Cricket Advisory Committee
-
"గంగూలీతో విభేదాలు నిజమే.." రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Opens Up On His Alleged Spat With Ganguly In 2016: టీ20 ప్రపంచకప్-2021 నుంచి టీమిండియా నిష్క్రమించిన అనంతరం కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2016లో తనకు నాటి క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీకి మధ్య మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశాడు. నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం జరిగిన ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ సీఏసీ సభ్యులుగా ఉన్నారని, ఆ ఇంటర్వ్యూకి వెళ్లేముందు తాను హెడ్ కోచ్‌గా అయితే ఏమేం చేయగలనో ఓ లెటర్ రాసి పెట్టుకున్నానని తెలిపాడు. అయితే సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి ఆ లెటర్ మిస్ అయ్యిందని, కమిటీ ముందు ఆ విషయం చెప్పడం నాకు చిన్నతనంగా అనిపించిందని, అందుకే ఉన్న విషయం కమిటీ ముందు చెప్పగా నా గురించి బాగా తెలిసిన గంగూలీకి అది నచ్చలేదని తెలిపాడు. ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ మీడియా దాన్ని ఎక్కువ చేసి ప్రచారం చేసిందన్నాడు. గంగూలీది, తనది చాలా పాత పరిచయమని, గంగూలీ తనకు జూనియర్ అని, గతంలో దాదా.. టైమ్స్ షీల్డ్ టోర్నీలో టాటా స్టీల్‌కి ఆడుతున్నప్పుడు తాను కెప్టెన్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాగా, 2019లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక టీమిండియాపై కోచ్ రవిశాస్త్రి ప్రభావం తగ్గిందన్న వార్తలు చాలాకాలం వరకు వినిపించాయి. తాజాగా రవి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ వార్తలు వాస్తవమేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచ కప్-2021తో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో.. గంగూలీ తన ఆప్తుడైన రాహుల్ ద్రవిడ్ కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.. ? మిరాకిల్ అంటున్న విశ్లేషకులు -
పొవార్ మళ్లీ వచ్చాడు...
దాదాపు రెండున్నరేళ్ల క్రితం భారత మహిళల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ రమేశ్ పొవార్. ఆ తర్వాత డబ్ల్యూవీ రామన్ ఆ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు రామన్‌కు కొనసాగింపు ఇవ్వని బీసీసీఐ, ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌కే మరో అవకాశం కల్పించింది. నాడు మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత పొవార్ తన పదవి పోగొట్టుకోగా... టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్ చేరిన తర్వాత కూడా రామన్‌కు మరో అవకాశం దక్కకపోవడం విశేషం. ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రమేశ్ పొవార్ నియమితుడయ్యాడు. మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్ సభ్యులుగా ఉన్న బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ ద్వారా పొవార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ పదవి కోసం 35 మంది పోటీ పడటం విశేషం. ఇందులో ఇప్పటి వరకు కోచ్‌గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్‌తోపాటు హృషికేశ్ కనిత్కర్, అజయ్ రాత్రా, మమతా మాబెన్, దేవిక పల్షికర్, హేమలత కలా, సుమన్ శర్మ తదితరులు ఉన్నారు. ‘పొవార్ చాలా కాలంగా కోచింగ్‌లో ఉన్నాడు. జట్టు కోసం అతను రూపొందించిన విజన్ మాకు చాలా నచ్చింది. టీమ్‌ను అత్యున్నత స్థాయికి చేర్చేందుకు అతని వద్ద చక్కటి ప్రణాళికలు ఉన్నాయి. ఆటపై అన్ని రకాలుగా స్పష్టత ఉన్న పొవార్ ఇకపై ఫలితాలు చూపించాల్సి ఉంది’ అని ïసీఏసీ సభ్యుడు మదన్‌లాల్ వెల్లడించారు. 42 ఏళ్ల పొవార్‌ను ప్రస్తుతం రెండేళ్ల కాలానికి కోచ్‌గా నియమించారు. మహిళల సీనియర్ టీమ్‌తో పాటు ‘ఎ’ టీమ్, అండర్–19 టీమ్‌లను కూడా అతనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. మిథాలీ రాజ్‌తో వివాదం తర్వాత... రమేశ్ పొవార్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత మహిళల జట్టు వరుసగా 14 టి20 మ్యాచ్‌లు గెలిచింది. అతడిని మొదటిసారి జూలై 2018లో జట్టుకు హెడ్ కోచ్‌గా తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ వరకు కాంట్రాక్ట్ పొడిగించారు. ఈ టోర్నీలో భారత్ సెమీఫైనల్ వరకు చేరింది. ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్లతో భారత్ చిత్తుగా ఓడిన ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే టోర్నీ ముగిశాక పొవార్‌పై మిథాలీ తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగా నా కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు’ అంటూ పొవార్‌పై మిథాలీ నిప్పులు చెరిగింది. దీనిపై పొవార్ కూడా గట్టిగా బదులిచ్చాడు. ఓపెనర్‌గా అవకాశం ఇవ్వకపోతే టోర్నీ మధ్యలో తప్పుకుంటానని మిథాలీ బెదిరించిందని, జట్టులో సమస్యలు సృష్టించిందని పొవార్ వ్యాఖ్యానించాడు. తదనంతర పరిణామాల్లో పొవార్‌ను కోచ్ పదవి నుంచి బోర్డు తప్పించింది. టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన కలిసి పొవార్‌నే కొనసాగించమంటూ బీసీసీఐకి ప్రత్యేకంగా లేఖ రాసినా బోర్డు పట్టించుకోలేదు. రమేశ్ పొవార్ కెరీర్... ఆఫ్‌స్పిన్నర్‌గా భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన రమేశ్ పొవార్ 40 వికెట్లు పడగొట్టాడు. ముంబైకి చెందిన పొవార్ ఫస్ట్ క్లాస్ కెరీర్లో 470 వికెట్లు, 4,245 పరుగులు ఉన్నాయి. ఐపీఎల్లో అతను పంజాబ్ కింగ్స్ ఎలెవన్, కొచ్చి టస్కర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్‌గా ఈసీబీ లెవల్–2 సర్టిఫికెట్ అతనికి ఉంది. మహిళల జట్టు కోచ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఎన్సీఏలో కోచ్‌గా పని చేసిన పొవార్ శిక్షణలోనే ముంబై ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో విజేతగా నిలిచింది. రామన్‌కు అవకాశం దక్కేనా? డబ్ల్యూవీ రామన్ 2018 డిసెంబర్లో మహిళల జట్టు కోచ్‌గా ఎంపికయ్యారు. కానీ గత రెండున్నరేళ్లలో కరోనా దెబ్బకు పెద్దగా మ్యాచ్‌లే జరగలేదు. 2020 మార్చిలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్... ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత ఏడాదిపాటు టీమ్ బరిలోకి దిగలేదు. గత మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 1–4తో... టి20 సిరీస్‌ను 1–2తో ఓడిపోయింది. ఇదే రామన్‌పై వేటుకు కారణం కావచ్చు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఒక సిరీస్‌లో ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం ఆశ్చర్యకరం. నిజానికి కోచ్‌గా రామన్‌కు మంచి గుర్తింపు ఉంది. టెక్నిక్‌పరమైన అంశాల్లో తమ ఆటతీరు ఆయన వల్లే మెరుగైందని భారత అమ్మాయిలు పలు సందర్భాల్లో చెప్పారు. జట్టు సభ్యులందరికీ రామన్‌పై గౌరవ మర్యాదలు ఉన్నాయి. జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టుకు రామన్ కోచ్‌గా వెళ్లవచ్చని, అందుకే తప్పించారని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఓకే కానీ లేదంటే సరైన కారణం లేకుండా కొనసాగింపు ఇవ్వకపోవడం మాత్రం బోర్డు నిర్ణయంపై సందేహాలు రేకెత్తించేదే. మిథాలీతో పొసగేనా... త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటన కోచ్‌గా పొవార్‌కు తొలి బాధ్యత. ఈ సిరీస్‌లో పాల్గొనే జట్టు ఎంపిక కోసం నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పొవార్ సమావేశం కానున్నాడు. ఇప్పటికే టి20ల నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్ వన్డేల్లో ఇప్పటికీ కీలక బ్యాటర్ కావడంతోపాటు కెప్టెన్‌గా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడతానని కూడా ఆమె స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ కోసం ఆమె కెప్టెన్సీ నిలబెట్టుకోగలదా అనేది మొదటి సందేహం. భవిష్యత్తు పేరు చెప్పి ఆమెను తప్పించినా ఆశ్చర్యం లేదు. ఇక వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది. అంటే దాదాపు ఏడాది పాటు మిథాలీ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోపాటు కోచ్‌తో కూడా సరైన సంబంధాలు కొనసాగించడం పెద్ద సవాల్. నాటి ఘటన తర్వాత ఇద్దరూ కలిసి పని చేయడం అంత సులువు కాదు. గతానుభవాన్ని బట్టి చూస్తే పొవార్ అనూహ్యంగా ఏదో ఒక రోజు జట్టు ప్రయోజనాల కోసం అంటూ మిథాలీని పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంటర్వ్యూ సందర్భంగా మిథాలీతో వివాదం గురించి కూడా పొవార్‌తో మాట్లాడినట్లు మదన్‌లాల్ చెప్పారు. ‘ఆ ఘటనలో తన తప్పేమీ లేదని, అందరు ప్లేయర్లతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పొవార్ స్పష్టం చేశాడు’ అని మదన్‌లాల్ వివరణ ఇచ్చారు. -
కోహ్లికి ఆ సూచనలు అవసరమా!
ముంబై: మైదానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడుకు ఎంతమంది అభిమానుల ఉన్నారో అదే స్థాయిలో విమర్శకులు ఉన్నారన్నది వాస్తవం. అయితే, ఆట సమయంలో అతని ప్రవర్తన, దూకుడు తనకెంతో ఇష్టమని భారత మాజీ క్రికెటర్, క్రికెట్ సలహాదారు కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్‌లాల్ అన్నాడు. కోహ్లి సహజ లక్షణం అయిన దూకుడును తగ్గించుకోవాలని అందరూ సూచించడంలో అర్థం లేదని పేర్కొన్నాడు. భారత్‌కు కోహ్లినే సరైన కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. (చదవండి: కోహ్లి, సానియాకు చాలెంజ్ విసిరిన సింధు) ‘కోహ్లి దూకుడు తగ్గించుకోవాలని అందరూ ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడేమో భారత్‌కు దూకుడైన కెప్టెన్ అవసరం ఉందన్నారు. ఇప్పుడేమో కోహ్లిని ఆవేశం తగ్గించుకోమని సూచిస్తున్నారు. టీమిండియాకు దూకుడుగా ఉండటం రాదనేవారు. ప్రస్తుతం ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మనకు కోహ్లిలాంటి కెప్టెనే సరైనవాడు. మైదానంలో అతని ఆట, ప్రవర్తించే తీరు నాకు నచ్చుతుంది. అతని దూకుడును నేను ఆస్వాదిస్తా’అని మదన్‌లాల్ వివరించాడు. ఇటీవలి న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండో టెస్టులో విలియమ్సన్ అవుటయ్యాక కోహ్లి కాస్త అతిగా స్పందించడంతో అతని దూకుడు చర్చకు దారితీసింది. ఈ పర్యటనలో కోహ్లి అరుదైన రీతిలో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి కేవలం 38 పరుగులు.. టీ20, వన్డేలు, టెస్టుల్లో ఒకే ఒక అర్థసెంచరీ నమోదు చేశాడు. దీనిపై స్పందిస్తూ ‘న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైనంత మాత్రానా కోహ్లి కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. ఇప్పటికీ అతనే ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు. ప్రతీ ఆటగాడికి ఏదో ఒక దశలో ఇలాగే జరుగుతుంది. ఈ సమయంలో అతను ఫామ్ కోల్పోయాడంతే’అని లాల్ అన్నాడు. (చదవండి: దృఢంగా ఉండండి వ్యాప్తి చెందకుండా చూడండి) -
ఆర్పీ సింగ్‌కు కీలక పదవి
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పీ సింగ్ (రుద్రప్రతాప్ సింగ్)ను కీలక పదవి వరించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం ప్రకటించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో ఆర్పీ సింగ్‌కు అనూహ్యంగా చోటుదక్కింది. ముగ్గురు సభ్యుల గల సీఏసీ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. వీరిలో మాజీ ఆటగాడు మదల్‌లాల్, సులక్షన్ నాయక్ మూడో సభ్యుడుగా ఆర్పీ సింగ్‌ను ఎంపిక చేశారు. వీరి పదవీకాలం ఏడాది కాలం పాటు ఉంటుందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్పీ సింగ్ భారత్ తరఫున 14 టెస్ట్ మ్యాచ్‌లు, 58 వన్డేలు, 10 టీ-20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2007లో జరిగిన టీ-20 ప్రపంచ కప్‌లో చోటుదక్కించుకుని.. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సుమారు ఆరేళ్ల పాటు వివిధ ఫార్మాట్లో టీమిండియాకు సేవలు అందిచిన ఆర్సీ సింగ్ తన చివరి మ్యాచ్‌ను 2011లో ఆడాడా. కొంతకాలం పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు. -
సీఏసీలో మదన్‌లాల్, గంభీర్, సులక్షణ!
న్యూఢిల్లీ: భారత వన్డే ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన మదన్‌లాల్ (1983), గౌతమ్ గంభీర్ (2011)లు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులుగా నియమితులు కానున్నారు. సెలక్షన్ కమిటీల ఎంపిక కోసం బీసీసీఐ కొత్త సీఏసీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో మాజీ మహిళా క్రికెటర్ సులక్షణ నాయక్‌ను మూడో సభ్యురాలిగా చేర్చే అవకాశాలున్నాయి. భారత్ నెగ్గిన తొలి వన్డే ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన మదన్‌లాల్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. వచ్చే నాలుగేళ్ల పాటు పదవిలో ఉండే రెండు సెలక్షన్ కమిటీ (సీనియర్, జూనియర్)లను మదన్ లాల్ కమిటీ ఎంపిక చేయనుంది. ప్రస్తుత సీనియర్ సెలక్షన్ కమిటీలో చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్‌జోన్), గగన్ ఖొడా (సెంట్రల్)ల పదవీ కాలం ముగియగా.... ఇతర సభ్యులైన శరణ్‌దీప్ సింగ్ (నార్త్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్), జతిన్ పరంజపే (వెస్ట్)లకు మరో ఏడాది కాలం గడువుంది. -
రవిశాస్త్రినే రైట్
ఓ ఎంపిక తంతు ముగిసింది...! టీమిండియా ప్రధాన కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రికే అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ సాధించలేకపోయినా... జట్టు కూర్పులో విమర్శలెదుర్కొన్నా... కెప్టెన్ విరాట్ కోహ్లి అండదండలు సమృద్ధిగా ఉన్న అతడు... అందరినీ తోసిరాజంటూ మరో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాడు. హెడ్‌కోచ్ ఎంపిక కోసం శుక్రవారం ముంబైలో సమావేశమైన దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)... రవిశాస్త్రి నియామకానికి ఏకగీవ్రంగా అంగీకరించింది. కుదించిన జాబితాలో శాస్త్రి సహా మొత్తం ఆరుగురు ఉండగా, వీరిలో చివరి దశకు ముగ్గురే మిగిలారు. అందులోంచి అంతా అనుకుంటున్నట్లుగా... ముందే నిర్ణయించేసినట్లుగా... ‘రవి భాయ్’కే పట్టం కట్టారు. ముంబై: పెద్దగా మలుపులేం లేవు. అనూహ్యమేమీ జరగలేదు. అంచనాలకు తగ్గట్లే, కెప్టెన్ కోహ్లి మనోగతానికి అనువుగానే అంతా సాగిపోయింది. భారత జాతీయ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పదవి 2021 టి20 ప్రపంచకప్ వరకు పదిలమైంది. తాము ప్రామాణికంగా నిర్దేశించుకున్న శిక్షణా రీతులు, అనుభవం, సాధించిన ఘనతలు, సమాచారం వినియమం, ఆధునిక శిక్షణా పరిజ్ఞానం అనే ఐదు అంశాలకు శాస్త్రినే తగినవాడంటూ కపిల్, మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంత రంగస్వామితో కూడిన సీఏసీ సభ్యులు నిర్ణయం వెలువరించారు. ఈ పదవికి దరఖాస్తు చేసిన న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెసన్, శ్రీలంకకు కోచ్‌గా పనిచేసిన టామ్ మూడీ 2, 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం రోజంతా సమావేశమైన కపిల్ బృందం... వీరితోపాటు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రాబిన్‌సింగ్, జట్టు మాజీ మేనేజర్ లాల్‌సింగ్ రాజ్‌పుత్‌లను ఇంటర్వ్యూ చేసింది. మరో దరఖాస్తుదారు ఫిల్ సిమన్స్ (వెస్టిండీస్) మాత్రం అంతకుముందే తప్పుకొన్నాడు. హెసన్, రాబిన్‌సింగ్, రాజ్‌పుత్ నేరుగా హాజరై తమ ప్రణాళికలు వివరించారు. మూడీ, ప్రస్తుతం భారత జట్టుతో కరీబియన్ దీవుల పర్యటనలో ఉన్న రవిశాస్త్రి టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రక్రియలో పాల్గొన్నారు. 2017 జులైలో శాస్త్రిని హెడ్ కోచ్‌గా అప్పటి సీఏసీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ఎంపిక చేశారు. అప్పట్లో అతడి నియామకంపై వీరంతా కెప్టెన్‌గా కోహ్లి అభిప్రాయాన్ని తీసుకు న్నారు. ఇప్పుడు మాత్రం అదేమీ లేకుండానే నిర్ణయం తీసుకున్నామని కపిల్ తెలిపాడు. డైరెక్టర్‌గా వచ్చి... కోచ్‌గా పాతుకుపోయాడు 2014 వరకు పూర్తిస్థాయి వ్యాఖ్యాతగా ఉన్న రవి ఆ ఏడాది ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడటంతో వన్డే సిరీస్‌కు టీమ్ డైరెక్టర్‌గా ప్రత్యేక పరిస్థితుల్లో నియమితుడయ్యాడు. నాటి కోచ్ డంకన్ ఫ్లెచర్ ఉండగానే డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు చూశాడు. ఫ్లెచర్ 2015 ప్రపంచ కప్ అనంతరం వైదొలిగాక, 2016 జూన్‌లో మేటి స్పిన్నర్ అనిల్ కుంబ్లే కోచ్‌గా వచ్చేవరకు డైరెక్టర్ కమ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2017 జూలైలో కోహ్లితో విభేదాల కారణంగా కుంబ్లే తప్పుకోవడంతో ప్రధాన కోచ్ అయ్యాడు. తాజా ఎంపికకు అతడి ఆధ్వర్యంలో జట్టు సాధించిన విజయాలు ఓ కారణంగా చెబుతున్నారు. శాస్త్రి హయాంలో భారత్ 2017–18 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో టెస్టు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గింది. ఇటీవలి వన్డే ప్రపంచ కప్‌లో లీగ్ దశలో టాప్‌లో నిలిచి సెమీస్ చేరింది. మధ్యలో ఆసియా కప్ వంటి చిన్నాచితక టోర్నీలు, స్వదేశంలో సిరీస్‌లు గెలుచుకుంది. ఇప్పుడు 2021 వరకు ఎంపిక చేసినందున బహుశా భారత క్రికెట్ చరిత్రలో ఎక్కువ కాలం కోచ్‌గా పనిచేసినవాడిగా రికార్డులకెక్కుతాడు. కోహ్లి వ్యాఖ్యల ప్రభావం లేదు ‘కోచ్ ఎంపికలో మేం కోహ్లి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ అలానే చేసి ఉంటే... మిగతా జట్టు సభ్యులందరి అభిప్రాయాలు తీసుకునేవారం. ఈ విషయంలో మేమెవరినీ సంప్రదించలేదు. అసలు అందుకు అవకాశమే లేదు. ప్రపంచ కప్ సాధించనంత మాత్రాన వేటు వేయాలని ఏమైనా ఉందా? మీరు మొత్తం విజయాలను చూడండి. వారి ప్రజంటేషన్‌నే మేం చూశాం. దాని ప్రకారమే వెళ్లాం. అందరూ నిపుణులే అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ రవిశాస్త్రిని ముందంజలో నిలిపాయి’ – రవిశాస్త్రి ఎంపికపై కపిల్ స్పందన -
శాస్త్రికి మరో అవకాశం!
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి మాట చెల్లుబాటవుతుందా లేక కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మరో విధంగా ఆలోచిస్తోందా! ప్రస్తుత కోచ్ రవిశాస్త్రినే కొనసాగుతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇతర ఐదుగురు అభ్యర్థులు సీఏసీని మెప్పించేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. భారత కోచ్ పదవి కోసం నేడు (శుక్రవారం) ఇంటర్వ్యూలు జరగనున్నాయి. రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసన్, లాల్‌చంద్ రాజ్‌పుత్, రాబిన్ సింగ్, ఫిల్ సిమన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కపిల్ దేవ్‌తో పాటు కమిటీలోని ఇతర సభ్యులు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. కెప్టెన్ కోహ్లి మద్దతుతో పాటు చెప్పుకోదగ్గ రికార్డు ఉండటం శాస్త్రికి అనుకూలంగా మారింది. అతని శిక్షణలోనే భారత జట్టు తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకుంది. శాస్త్రి కోచ్‌గా వచ్చిన సమయం (జులై 2017)నుంచి భారత్ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్‌లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్‌లలో 25 సొంతం చేసుకుంది. రెండు వన్డే వరల్డ్ కప్‌లలోనూ సెమీఫైనల్ దాటకపోయినా దానిని పెద్ద వైఫల్యంగా ఎవరూ చూ డటం లేదు. పైగా ఆటగాళ్లందరితో ఈ భారత మాజీ క్రికెటర్‌కు మంచి సంబంధాలు ఉండటం సానుకూలాంశం. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. -
కోహ్లి తన అభిప్రాయం చెప్పవచ్చు కానీ...
న్యూఢిల్లీ: ఓవైపు టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియ సాగుతుండగా... ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రిని కొనసాగిస్తే బాగుంటుందంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందనలు కొనసాగుతున్నాయి. కోచ్ ఎంపిక కమిటీ బాధ్యతను చూస్తున్న క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యులు, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్, శాంత రంగస్వామి దీనిపై గురువారం వేర్వేరు చోట్ల మాట్లాడారు. తమ కర్తవ్యాన్ని శక్తిమేర నిర్వర్తిస్తా మని పేర్కొన్న కపిల్... కోహ్లి వ్యాఖ్యలపై మాట్లాడుతూ ‘అది అతడి అభిప్రాయం. మేం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి’ అని స్పష్టం చేశారు. కెప్టెన్‌గా అభిప్రాయం చెప్పే హక్కు కోహ్లికి ఉందంటూనే, తమ కమిటీ సమష్టి నిర్ణయంతో కోచ్‌ను ఎంపిక చేస్తుందని శాంత రంగస్వామి అన్నారు. అనుభవం, సామర్థ్యం, వ్యూహ నైపుణ్యాలను తాము ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పారు. మరోవైపు కోహ్లి వ్యాఖ్యలు కోచ్ ఎంపికపై ప్రభావం చూపవని, ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్య్రాన్ని ఎవరూ అడ్డుకోలేరని క్రికెట్ పాలకుల మండలి (సీవోఏ) సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. కోహ్లి కెప్టెనే అయినా, ఎంపికకు ఒక కమిటీని నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. -
కపిల్ త్రయం చేతిలో... హెడ్ కోచ్ ఎంపిక బాధ్యత!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ నియామక ప్రక్రియను దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి అప్పగించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల మండలి (సీవోఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటనేదీ రాకున్నా ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మిగతా కోచింగ్, సహాయక సిబ్బంది నియామకం మాత్రం బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి పర్యవేక్షణలో సాగుతుంది. గతంలో సీఏసీ సభ్యులుగా నియమితులైన మేటి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో... వారి స్థానంలో కపిల్ త్రయాన్ని తాత్కాలిక (అడహక్) ప్రాతిపదికపై నియమించారు. ఈ బృందమే డిసెంబరులో మహిళా జాతీయ జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక చేసింది. సీవోఏ తీరుపై బీసీసీఐ వర్గాల మండిపాటు ప్రత్యేకించి అక్టోబరు 22న వార్షిక సర్వసభ్య సమావేశం ఉండగా... టీమిండియా కోచింగ్ సిబ్బంది నియామక ప్రకటన విషయంలో సీవోఏకు అంత తొందరేమిటని బీసీసీఐ వర్గాలు మండిపడుతున్నాయి. ఓవైపు ప్రపంచ కప్‌లో భారత్ ప్రదర్శనపై హెడ్ కోచ్, కెప్టెన్‌తో సమీక్ష సమావేశం నిర్వహణ కోరుతూనే, మరోవైపు కోచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరడాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తప్పుబట్టారు. ‘ఈ పరిణామాలు నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. సీవోఏ ఇప్పటికే బోర్డు ఎన్నికలకు తేదీలు వెల్లడించింది. ఇంతలోనే ఇదేమిటి? తమ ఉద్దేశంలో ఉన్న వ్యక్తుల్లో ఎవరినైనా వారు నియమించాలని, ప్రపంచ కప్ సాధించలేకపోయిన విషయాన్ని మరుగునపర్చాలని అనుకుంటున్నారా’ అని ఆ అధికారి ప్రశ్నించారు. ప్రస్తుత కోచింగ్ సిబ్బంది అందరూ తమతమ నివేదికలు సమర్పించాల్సి ఉన్న నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు. విజయ్ శంకర్ గాయం తీవ్రత సహా, నాలుగో స్థానంపై తీసుకున్న నిర్ణయాలకు బ్యాటింగ్ కోచ్ కీలకమైన నివేదిక ఇవ్వాల్సి ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. -
క్రికెట్ అడ్వైజరీ కమిటీకి దాదా గుడ్‌బై చెప్పనున్నారా?
-
‘అది కుంబ్లే వ్యక్తిగత నిర్ణయం’
కోల్‌కతా: భారత కోచ్ పదవి నుంచి తప్పుకోవడం అనిల్ కుంబ్లే వ్యక్తిగతమని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ‘చివరి నిమిషంలో ఆయన రాజీనామా చేశారు. అది తన వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంలో నేను మాట్లాడాల్సిందేమీ లేదు’ అని దాదా తేల్చి చెప్పారు. కోహ్లి, కుంబ్లే విభేదాల గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. -
ఆ ముగ్గురు డబ్బులు అడగలేదు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు నూతన కోచ్‌ను ఎంపిక చేసేందుకు తగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) కోరినట్టు వచ్చిన మీడియా కథనాలను బీసీసీఐ ఖండించింది. అవన్నీ నిరాధార, కల్పిత వార్తలుగా కొట్టివేసింది. తమ సేవలను జీతం తీసుకోకుండా కేవలం గౌరవార్థం చేయలేమని గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ.. బోర్డు సీఈవో రాహుల్ జోహ్రికి చెప్పినట్టు ఓ పత్రికలో కథనం వచ్చింది. ‘కోచ్ ఎంపిక కోసం సీఏసీ డబ్బులను డిమాండ్ చేసినట్టు వచ్చి వార్తల్లో నిజం లేదు. ఆ ఆర్టికల్‌లో పేర్కొన్న విషయాలు దిగ్గజ క్రికెటర్లను అవమానపరిచినట్టుగా ఉంది. వారి మార్గదర్శకం, సూచనలు భారత క్రికెట్‌కు మేలు చేసేవి. వెంటనే ఆ ఆర్టికల్‌పై వివరణ ఇవ్వాలి’ అని బోర్డు సీఈవో ఘాటుగా స్పందించారు. గుహ ఆరోపణలపై దృష్టిసారించండి: సీఐసీ భారత క్రికెట్లో జరుగుతున్న పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై ఇటీవల క్రికెట్ చరిత్రకారుడు రామచంద్ర గుహ లేవనెత్తిన అంశాలపై బీసీసీఐ దృష్టి సారించాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సూచించింది. తమిళనాడు సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయిన బీసీసీఐ.. ఏ ప్రాతిపదిక అంతర్జాతీయ ఈవెంట్లకు జట్టును పంపుతుందో తెలపాలని ఓం ప్రకాశ్ కాశీరామ్ అనే కార్యకర్త క్రీడా శాఖకు అప్పీల్ చేసుకున్నారు. అయితే అటునుంచి స్పందన లేకపోవడంతో ఆయన కమిషన్ ముందుకు వచ్చారు. ‘సుప్రీం కోర్టు సూచన మేరకు పరిపాలక కమిటీ (సీఓఏ) వెంటనే బీసీసీఐ పగ్గాలు చేపట్టింది. రోజువారీ వ్యవహారాలను సీఈవో జోహ్రి చూస్తున్నారు. దీంతో కమిటీ ద్వారా బోర్డు పాలనను కేంద్రం తమ చేతుల్లోకి తీసుకున్నట్టే అవుతుంది. కాబట్టి బీసీసీఐ, సీఓఏ ప్రజలకు జవాబుదారీనే అవుతారు. అలాగే గుహ లేవనెత్తిన అభ్యంతరాలను కూడా సీఓఏ పరిశీలించాల్సి ఉంది’ అని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. -
రవిశాస్త్రి వ్యాఖ్యలపై దాదా ఏమన్నాడంటే..
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ కోచ్ పదవి దక్కనందుకు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి తీవ్ర నిరాశకు గురయ్యాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ తనను ఇంటర్వ్యూ చేసినపుడు కమిటీ సభ్యుడు సౌరభ్ గంగూలీ పాల్గొనలేదని రవిశాస్త్రి చెప్పాడు. థాయ్‌లాండ్ నుంచి తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యానని తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తనను మంచి ప్రశ్నలు అడిగారని చెప్పాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై దాదా స్పందిస్తూ.. ఇంటర్వ్యూ పూర్తిగా రహస్య విషయమని చెప్పాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై తాను మాట్లాడదలచుకోలేదని చెబుతూనే.. మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఆయన్ను ఇంటర్వ్యూ చేశారని తెలిపాడు. ఆ సమయంలో తాను క్యాబ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నానని చెప్పాడు. ఆ తర్వాత సచిన్, లక్ష్మణ్‌ను కలిశానని తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను నియమించిన సంగతి తెలిసిందే. -
బీసీసీఐలోకి ‘త్రిమూర్తులు’
బోర్డు సలహా కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ ఇక బీసీసీఐలో భాగం కానున్నారు. ఈ ముగ్గురితో బోర్డు కొత్తగా క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. భవిష్యత్‌లో క్రికెట్‌కు సంబంధించిన అన్ని విషయాలతో పాటు... సవాళ్లు ఎదురైనప్పుడు ఈ కమిటీ అటు బోర్డుకు, ఇటు జాతీయ జట్టుకు తగిన మార్గదర్శకం చేయనుంది. ‘సచిన్, లక్ష్మణ్, గంగూలీలను నూతన క్రికెట్ సలహా కమిటీలోకి బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నామినేట్ చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు బోర్డు నిర్ణయాన్ని అంగీకరించారు. అవసరమైన సమయంలో వివిధ పురోగతి చర్యలను తీసుకునేందుకు ఈ త్రయం బోర్డుకు సలహాలనిస్తుంది. మూడు, నాలుగు అంశాల్లో వారి సలహాలను తీసుకోవాలని నేను భావిస్తున్నాను’ అని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశవాళీ క్రికెట్ ను మరింతగా పటిష్టపరచడంతో పాటు కఠినతరమైన విదేశీ పర్యటనకు భారత జట్టు సన్నద్ధమయ్యే తీరుపై వీరి నుంచి బోర్డు సలహాలను కోరనుంది. ఎవరికి ఏ బాధ్యతలు.. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం భారత క్రికెటర్లు సాంకేతిక సలహాల కోసం వీరిని సంప్రదించవచ్చు. అలాగే ఈ ముగ్గురికీ పలు బాధ్యతలను అప్పగించారు. కొన్ని పటిష్ట జట్లతో ఆడేందుకు విదేశీ పర్యటనల కోసం వెళ్లడానికి ముందు ఆయా బ్యాట్స్‌మెన్... సచిన్‌తో మాట్లాడాలని బోర్డు కోరుకుంటోంది. అలాగే విదేశాల్లో జట్టు విజయాల కోసం ఏం చేయాలనే అంశాలతో బ్లూ ప్రింట్‌ను తయారు చేయడంతో పాటు రిజర్వ్ బెంచ్ బలాబలాలపై, కొత్త టాలెంట్‌ను పసిగట్టే విషయంలో గంగూలీ, లక్ష్మణ్‌లు పనిచేసే అవకాశం ఉంది. బంగ్లా పర్యటనకు ముందు సమావేశం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడానికి ముందు బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా, కార్యదర్శి ఠాకూర్లతో క్రికెట్ సలహా కమిటీ తొలిసారిగా భేటీ కానుంది. ఈనెల 4 లేదా 5న ఈ సమావేశం జరిగే అవకాశాలున్నాయి. జట్టు సహాయక సిబ్బంది నియామకంపై వీరి అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. అలాగే జట్టుతో పాటు బంగ్లాకు ఎవరు వెళతారనేది కూడా తేలనుంది. నా పాత్ర ఏమిటో తెలీదు: గంగూలీ సచిన్, లక్ష్మణ్‌లతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే ఈ కమిటీలో తన పాత్ర గురించి ఇంకా తనకేమీ తెలీదని అన్నాడు. ఆ ముగ్గురిపై నమ్మకముంది: దాల్మియా భారత క్రికెట్ మరింత ఎత్తు ఎదిగేందుకు సచిన్, లక్ష్మణ్, గంగూలీ సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయనే నమ్మకాన్ని బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా వ్యక్తం చేశారు. ‘దేశంలో ప్రముఖ ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న ఈ ముగ్గురూ తమ అనుభవాన్ని మాతో పంచుకునేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉంది. మేమంతా భారత క్రికెట్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు చక్కటి ప్రణాళికలతో ముందుకెళతాం. రాబోయే క్రికెటర్స్ ఈ నిష్ణాతుల సూచనలతో లాభం పొందుతారు’ అని దాల్మియా అన్నారు.