టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ గతేడాది కాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. ట్రీట్‌మెంట్ ఖరైంది కావడంతో అన్షుమన్ కుటుంబం ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అన్షుమన్ కుటుంబానికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది.
బీసీసీఐ అన్షుమన్ వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయం కింద కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి లభించిన అనంతరం నిధులు విడుదల చేయాలని బీసీసీఐ కార్యదర్శి జై షా బోర్డును ఆదేశించారు. నిధుల విడుదల అనంతరం షా అన్షుమన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మున్ముందు వారికి ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చాడు. అన్షుమన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.
కాగా, 71 ఏళ్ల అన్షుమన్ గైక్వాడ్ 1974-87 మధ్యలో టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 15 వన్డేలు ఆడాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన అన్షుమన్.. టెస్ట్‌ల్లో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1985 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉంది. వన్డేల్లో అన్షుమన్ ఓ హాఫ్ సెంచరీ సాయంతో 269 పరుగులు చేశాడు. పార్ట్ టైమ్ బౌలర్ అయిన అన్షుమన్ టెస్ట్‌ల్లో 2 వికెట్లు, వన్డేల్లో ఓ వికెట్ పడగొట్టాడు.
అన్షుమన్ 1997-2000 మధ్యలో రెండుసార్లు టీమిండియా హెడ్ కోచ్‌గా పని చేశాడు. తొలి దఫా (1997-1999) మూడేళ్లు కోచింగ్ పదవిలో ఉన్న అన్షుమన్.. రెండో దఫా (2000) ఏడాదికాలం భారత హెడ్ కోచ్‌గా సేవలందించాడు. ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతూ, ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్షుమన్‌కు ఆర్దిక సాయం చేయాలని టీమిండియా మాజీలు బీసీసీఐని అభ్యర్దించారు. చాలా మంది నుంచి విన్నపాలను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ కోటి రూపాయల నిధులు విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment