొలువు రాలేదు. మహబూబ్‌నగర్, వికారాబాద్ తదితర జిల్లాల్లో కూడా దివ్యాంగులైన అభ్యర్థులకు అవకాశం రాలేదంటూ లబోదిబోమంటున్నారు. ►కాగా నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగానే పోస్టుల భర్తీ జరిగిందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
మోడల్ స్కూళ్లలో 282 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 282 టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో 71 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులున్నాయి. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జోన్ల వారీగా సెలెక్షన్ కమిటీల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి. టీజీటీ పోస్టులు జోన్ 1లో 17, జోన్ 3లో 23, జోన్ 4లో 31 ఉండగా పీజీటీ పోస్టులు జోన్ 1లో 33, జోన్ 2లో 4, జోన్ 3లో 50, జోన్ 4లో 124 ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ‘హెచ్‌టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. ఇటీవలి పాస్‌పోర్టు సైజు ఫొటో, స్పెసిమన్ సిగ్నేచర్ స్కాన్డ్ కాపీలను స్పష్టంగా కనిపించేలా అప్లోడ్ చేయాలి. అభ్యర్థులకు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు. పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పీజీటీ కామర్స్ పోస్టులకు ఎం.కామ్ అప్లయిడ్ బిజినెస్ ఎకనమిక్స్ చేసిన వారు అర్హులు కారు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేదా యూజీసీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ కోర్సు పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులలో బీఈడీ తదితర ప్రొఫెషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతలు, వెయిటేజీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పొందుపరిచింది. ఎంపికల అనంతరం నిబంధనల ప్రకారం అభ్యర్థులు నిర్ణీత కాంట్రాక్టు ఒప్పందాలను పూర్తిచేశాక నియామకాలు పొందుతారు. ఎప్పుడైనా డీఎస్సీ ద్వారా రెగ్యులర్ టీచర్లు నియామకమైతే వీరి కాంట్రాక్టు ఆటోమేటిగ్గా రద్దు అవుతుంది. -
బోర్డు సరే.. విధివిధానాలెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామక ప్రక్రియకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. నియామకాలకు ఏ నిబంధనలు తీసుకురావాలి అనే దానిపై స్పష్టత కనిపించడంలేదు. మరోవైపు తమ ప్రాధాన్యత తగ్గిస్తూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడాన్ని వర్సిటీల వీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టుల భర్తీని ఎప్పట్లా ఎవరికి వారే కాకుండా ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బోర్డు ఏర్పాటును కూ డా ప్రకటించింది. ఈ బోర్డుకు చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వం వహిస్తారు. ఉన్నత విద్యా విభాగం ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కాలేజీ విద్య కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ తరహా నిర్ణయం మాత్రమే జరిగింది తప్ప ఇంత వరకూ బోర్డు సభ్యులు భేటీ కాలేదు. వర్సిటీల వీసీలతో సంప్రదించి విధివిధానాలు ఖరారు చేయాలా లేక సొంతంగా చేస్తే ఏమైనా సమస్యలు ఉంటాయా? అనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే విధివిధానాలపై ముందుకు వెళ్లలేకపోతున్న ట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. భారీగా ఖాళీలు.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,828 మంజూరైన పోస్టులున్నాయి. వాటిలో ఇప్పటికీ 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 2017లో ఒకసారి విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. అందులో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటివరకూ ఈ పోస్టుల భర్తీ కార్యాచరణకు నోచుకోలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరుతో అధికారులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఈలోగా కొందరు రిటైర్ కావడంతో 2021 జనవరి నాటికి వర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ స్థాయిలో ఖాళీలు ఏర్పడటంతో ప్రభుత్వం తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన సాగిస్తోంది. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలొస్తున్నా యి. ఈ నేపథ్యంలోనే నియామక ప్రక్రియకు బో ర్డు వేసినా ముందడుగు పడకపోవడంతో అధ్యా పక పోస్టులు ఆశిస్తున్న వారిలో నిరాశ నెలకొంది. -
కొత్త సీడీఎస్ ‘ఎంపిక’ షురూ
న్యూఢిల్లీ: దివంగత జనరల్ బిపిన్ రావత్ స్థానంలో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) నియామక ప్రక్రియ మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన జనరల్ బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సీనియర్ కమాండర్లతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్యానెల్ ప్రతిపాదించిన పేర్లతో కూడిన జాబితా త్వరలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు అందుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తదుపరి ఈ జాబితా కేబినెట్ నియామకాల కమిటీకి పరిశీలనకు అందుతుంది. ఆ కమిటీ అంతిమంగా సీడీఎస్ పేరును ఖరారు చేస్తుంది. అత్యున్నత స్థాయి ఈ పోస్టుకు అత్యంత సీనియర్ అయిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జనరల్ నరవణె వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇద్దరూ కూడా ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఒక వేళ సీడీఎస్‌గా జనరల్ నరవణెను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే, తదుపరి సీడీఎస్‌గా ఎవరిని నియమించాల్సింది కూడా ఇప్పుడే నిర్ణయించాల్సి ఉంటుంది. తదుపరి ఆర్మీ చీఫ్‌గా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతి, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందిన సీనియర్ మోస్ట్ కమాండర్లు. ఇద్దరూ కూడా జనవరి 31వ తేదీన రిటైర్ కావాల్సి ఉంది. దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా గత ఏడాది జనవరి ఒకటో తేదీన జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ), అర్మ్డ్ పోర్సెస్ ట్రిబ్యునల్ (ఏఎఫ్‌టీ)ల్లో ఖాళీలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. నియామకాలు చేపట్టకుండా ట్రిబ్యునళ్లను నిర్వీర్యం చేస్తున్నారని, తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని సుప్రీంకోర్టు ఈనెల 6న కేంద్రం వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 13లోగా కొన్ని నియామకాలైన చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఖాళీల భర్తీని కేంద్రం చేపట్టింది. వివిధ ట్రిబ్యునళ్లలో దాదాపు 250 దాకా ఖాళీలు ఉన్నాయి. ఎన్సీఎల్టీ: ఎనిమిది మంది జ్యుడీషియల్, 10 మంది సాంకేతిక సభ్యుల్ని నియమించింది. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నరహరి దేశ్‌ముఖ్, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రామతిలగం, పంజాబ్ హరియాణా హైకోర్టు విశ్రాంత రిజి్రస్టార్ జనరల్ హర్నామ్ సింగ్ ఠాకూర్, పి.మోహన్‌రాజ్, రోహిత్ కపూర్, జస్టిస్ దీప్ చంద్ర జోషి ఎన్సీఎల్టీలో జ్యుడీíÙయల్ సభ్యులు. వీరంతా ఐదేళ్ల పదవీకాలం, 65 ఏళ్ల వయసు.. ఏది ముందు ముగిస్తే అప్పటి వరకూ కొనసాగుతారు. ఐటీఏటీ: జ్యుడీíÙయల్ సభ్యులుగా అన్‌రిజర్వు కేటగిరీలో అడ్వొకేట్ సంజయ్ శర్మ, అడ్వొకేట్ ఎస్.సీతాలక్ష్మి , అదనపు జిల్లా, సెషన్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.గోయెల్, జస్టిస్ అనుభవ్ శర్మ. ఓబీసీ కేటగిరీలో అడ్వొకేట్ టీఆర్ సెంథిల్‌కుమార్, ఎస్సీ కేటగిరీలో ఎస్బీఐ లా ఆఫీసర్ మన్మోహన్ దాస్‌లను నియమించారు. వీరి పదవీకాలం నాలుగేళ్లు, లేదా 67 ఏళ్లు.. ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఏఎఫ్‌టీ: ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్‌లో ఆరుగురు జ్యుడీíÙయల్ సభ్యుల్ని కేంద్రం నియమించింది. జస్టిస్ బాలకృష్ణ నారాయణ, జస్టిస్ శశికాంత్ గుప్తా, జస్టిస్ రాజీవ్ నారాయణ్ రైనా, జస్టిస్ కె.హరిలాల్, జస్టిస్ ధరమ్‌చంద్ర చౌదరి, జస్టిస్ అంజనా మిశ్రాలను నియమించింది. వీరి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు, 67 ఏళ్లు ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఢిల్లీ, చండీగఢ్, లక్నోల్లో ఏఎఫ్‌టీ నాలుగు బెంచ్‌లు ఉన్నాయి. ఆయా ట్రిబ్యునళ్లలో 19 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రిటైర్డ్ జస్టిస్ రజని -
ఎన్ఆర్ఏతో పారదర్శకతకు పెద్దపీట
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి పరీక్షల నిర్వహణ కోసం జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) ఏర్పాటు కోట్లాది యువతకు ప్రయోజనకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్ఆర్ఏతో పలు పరీక్షలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోగా.. సమయం, వనరులు ఆదా అవుతాయని అన్నారు. ఎన్ఆర్ఏతో ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత నెలకొంటుందని ప్రధాని బుధవారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటైన ఎన్ఆర్ఏతో నియామక ప్రక్రియలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎన్ఆర్ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో 1517 కోట్ల రూపాయల కేటాయింపుతో ఎన్ఆర్ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. అన్ని ఉద్యోగాలకు ఉమ్మడి సిలబస్‌తో ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తారు. ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. చదవండి : నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం -
కపిల్ త్రయం చేతిలో... హెడ్ కోచ్ ఎంపిక బాధ్యత!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ నియామక ప్రక్రియను దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి అప్పగించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల మండలి (సీవోఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటనేదీ రాకున్నా ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మిగతా కోచింగ్, సహాయక సిబ్బంది నియామకం మాత్రం బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి పర్యవేక్షణలో సాగుతుంది. గతంలో సీఏసీ సభ్యులుగా నియమితులైన మేటి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో... వారి స్థానంలో కపిల్ త్రయాన్ని తాత్కాలిక (అడహక్) ప్రాతిపదికపై నియమించారు. ఈ బృందమే డిసెంబరులో మహిళా జాతీయ జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసింది. సీవోఏ తీరుపై బీసీసీఐ వర్గాల మండిపాటు ప్రత్యేకించి అక్టోబరు 22న వార్షిక సర్వసభ్య సమావేశం ఉండగా... టీమిండియా కోచింగ్ సిబ్బంది నియామక ప్రకటన విషయంలో సీవోఏకు అంత తొందరేమిటని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి. ఓవైపు ప్రపంచ కప్‌లో భారత్ ప్రదర్శనపై హెడ్ కోచ్, కెప్టెన్‌తో సమీక్ష సమావేశం నిర్వహణ కోరుతూనే, మరోవైపు కోచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరడాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తప్పుబట్టారు. ‘ఈ పరిణామాలు నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. సీవోఏ ఇప్పటికే బోర్డు ఎన్నికలకు తేదీలు వెల్లడించింది. ఇంతలోనే ఇదేమిటి? తమ ఉద్దేశంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరినైనా వారు నియమించాలని, ప్రపంచ కప్ సాధించలేకపోయిన విషయాన్ని మరుగునపర్చాలని అనుకుంటున్నారా’ అని ఆ అధికారి ప్రశ్నించారు. ప్రస్తుత కోచింగ్ సిబ్బంది అందరూ తమతమ నివేదికలు సమర్పించాల్సి ఉన్న నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు. విజయ్ శంకర్ గాయం తీవ్రత సహా, నాలుగో స్థానంపై తీసుకున్న నిర్ణయాలకు బ్యాటింగ్ కోచ్ కీలకమైన నివేదిక ఇవ్వాల్సి ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. -
డీఎస్సీ–18 అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ 2018కి సంబంధించి నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుండడంతో కొత్తగా ఎంపిక కాబోతున్న ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెల 20 నుంచి విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రారంభమై సెప్టెంబర్ 4 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. విశాఖ జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ వెరసి 642 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తొలుత సెలెక్టయిన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో ఉంచుతారు. వీటిని విద్యాశాఖ అధికారులు డౌన్లోడ్ చేసి వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను సరైనవో కాదో పరిశీలిస్తారు. ఈనెల 27 నుంచి సర్టిఫికెట్లను పరిశీలించే పనిని జిల్లాలో ప్రారంభిస్తారు. అనంతరం ఆయా అభ్యర్థులు ఏ రోజున హాజరు కావాలో వారి మొబైల్ ఫోన్లకు సమాచారం పంపుతారు. స్కూల్ అసిస్టెంట్లకు విశాఖ నగరం గురుద్వారా సమీపంలోని వసంతబాల విద్యావిహార్ పాఠశాలలో ఎంపిక ప్రక్రియను చేపడతారు. తుది ఎంపిక జాబితా అనంతరం స్కూలు ప్రాంతాల ఎంపిక వె»Œబ్ ఆప్షన్లతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సరికొత్తగా ఆన్లైన్లోనే పోస్టింగు ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే తెలుగు భాషా పండితులు, హిందీ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంటు తెలుగు, హిందీ, పీఈటీ పోస్టులు (ఐదు కేటగిరీలు) మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టులు ఖాళీగా ఉండిపోయిన పక్షంలో జాబితాలో తదుపరి మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇస్తారు. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న డీఎస్సీ అభ్యర్థులు నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయా ఆభర్థులు సంబర పడుతున్నారు. కేటగిరీ వారిగా చూస్తే ఎస్జీటీ పోస్టులు మైదానంలో 294, ఏజెన్సీలో 153 ఖాళీలు భర్తీ కానున్నాయి. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 63 ఉన్నాయి. వాటిలో నాన్ ల్యాంగ్వేజీలతో పాటు పీఈటీ, మ్యూజిక్ ఉపా«ధ్యాయ ఖాళీలున్నాయి. ఇందులో మైదాన ప్రాంతంలో 56 కాగా, మిగిలిన 7 పోస్టులు ఏజెన్సీలో భర్తీ కానున్నాయి. మైదానంలో.. ఐదు గణితం ఉపాధ్యాయ పోస్టులు, బయాలాజికల్ సైన్స్‌కు 9, సాంఘికశాస్త్రం 13, సంగీతం 3, పీఈటీలు 20, లాంగ్వేజిలు 6తో పాటు మరికొన్ని పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. -
త్వరలో డీఎస్సీ నియామకాలు
సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–18 నియామకాల ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. 2018 అక్టోబరులో నోటిఫికేషన్ విడుదల చేసి అదే ఏడాది డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. మెరిట్ జాబితాను ఫిబ్రవరి 15న విడుదల చేశారు. మే 15న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. మెరిట్ జాబితా అభ్యర్థులేమో ఎదురు చూస్తున్నారు. మెరిట్ జాబితా విడుదలైనా సెలక్షన్ జాబితాపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికివారు ‘కటాఫ్’పై అంచనాలు వేసుకుని ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సెలక్షన్ జాబితా కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం 1:2 ప్రకారం సెలక్షన్ జాబితా ప్రకటించగానే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఇందుకు వేదిక ఖరారు చేయాలంటూ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మూడు రోజుల కిందట డీఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానిక గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ (ఇంగ్లిష్ మీడియం)ను ఖరారు చేసి ఇక్కడి అధికారులు నివేదిక పంపారు. రాష్ట్ర అధికారుల కబురుకోసం వేచి చూస్తున్నారు. వివిధ కేటగిరీల్లో జిల్లాలో మొత్తం 602 పోస్టులు భర్తీ చేయనున్నారు. మ్యూజిక్ పోస్టులు రాష్ట్రస్థాయిలో భర్తీ 602 పోస్టుల్లో ఆరు మ్యూజిక్ టీచర్ పోస్టులను 418 మంది అర్హత సాధించారు. ఈ పోస్టులను రాష్ట్రస్థాయిలోనే భర్తీ చేయనున్నారు. తక్కిన పోస్టులను జిల్లాలోనే భర్తీ చేస్తారు. ఎస్జీటీ తెలుగుకు సంబంధించి 377 పోస్టులకు గాను 18,149 మంది అభ్యర్థులు మెరిట్జాబితాలో ఉన్నారు. ఎస్జీటీ కన్నడకు సంబంధించి 11 పోస్టులకుగాను 77 మంది, ఎస్ఏ ఇంగ్లిష్‌కు 16 పోస్టులకుగాను 729 మంది, ఎస్ఏ సంస్కృతం రెండు పోస్టులకు గాను ముగ్గురు, ఎస్ఏ ఉర్దూ ఒక పోస్టుకు 42 మంది, ఎస్ఏ గణితం (తెలుగు), 16 పోస్టులకు 1387 మంది, ఎస్ఏ గణితం (ఉర్దూ) రెండు పోస్టులకు 9 మంది, ఎస్ఏ పీఎస్ 19 పోస్టులకు 661 మంది, ఎస్‌ఏబీఎస్ 18 పోస్టులకు 1191 మంది, ఎస్ఏ సోషల్ 28 పోస్టులకు 3579 మంది, ఎల్పీ ఉర్దూ 4 పోస్టులకు 25 మంది, ఎల్పీ సంస్కృతం 5 పోస్టులకు ముగ్గురు, ఎల్పీ కన్నడ ఒక పోస్టుకు ఇద్దరు అభ్యర్థులు మెరిట్ సాధించారు. కోర్టు కేసులు, తదితర కారణంగా ఎస్జీటీ ఉర్దూ, ఎస్ఏ తెలుగు, ఎస్ఏ హిందీ, ఎల్పీ తెలుగు, ఎల్పీ హిందీ, పీఈటీ పోస్టులకు సంబంధించి మెరిట్ జాబితాను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 19న స్పెషల్ డీఎస్సీ స్పెషల్ డీఎస్సీ–19 పరీక్షలు ఈనెల 19న నిర్వహించనున్నారు. వాస్తవానికి గత నెల 31న నిర్వహించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. 19న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. జిల్లాలో 55 పోస్టులకు గాను 329 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అనంతపురం నగర శివారులోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలతో పాటు పుట్టపర్తి సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్లు https;// apssa.apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. -
లోక్‌పాల్‌కు దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: సామాజికవేత్త్త అన్నా హజారే దీక్షను విరమించడంతో లోక్‌పాల్ నియామక ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్‌గా భావించే లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల పదవులకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ అయింది. అర్హతలు, నిబంధనలు ► లోక్‌పాల్ చైర్మన్ పదవికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా న్యాయమూర్తిగా పనిచేసిన వారు లేదా అవినీతి వ్యతిరేక విధానాలు, ప్రజా పాలన, విజిలెన్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, న్యాయ శాస్త్రం, మేనేజ్మెంట్ తదితర రంగాల్లో కనీసం 25 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు అర్హులు. ► 45 ఏళ్లకు తక్కువగా ఉన్నవారు అనర్హులు. ► లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులుంటారు. అందులో నలుగురు న్యాయశాస్త్రంలో అనుభవం కలిగి ఉండాలి. ► కనీసం నలుగురికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళల నుంచి అవకాశం కల్పిస్తారు. ► చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది అమలవుతుంది). ∙చైర్మన్ జీతభత్యాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనాలకు సమానంగా ఉంటాయి. సభ్యులకు సుప్రీంకోర్టు జడ్జితో సమానంగా చెల్లిస్తారు. ∙పదవీ కాలంలో వారు ఎలాంటి ఇతర లాభదాయక పదవులు నిర్వహించరాదు. ఎన్నికల్లో పోటీచేయరాదు. ∙దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 22. -
ఆగస్టు చివర్లో ‘పోలీస్’ ప్రిలిమినరీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖ విడుదల చేసిన 18,428 (సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ తదితర) పోస్టులకు 7,19,840 దరఖాస్తులు వచ్చినట్టు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు ఆదివారం తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో మొదటి దశలో నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు చివరి వారంలో ఉంటుందని స్పష్టంచేశారు. ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. దరఖాస్తుల చివరి రోజు (జూన్ 30)న అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 2015–16 ఏడాదిలో విడుదల చేసిన నోటిఫికేషన్ కన్నా ఈ సారి 6 శాతం ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు. దరఖాస్తుల వివరాలు.. - సివిల్, ఏఆర్, బెటాలియన్, ఎస్పీఎఫ్ తదితర కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 4,79,166 మంది. - సివిల్, ఏఆర్, బెటాలియన్ సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 1,88,715 మంది. - ఐటీ విభాగం సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు 13,944 మంది, ఐటీ విభాగం కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంది 14,986 మంది. - అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్స్ బ్యూరో) పోస్టుల కోసం వచ్చిన దరఖాస్తులు 7,700. - కానిస్టేబుల్ (డ్రైవింగ్) పోస్టులకు 13,458 దరఖాస్తులు, కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు వచ్చిన దరఖాస్తులు 1,871. - మొత్తం దరఖాస్తుల్లో మహిళా అభ్యర్థులు 1,15,653 (16 శాతం) మంది. - డ్రైవింగ్, మెకానిక్ విభాగంలో తప్ప మిగిలిన అన్ని విభాగాల్లోని సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, వార్డర్ తదితర పోస్టులకు నల్లగొండ జిల్లా నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. డ్రైవింగ్, మెకానిక్ విభాగాల పోస్టులకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. - 51 శాతం దరఖాస్తులు కేవలం జూన్ 25 నుంచి జూన్ 30లోపు వచ్చినవే. అలాగే జూన్ 29 ఒక్కరోజే 75,516 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. - దరఖాస్తుదారుల్లో 78 శాతం మంది అభ్యర్థులు తెలుగు మీడియంలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వగా, 21 శాతం మంది ఇంగ్లిష్, 0.22 అభ్యర్థులు ఉర్దూ మీడియంలో రాసేందుకు ఆప్షన్లు ఇచుకున్నారు. - దరఖాస్తుదారుల్లో బీసీ కేటగిరీకి చెందిన వారు 52 శాతం కాగా, ఎస్సీ కేటగిరీ నుంచి 21 శాతం, ఎస్టీ కేటగిరీ నుంచి 17 శాతం, 9.5 శాతం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులున్నారు. అలాగే 10,527 మంది ఎక్స్సర్వీస్మెన్లు కూడా వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. -
బ్యూరొక్రాట్లుగా ప్రైవేట్ నిపుణులు
న్యూఢిల్లీ: పలు కీలక ప్రభుత్వ విభాగాల్లో సీనియర్ స్థాయి ఉన్నతాధికారుల పోస్టులకు పబ్లిక్, ప్రైవేటు రంగాల్లోని నిపుణులకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశ నిర్మాణానికి దోహదం చేసే ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం.. రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎకనమిక్ అఫైర్స్, వ్యవసాయం, రైతు సహకారం, సంక్షేమం, రోడ్డు రవాణా, హైవేలు, నౌకాయానం, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, నూతన, పునరుత్పాదక ఇంధనం, పౌర విమానయానం, వాణిజ్య మంత్రిత్వ శాఖలకు నిపుణులైన పది మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కావాలని ప్రభుత్వం ప్రకటించింది. లేటరల్ రిక్రూట్మెంట్ కింద ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారిని మూడేళ్ల కాల పరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో జాయింట్ సెక్రటరీలుగా నియమిస్తామని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ కాంట్రాక్టు గడువును పనితీరు ఆధారంగా ఐదేళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, అలాగే వివిధ పథకాల అమలులో జాయింట్ సెక్రటరీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు వివిధ మంత్రిత్వ శాఖల్లో అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, వాటి అనుబంధ సర్వీసుల నుంచి వచ్చే సెక్రటరీ, అదనపు సెక్రటరీల కింద పనిచేయాల్సి ఉంటుంది. వేతనం నెలకు రూ.1.44 లక్షల నుంచి 2.18 లక్షలు. దరఖాస్తులకు ఆఖరి తేదీ జూలై 30. సంఘీలకు స్థానం కల్పించేందుకే ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగాల్లో ‘సంఘీ’ (ఆరె స్సెస్ వ్యక్తులు)లను కూర్చోబెట్టడానికే ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. -
రాజకీయ ఒత్తిళ్లు
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్:ఏళ్ల తరబడి పెండింగులో ఉండిపోయి న బోధకుల నియామక ప్రక్రియ మళ్లీ ఊపందుకున్న తరుణంలో అదేస్థాయిలో రాజకీ య ఒత్తిళ్లు తీవ్రతరమవుతున్నాయి. ఈ ఒత్తిళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తూనే మరోపక్క నియామకాల ఫైలు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారులు సిద్ధం చేసి, గవర్నర్ నామినీ ఆమోదం కోసం పంపారు. స్థానికంగా జరగాల్సిన మిగతా ప్రక్రియను కూడా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్నీ అనుకున్నట్లు జరి గితే త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఏర్పాటైన తర్వాత 2009లో మాత్రమే నియామకాలు జరిగాయి. అప్పట్లో కొత్తగా ప్రారంభించిన బయోటెక్నాలజీలో నలుగురు, సోషల్ వర్కులో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. కానీ 2008 జూన్ 25న యూనివర్సిటీ ఏర్పడిన నేపథ్యంలో అప్పటి వరకు ఇక్కడ పనిచేస్తూ మాతృసంస్థ ఏయూకు వెళ్లిపోయిన బోధకుల స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ఫలితంగా వర్సిటీ పలు విధాలుగా నష్టపోతోంది. యూజీసీ12బి గుర్తింపుతోపాటు, ఆ సంస్థ నిధులకూ నోచుకోవడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు బోధన కుంటుపడుతోంది. ప్రస్తుతం కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో ఇద్దరు, రూరల్ డెవలప్మెంట్లో ఇద్దరు, ఎకనామిక్స్‌లో ఒక ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. ఇంతకాలం ఒప్పంద బోధకులతోనే నెట్టుకొస్తున్నారు. ‘సాగు’తున్న నియామక ప్రక్రియ బోధన సిబ్బంది లోటును పూడ్చేందుకు 2011లో చేపట్టిన నియామక ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆ ఏడాది జనవరిలో 34 మంది బోధకుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే నిర్ణీత కాలపరిమితిలోగా నియామకాలు జరపలేకపోయారు. దాంతో అవే పోస్టులకు ఈ ఏడాది జూన్ 22న మళ్లీ 8 ప్రొఫెసర్, 7 అసోసియేట్ ప్రొఫెసర్, 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 512 దరఖాస్తులు అందగా, పరిశీలన అనంతరం 400 దరఖాస్తులు అర్హమైనవిగా నిలిచాయి. అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా ఒక జాబితా సిద్ధం చేశారు. మరోవైపు ఉన్నత విద్యామండలి ఇటీవలే 15 పోస్టులు మంజూరు చేయడంలో ప్రస్తుత నియామక ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీకి వర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే గవర్నర్ నామినీ నియామకం ఇక్కడ కీలకం. దాని కోసమే వర్సిటీ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆ నియామకం జరిగిన వెంటనే ఇక్కడ నియామక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటుంది. రాజకీయ సిఫార్సులు అర్హుల జాబితా సిద్ధం చేసిన వర్సిటీ అధికారులు ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న తరుణంలోనే రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వర్శిటీలో కొన్నేళ్లుగా ఒప్పంద బోధకులుగా పని చేస్తున్న వారు, ఈ పోస్టులపై ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామన్న ఆశతో బయట నుంచి వచ్చే అవకాశాలను సైతం వదులుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు జరిగితే తాము నష్టపోతామని వీరు ఆందోళన చెందుతున్నారు. కాగా నెట్,స్లెట్, డాక్టరేట్ వంటి అర్హతలున్నవారికి అవకాశం ఇవ్వక తప్పదు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఆశించే వారు తప్పనిసరిగా ఏదో ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్న వారై ఉండాలి. అక్కడి సీనియారిటీని వదులుకోవడానికి సిద్ధపడాలి. ఇవన్నీ తెలిసినా.. చాలా మంది అభ్యర్థులు రాజకీయ సిపార్సులతో వ ర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల సిపార్సు లేఖలతో రోజూ పదుల సంఖ్యలో అభ్యర్థులు వీసీ కార్యాలయానికి వస్తున్నారు. మరికొందరు ప్రలోభాలు చూపి పోస్టులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు.