టీమిండియా కోచ్‌ పదవిపై కీలక ప్రకటన చేసిన జై షా | BCCI Confirms Rahul Dravid Contract Extension Ahead Of T20 World Cup | Sakshi
Sakshi News home page

టీమిండియా కోచ్‌ పదవిపై కీలక ప్రకటన చేసిన జై షా

Feb 15 2024 2:31 PM | Updated on Feb 15 2024 2:49 PM

BCCI Confirms Rahul Dravid Contract Extension Ahead Of T20 World Cup - Sakshi

బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియా కోచ్‌ పదవిపై కీలక ప్రకటన చేశాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌ వరకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రాజ్‌కోట్‌ వేదికగా ఇవాళ మొదలైన మూడో టెస్ట్‌కు ముందు షా మాట్లాడుతూ ఇలా అన్నాడు. 

వరల్డ్‌కప్‌ ముగిశాక ద్రవిడ్‌తో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆతర్వాత కూడా టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ కావడంతో ద్రవిడ్‌తో ఎలాంటి మాటామంతి జరపలేదు. రాజ్‌కోట్‌ టెస్ట్‌కు ముందు ద్రవిడ్‌తో మాట్లడే అవకాశం దొరికింది.

టీ20 వరల్డ్‌కప్‌ వరకు అతన్నే కోచ్‌గా కొనసాగాలని కోరాం. అందుకు ద్రవిడ్‌ కూడా సానుకూలంగానే స్పందించాడు.  అనుభవజ్ఞుడైన ద్రవిడ్‌ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అతను టీమిండియాను సమర్దవంతంగా ముందుండి నడిపించగలడు. అతని మార్గనిర్దేశకం భారత జట్టు టీ20 వరల్డ్‌కప్‌లో రాణిస్తుందన్న నమ్మకం ఉంది. ద్రవిడ్‌తో పాటు సహాయక కోచింగ్‌ సిబ్బంది మొత్తం వరల్డ్‌కప్‌ వరకు యధాతథంగా కొనసాగుతారని షా స్పష్టం చేశాడు. దీనికి ముందే షా మరో కీలక ప్రకటన కూడా చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మనే టీమిండియా కెప్టెన్‌గా ఉం‍టాడని స్పష్టం చేశాడు.

కాగా, భారత క్రికెట్‌ జట్టుతో రాహుల్‌ ‍ద్రవిడ్‌ కాంట్రాక్ట్‌ గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌తో ముగిసిందన్న విషయం తెలిసిందే. అయితే రాహుల్‌ సేవల పట్ల సంతృప్తి చెందిన బీసీసీఐ అతన్ని మరో దఫా కోచ్‌గా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. అనేక సంప్రదింపుల అనంతరం రాహుల్‌ బీసీసీఐ ప్రతిపాదనకు ఒప్పుకుని హుటాహుటిన సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరాడు. అప్పట్లో కాంట్రాక్ట్‌ పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయని బీసీసీఐ.. తాజాగా ద్రవిడ్‌ కొనసాగింపుపై స్పష్టమైన హామీ ఇచ్చింది. 

ఇదిలా ఉంటే, రాజ్‌కోట్‌ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా తొలి రోజు టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ (0), రజత్‌ పాటిదార్‌ (5) నిరాశపరచగా.. రోహిత్‌ శర్మ (97 నాటౌట్‌), రవీంద్ర జడేజా (68 నాటౌట్‌) టీమిండియాను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 152 పరుగులు జోడించి, టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించే దిశగా తీసుకెళ్తున్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 2, టామ్‌ హార్ట్లీ ఓ వికెట్‌ పడగొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement