టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశాడు. పాతతరం ఆటగాళ్ల పట్ల కూడా కాస్త ఉదారంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికాడు. మాజీ క్రికెటర్ల బాగోగులు చూసేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.
అన్షుమన్ గైక్వాడ్‌కు బ్లడ్ క్యాన్సర్
కాగా భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గతేడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. అన్షుమన్ చికిత్స కోసం మొహిందర్ అమర్‌నాథ్, సునిల్ గావస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్‌సర్కార్, మదన్ లాల్, రవిశాస్త్రి, కీర్తి ఆజాద్ తదితరులు తమ వంతు సహాయంగా నిధులు సమకూరుస్తున్నారని తెలిపాడు.
బీసీసీఐ సాయం చేయాలి
బీసీసీఐ కూడా చొరవ తీసుకుని అన్షుమన్ గైక్వాడ్‌కు ఆర్థికంగా సహాయం అందించాలని కపిల్ దేవ్ విజ్ఞప్తి చేశాడు. ‘‘ఇది చాలా విచాకరం. నా మనసంతా బాధతో నిండిపోయింది.
అన్షుతో కలిసి క్రికెట్ ఆడిన నేను.. అతడి ప్రస్తుత పరిస్థితిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అతడిని ఆ స్థితిలో చూడలేకపోతున్నాను. ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు.
బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకుంటుందని భావిస్తున్నా. మైదానంలో భయంకరమైన బంతులు విసిరే ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కోవడానికి అన్షు ఎంతో పట్టుదలగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు మనమంతా అతడికి అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉంది. క్రికెట్ ప్రేమికులు అతడి కోసం ప్రార్థించండి’’ అని కపిల్ స్పోర్ట్స్‌స్టార్ ద్వారా విజ్ఞప్తి చేశాడు.
అదే విధంగా.. క్రికెటర్లకు ఆపత్కాలంలో సహాయం అందించేందుకు బీసీసీఐ ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కపిల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇలాంటి సమయంలో క్రికెటర్లను ఆదుకునేందుకు దురదృష్టవశాత్తూ మనకంటూ ఒక స్థిరమైన వ్యవస్థ లేదు.
ట్రస్టు ఏర్పాటు చేయాలి
మా తరంలో ఆటగాకు అంతగా డబ్బు వచ్చేది కాదు. అప్పుడు బోర్డు దగ్గర కూడా అంతగా ధనం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి ఒక్క ఆటగాడు కావాల్సినంత సంపాదించుకోగలుగుతున్నాడు.
సహాయక సిబ్బందికి కూడా వేతనాలు బాగానే ఉన్నాయి. మరి మా సంగతేంటి? సీనియర్ల కోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలి. బీసీసీఐ తలచుకుంటే అదేమీ అంత పెద్ద విషయం కాదు.
కావాలంటే మేమంతా మా పెన్షన్ల నుంచి కొంత విరాళంగా ట్రస్టుకు ఇస్తాం కూడా’’ అని కపిల్ దేవ్ అన్నాడు. మరి బీసీసీఐ కపిల్ విజ్ఞప్తిపై స్పందిస్తుందో లేదో చూడాలి!
టీమిండియా హెడ్ కోచ్‌గానూ
కాగా మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ 1975- 1987 మధ్య టీమిండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. రెండుసార్లు టీమిండియా హెడ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టుల్లో 1985, వన్డేల్లో 269 పరుగులు సాధించాడు.
చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ!
Comments
Please login to add a commentAdd a comment