సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామక ప్రక్రియకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. నియామకాలకు ఏ నిబంధనలు తీసుకురావాలి అనే దానిపై స్పష్టత కనిపించడంలేదు. మరోవైపు తమ ప్రాధాన్యత తగ్గిస్తూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడాన్ని వర్సిటీల వీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టుల భర్తీని ఎప్పట్లా ఎవరికి వారే కాకుండా ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బోర్డు ఏర్పాటును కూ డా ప్రకటించింది. ఈ బోర్డుకు చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వం వహిస్తారు. ఉన్నత విద్యా విభాగం ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కాలేజీ విద్య కమిషనర్ సభ్యులుగా ఉంటారు.
ఈ తరహా నిర్ణయం మాత్రమే జరిగింది తప్ప ఇంత వరకూ బోర్డు సభ్యులు భేటీ కాలేదు. వర్సిటీల వీసీలతో సంప్రదించి విధివిధానాలు ఖరారు చేయాలా లేక సొంతంగా చేస్తే ఏమైనా సమస్యలు ఉంటాయా? అనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే విధివిధానాలపై ముందుకు వెళ్లలేకపోతున్న ట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి.
భారీగా ఖాళీలు..
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,828 మంజూరైన పోస్టులున్నాయి. వాటిలో ఇప్పటికీ 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 2017లో ఒకసారి విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. అందులో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటివరకూ ఈ పోస్టుల భర్తీ కార్యాచరణకు నోచుకోలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరుతో అధికారులు కాలయాపన చేస్తూ వస్తున్నారు.
ఈలోగా కొందరు రిటైర్ కావడంతో 2021 జనవరి నాటికి వర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ స్థాయిలో ఖాళీలు ఏర్పడటంతో ప్రభుత్వం తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన సాగిస్తోంది. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలొస్తున్నా యి. ఈ నేపథ్యంలోనే నియామక ప్రక్రియకు బో ర్డు వేసినా ముందడుగు పడకపోవడంతో అధ్యా పక పోస్టులు ఆశిస్తున్న వారిలో నిరాశ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment