teaching posts
-
వైద్య కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టులను కాంట్రాక్టు, గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 3,155 పోస్టులను కాంట్రాక్టు, 1,201 పోస్టులను గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయనుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్ 412, సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 1,201 భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అంటే ఏడాది కాలానికి వీరిని నియమిస్తారు. మెడికల్ కాలేజీల్లో జాతీ య మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు చేయనున్నందున పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించారు. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయా లజీ, ఫోరెన్సిక్ మెడిసిన్,కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, ఆర్ధోపెడిక్స్, గైనకాలజీ, రేడియాలజీ, అనెస్థీషియా, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. స్థానికులకు ప్రాధాన్యత ఈ నెల 16వ తేదీన ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ప్రొఫెసర్ పోస్టుకు 8 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెల వేతనం రూ.1.90 లక్షలు కాగా, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు, సీనియర్ రెసిడెంట్‌కు రూ.92,575, ట్యూటర్కు రూ.55 వేలు ఇవ్వనున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. అయితే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. స్థానికులు లేనప్పుడు ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయస్సు ఈ నెల 31వ తేదీ నాటికి 69 ఏళ్లకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయం: మంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏటా రూ.634 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. -
నిరుద్యోగులతో సర్కారు చెలగాటం
సైదాబాద్ (హైదరాబాద్): ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు, గురుకుల పాఠశాలల్లోని 12 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడా తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. శనివారం సైదాబాద్ డివిజన్ గడ్డిఅన్నారంలోని రామయ్య కోచింగ్ సెంటర్ హాల్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోతే.. నిరుద్యోగులతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే భర్తీ
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి శాసనసభలో ఆమో దించిన బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్రవేయగానే రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తెలిపారు. యూనివర్సిటీల్లోని 1,062 పోస్టు లను వెంటనే భర్తీ చేయాలని పీ.హెచ్డీ స్కాలర్లు శుక్రవారం ఆయనను కలిసి వినతి పత్రం అందచేశారు. దీనిపై స్పందించిన వినోద్‌కుమార్ అధ్యాపక నియామకాల కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ సభలో బిల్లును ఆమోదించిన అంశాన్ని గుర్తు చేశారు. బిల్లు సభలో పాసైనా.. గవర్నర్ ఆమోదిస్తేనే అది చట్టంగా మారుతుందన్నారు. గవర్నర్ త్వరలోనే ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నట్లు వివరించారు. త్వరగా ఆమోదం పొందేలా ప్రయత్నించాలని ఆ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారు కోరారు. వినోద్ కుమార్‌ను కలిసిన బృందంలో జి. వినయ్, ఎం.సంతోష్ కుమార్, ఎస్. సత్యమూర్తి, జే. ప్రశాంత్, ఎల్.కామ్రేడ్, సురేష్ తదితరులు ఉన్నారు. -
మోడల్ స్కూళ్లలో 282 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 282 టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో 71 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులున్నాయి. అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జోన్ల వారీగా సెలెక్షన్ కమిటీల ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతాయి. టీజీటీ పోస్టులు జోన్ 1లో 17, జోన్ 3లో 23, జోన్ 4లో 31 ఉండగా పీజీటీ పోస్టులు జోన్ 1లో 33, జోన్ 2లో 4, జోన్ 3లో 50, జోన్ 4లో 124 ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ‘హెచ్‌టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. ఇటీవలి పాస్‌పోర్టు సైజు ఫొటో, స్పెసిమన్ సిగ్నేచర్ స్కాన్డ్ కాపీలను స్పష్టంగా కనిపించేలా అప్లోడ్ చేయాలి. అభ్యర్థులకు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు. పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పీజీటీ కామర్స్ పోస్టులకు ఎం.కామ్ అప్లయిడ్ బిజినెస్ ఎకనమిక్స్ చేసిన వారు అర్హులు కారు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేదా యూజీసీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ కోర్సు పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులలో బీఈడీ తదితర ప్రొఫెషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హతలు, వెయిటేజీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పొందుపరిచింది. ఎంపికల అనంతరం నిబంధనల ప్రకారం అభ్యర్థులు నిర్ణీత కాంట్రాక్టు ఒప్పందాలను పూర్తిచేశాక నియామకాలు పొందుతారు. ఎప్పుడైనా డీఎస్సీ ద్వారా రెగ్యులర్ టీచర్లు నియామకమైతే వీరి కాంట్రాక్టు ఆటోమేటిగ్గా రద్దు అవుతుంది. -
బోర్డు సరే.. విధివిధానాలెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామక ప్రక్రియకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. నియామకాలకు ఏ నిబంధనలు తీసుకురావాలి అనే దానిపై స్పష్టత కనిపించడంలేదు. మరోవైపు తమ ప్రాధాన్యత తగ్గిస్తూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడాన్ని వర్సిటీల వీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టుల భర్తీని ఎప్పట్లా ఎవరికి వారే కాకుండా ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బోర్డు ఏర్పాటును కూ డా ప్రకటించింది. ఈ బోర్డుకు చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వం వహిస్తారు. ఉన్నత విద్యా విభాగం ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, కాలేజీ విద్య కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ తరహా నిర్ణయం మాత్రమే జరిగింది తప్ప ఇంత వరకూ బోర్డు సభ్యులు భేటీ కాలేదు. వర్సిటీల వీసీలతో సంప్రదించి విధివిధానాలు ఖరారు చేయాలా లేక సొంతంగా చేస్తే ఏమైనా సమస్యలు ఉంటాయా? అనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే విధివిధానాలపై ముందుకు వెళ్లలేకపోతున్న ట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. భారీగా ఖాళీలు.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,828 మంజూరైన పోస్టులున్నాయి. వాటిలో ఇప్పటికీ 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 2017లో ఒకసారి విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. అందులో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటివరకూ ఈ పోస్టుల భర్తీ కార్యాచరణకు నోచుకోలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరుతో అధికారులు కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఈలోగా కొందరు రిటైర్ కావడంతో 2021 జనవరి నాటికి వర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ స్థాయిలో ఖాళీలు ఏర్పడటంతో ప్రభుత్వం తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన సాగిస్తోంది. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలొస్తున్నా యి. ఈ నేపథ్యంలోనే నియామక ప్రక్రియకు బో ర్డు వేసినా ముందడుగు పడకపోవడంతో అధ్యా పక పోస్టులు ఆశిస్తున్న వారిలో నిరాశ నెలకొంది. -
AP: 8,000 పోస్టులు సత్వరం భర్తీ
ఉన్నత విద్యలో టీచింగ్ పోస్టుల భర్తీలో సమర్థతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు ఉండాలి. రెగ్యులర్ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియామకాలు జరగాలి. ఇందు కోసం ప్రతిపాదనలు తయారు చేయాలి. పోలీసు ఉద్యోగాల భర్తీపై పోలీసు విభాగం, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో వీలైనంత త్వరగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. వచ్చే నెల మొదటి వారంలో దానిని నాకు నివేదించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: జాబ్ క్యాలెండర్ (202122)లో మిగిలిన సుమారు 8 వేల పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 202122 ఆర్థిక సంవత్సరంలో 39,654 పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఇవి కాక ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మరో 50 వేల మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని చెప్పారు. ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్మెంట్, ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమగ్రంగా చర్చించారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బ్యాక్‌లాక్ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌ను సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే.. జాబ్ క్యాలెండర్‌పై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గడువులోగా మిగిలిన పోస్టుల భర్తీ ► జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన వాటి రిక్రూట్మెంట్పై కార్యాచరణ రూపొందించుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యా శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబర్‌లోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలి. నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ► విద్య, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నాం. ఇక్కడ ఖాళీలు భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు. ► ఈ సమీక్షలో డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ కార్యదర్శి (సర్వీసులు హెచ్ఆర్ఎం) హెచ్ అరుణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ► 202122లో 39,654 పోస్టుల భర్తీ. ► ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 39,310 పోస్టుల్లో నియామకాలు పూర్తి. ► గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్మెంట్ ఈ ఒక్క ఏడాదిలో పూర్తి. ► 16.5 శాతం పోస్టులను, అంటే సుమారు 8 వేల పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ► ఇందులో 1,198 పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నాయి. -
ఇంటర్వ్యూలు కట్.. మెరిట్‌కే మార్కులు
సాక్షి, అమరావతి: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచింగ్ పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావిచ్చే ఇంటర్వ్యూల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అభ్యర్థుల అర్హతలు, అనుభవం ప్రాతిపదికగా మెరిట్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను సమగ్ర శిక్ష అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అభ్యంతరాలకు 4 రోజుల పాటు అవకాశం కేజీబీవీల్లో మొత్తం 958 పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగియగా గురువారం పరిశీలన నిర్వహించారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం లాంటి అంశాల ప్రాతిపదికగా ప్రొవిజినల్ మెరిట్ జాబితాను శుక్రవారం ఆయా జిల్లాల్లో ప్రకటించనున్నారు. ప్రతి అభ్యర్థి వివరాలను అందులో పొందుపర్చనున్నారు. వీటిపై ఎవరికైనా సందేహాలున్నా, అభ్యంతరాలున్నా అప్పీళ్లకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. 11వ తేదీ నుంచి 14వ తేదీవరకు నాలుగు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మొత్తం 100 మార్కులు అర్హతలు, అనుభవం తదితర అంశాలకు 100 మార్కులను కేటాయించారు. అభ్యర్థులకు వచ్చే గరిష్ట మార్కులను బట్టి మెరిట్‌ను నిర్ణయించనున్నారు. గరిష్ట మార్కులు సాధించిన వారు అగ్రభాగాన నిలువనున్నారు. కేజీబీవీల్లో రెండేళ్లు ఆపై పనిచేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్లు ప్రకటించినా వారికి మార్కులు కేటాయించలేదు. అర్హతలు, అనుభవం తదితర అంశాల్లో ఇతర అభ్యర్థులతో సమాన స్థాయిలో నిలిచిన వారికి కేజీబీవీల్లో పనిచేసిన అనుభవం ఉంటే మెరిట్ లిస్టులో ప్రాధాన్యం ఇస్తారు. సమాన మార్కులు వస్తే? అర్హతలు, అనుభవం అంశాలలో సమానంగా ఉన్న వారి విషయంలో ఎక్కువ వయసు వారికి ప్రాధాన్యమిస్తారు. అందులోనూ సమానంగా ఉంటే వరుస క్రమంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ–ఏ, బీ, సీ, డీ, తదుపరి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. విద్యార్హతల పరంగా వరుసగా పీజీ, గ్రాడ్యుయేషన్, ఇంటర్, టెన్త్ మార్కులను అనుసరించి మెరిట్ నిర్ణయిస్తారు. విద్యార్హతల్లో సమానంగా ఉంటే ప్రొఫెషనల్ అర్హతల్లో మెరిట్‌ను ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు గత సర్కారు కేజీబీవీల్లో ఎంపిక ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో దరఖాస్తులు తీసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించి జాబితాను జిల్లా అధికారులతో కూడిన కమిటీకి అప్పగించాయి. ఈ వ్యవహారంలో ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడ్డాయి. నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాయి. ఒక్కో పోస్టును రూ.లక్షల్లో విక్రయించాయి. డబ్బులిచ్చిన వారికి ఇంటర్వ్యూలలో ఎక్కువ మార్కులు కేటాయించి మెరిట్ జాబితాలో చోటు కల్పించారు. ఈ అక్రమాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీల విధానాన్ని రద్దు చేశారు. అవుట్సోర్సింగ్ నియామకాలకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా కేజీబీవీల్లో కాంట్రాక్టు విధానంలో టీచర్ల నియామకాలు పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టీచర్ల నియామకాలను చేపట్టినట్లు కేజీబీవీ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. -
ఏఎన్‌యూలో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ).. టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు–03, నాన్ టీచింగ్ పోస్టులు–04. ► టీచింగ్ పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్(రూరల్ డెవలప్మెంట్, కంప్యూటర్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్(ఇంగ్లిష్). అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► నాన్ టీచింగ్ పోస్టులు: స్వీపర్, క్లీనర్, యుటెన్సిల్ క్లీనర్, మార్కర్. అర్హత: మార్కర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మిగతా పోస్టులకు సంబంధిత పని అనుభవంతోపాటు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. వేతనం: నెలకు రూ.13,000 నుంచి రూ.40,270 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 ► వెబ్సైట్: https://www.nagarjunauniversity.ac.in/indexanu.html ఏపీవీవీపీ, అనంతపురంలో వివిధ ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాల యం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్/ఎంబీబీఎస్ డాక్టర్–01, నర్సు(ఏఎన్ఎం)–02, కౌన్సిలర్– 03, డేటాఎంట్రీ ఆపరేటర్–01, వార్డ్బాయ్–02. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎనిమిది, పదో తరగతి/ఇంటర్మీడియట్ (ఎంపీహెచ్(ఎఫ్) ట్రెయినింగ్), గ్రాడ్యుయేషన్, పీజీ డిగ్రీ/ డిప్లొమా(సైకియాట్రీ మెడిసిన్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యం ఉండాలి. ► వయసు: 42 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సీనియారిటీ ప్రాతిపదికన ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, అనంతపురం చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021 ► వెబ్సైట్: ananthapuramu.ap.gov.in గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, నెల్లూరులో 13 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 13 ► పోస్టుల వివరాలు: వాచ్మెన్–02, క్లీనర్/వ్యాన్ అటెండెంట్–01, ఆయాలు–01, స్వీపర్లు–01, ల్యాబ్ అటెండెంట్లు–01, కుక్స్–03, కిచెన్ బాయ్/టేబుల్ బాయ్–02, తోటీ/స్వీపర్–02. ► అర్హత: ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు పదో తరగతి, మిగతా అన్ని పోస్టులకు ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నెల్లూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021 ► వెబ్సైట్: spsnellore.ap.gov.in -
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 2019కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చూస్తోంది. పోస్టుల సంఖ్య: 8000 (టీజీటీ, పీజీటీ, పీఆర్టీ). ఎంపిక: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్టు, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా స్కూల్స్ ఇచ్చే ప్రకటనకు అనుగుణంగా తదుపరి నియామక ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లకు మించరాదు. ఐదేళ్ల బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 57 ఏళ్లు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరితేదీ: 22.09.2019. దరఖాస్తు ఫీజు: రూ.500 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్టు తేదీ: అక్టోబర్ 19,20, 2019 ఫలితాల వెల్లడి: 30.10.2019 వెబ్సైట్: http://aps-csb.in -
డిగ్రీ కాలేజీల్లో 2,576 పోస్టులు
-
డిగ్రీ కాలేజీల్లో 2,576 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2,576 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే వీటికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత పోస్టుల భర్తీకి సంబంధించిన చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కళాశాల విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ 885 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. డిగ్రీ కాలేజీల్లో పోస్టులకు సీఎం ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీకి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించాయి. అధ్యాపక పోస్టులే అత్యధికం సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 2,576 పోస్టుల్లో అధ్యాపక పోస్టులే అత్యధికంగా ఉన్నాయి. 15 ప్రిన్సిపాల్, 1,214 డిగ్రీ లెక్చరర్, 67 ఫిజికల్ డైరెక్టర్, 64 లైబ్రేరియన్, 24 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 1,192 బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం ఓకే చెప్పినట్లు తెలిసింది. 14 పాలిటెక్నిక్ కాలేజీల్లో.. మరోవైపు 14 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 686 పోస్టుల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో 320 బోధన సిబ్బంది పోస్టులు ఉండగా, 366 బోధనేతర సిబ్బంది పోస్టులు ఉన్నాయి. మరో 11 సెకండ్ షిప్ట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోనూ 199 పోçస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు కేటగిరీల కాలేజీల్లో 399 బోధన సిబ్బంది (లెక్చరర్) పోస్టులు ఉన్నాయి. వాటి భర్తీకి కూడా త్వరలోనే ఆమోదం లభించనుందని సాంకేతిక విద్యాశాఖ భావిస్తోంది. ఇందులో 90 శాతం పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుందని, 10 శాతం పోస్టులను పదోన్నతులపై భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. -
అధ్యాపక పోస్టుల భర్తీకి సన్నాహాలు !
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఎన్నికల కోడ్ ఉన్నా ఎస్వీయూలో మాత్రం అధ్యాపక పోస్టుల భర్తీకి అధికారుల ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఇదంతా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం చేస్తున్న ప్రక్రియేనని విమర్శలు వస్తున్నారుు. ఎస్వీయూలో 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎలాంటి పోస్టులు భర్తీచేయరాదు. ఖాళీల భర్తీకోసం ముందుగా ప్రయత్నం మొదలైనప్పటికీ, ప్రక్రియ ఎక్కడికక్కడే ఆపాల్సి ఉంది. తాత్కాలిక నియామకాలు కూడా చేయకూడదని ఎన్నికల నియామవళి చెబుతోంది. ఎన్నికల నిబంధనలు కఠినంగా ఉన్న నేపథ్యంలో ఎస్వీయూ అధ్యాపక పోస్టుల భర్తీ జరిగేది అనుమానమే. అయితే ఎస్వీయూ అధికారులు మాత్రం పోస్టులభర్తీకి ఈ నెల 26 నుంచి ఇంటర్వ్యూలు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్వ్యూల ద్వారా కిరణ్‌కు రాజకీయలబ్ధి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియకు యూనివర్సిటీ వీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుత వీసీ రాజే ంద్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులతో నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అధ్యాపక నియామక ప్రక్రియలో ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గానికి ఉద్యోగాలు కట్టబెట్టే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకానీ, ఆయన నూతనంగా పెట్టబోయే రాజకీయ పార్టీకి కాని రాజకీయలబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెడితే కూడా, ఇంట ర్వ్యూల్లో ఎవరిని ఉద్యోగాలకు ఎంపిక చేశారో తెలుసుకోవడం పెద్దకష్టం కాదు. ఫలితంగా ఏదోఒక పార్టీకి రాజకీయ లబ్ధి జరిగే ప్రమాదం ఉంది. 26 నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భ ర్తీకి ఈనెల 26 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఎస్వీయూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఇంజినీరింగ్ సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు జరిపి తర్వాత సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. దీనికోసం పరిపాలనా విభాగం మొత్తం అవిశ్రాంతంగా పనిచేస్తోంది. పోస్టులు భర్తీ చేయాలన్న తాపత్రయంలో అధికారులు మిగతా అంశాలకు ప్రాధాన్యం తగ్గించి వీటిపైనే దృష్టిసారించారు. ఐదు జిల్లాలపై ప్రభావం ఎస్వీయూ రీజియన్‌లో రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎస్వీ యూనివర్సిటీలో 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జరిగితే ఐదు జిల్లాలపై రాజకీయప్రభావం ఉంటుందని విద్యార్థిసంఘాలు పేర్కొంటున్నాయి. ఎన్నికలు ముగిసేవరకు ఇంటర్వ్యూల ప్రక్రియ నిలిపివేసి, అనంతరం నిర్వహించాలని విద్యార్థి నేతలు కోరుతున్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఆపాలి మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎస్వీయూలో అధ్యాపక పోస్టులభర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించరాదు. ఇప్పటికే ఎస్వీయూ అధ్యాపక పోస్టులు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులకు అమ్ముడుపోయినట్టు ప్రచారం జరుగుతోంది. పోస్టుల భర్తీకి ఇప్పుడు ఇంటర్వ్యూలు జరిపితే కిరణ్ వర్గీయులకే దక్కుతాయి. అందువల్ల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే పార్టీకి రాజకీయంగా మేలు చేకూరుతుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు పోస్టుల భర్తీ నిలిపివేయాలి. - వి.హరిప్రసాద్‌రెడ్డి, ఎస్వీయూ కన్వీనర్, వైస్సార్ సీపీ విద్యార్థి విభాగం