
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి శాసనసభలో ఆమో దించిన బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్రవేయగానే రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తెలిపారు. యూనివర్సిటీల్లోని 1,062 పోస్టు లను వెంటనే భర్తీ చేయాలని పీ.హెచ్‌డీ స్కాలర్లు శుక్రవారం ఆయనను కలిసి వినతి పత్రం అందచేశారు.
దీనిపై స్పందించిన వినోద్‌కుమార్ అధ్యాపక నియామకాల కోసం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ సభలో బిల్లును ఆమోదించిన అంశాన్ని గుర్తు చేశారు. బిల్లు సభలో పాసైనా.. గవర్నర్ ఆమోదిస్తేనే అది చట్టంగా మారుతుందన్నారు. గవర్నర్ త్వరలోనే ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నట్లు వివరించారు. త్వరగా ఆమోదం పొందేలా ప్రయత్నించాలని ఆ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారు కోరారు. వినోద్ కుమార్‌ను కలిసిన బృందంలో జి. వినయ్, ఎం.సంతోష్ కుమార్, ఎస్. సత్యమూర్తి, జే. ప్రశాంత్, ఎల్.కామ్రేడ్, సురేష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment