![Panel Led By Kapil Dev to Pick Head Coach And National Selectors - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/18/KAPIL-MADAME-TUSSAUDS5.jpg.webp?itok=wqECXfSN)
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ నియామక ప్రక్రియను దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి అప్పగించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల మండలి (సీవోఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటనేదీ రాకున్నా ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మిగతా కోచింగ్, సహాయక సిబ్బంది నియామకం మాత్రం బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి పర్యవేక్షణలో సాగుతుంది. గతంలో సీఏసీ సభ్యులుగా నియమితులైన మేటి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో... వారి స్థానంలో కపిల్ త్రయాన్ని తాత్కాలిక (అడహక్) ప్రాతిపదికపై నియమించారు. ఈ బృందమే డిసెంబరులో మహిళా జాతీయ జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసింది.
సీవోఏ తీరుపై బీసీసీఐ వర్గాల మండిపాటు
ప్రత్యేకించి అక్టోబరు 22న వార్షిక సర్వసభ్య సమావేశం ఉండగా... టీమిండియా కోచింగ్ సిబ్బంది నియామక ప్రకటన విషయంలో సీవోఏకు అంత తొందరేమిటని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి. ఓవైపు ప్రపంచ కప్‌లో భారత్ ప్రదర్శనపై హెడ్ కోచ్, కెప్టెన్‌తో సమీక్ష సమావేశం నిర్వహణ కోరుతూనే, మరోవైపు కోచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరడాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తప్పుబట్టారు. ‘ఈ పరిణామాలు నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. సీవోఏ ఇప్పటికే బోర్డు ఎన్నికలకు తేదీలు వెల్లడించింది. ఇంతలోనే ఇదేమిటి? తమ ఉద్దేశంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరినైనా వారు నియమించాలని, ప్రపంచ కప్ సాధించలేకపోయిన విషయాన్ని మరుగునపర్చాలని అనుకుంటున్నారా’ అని ఆ అధికారి ప్రశ్నించారు. ప్రస్తుత కోచింగ్ సిబ్బంది అందరూ తమతమ నివేదికలు సమర్పించాల్సి ఉన్న నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు. విజయ్ శంకర్ గాయం తీవ్రత సహా, నాలుగో స్థానంపై తీసుకున్న నిర్ణయాలకు బ్యాటింగ్ కోచ్ కీలకమైన నివేదిక ఇవ్వాల్సి ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment