బీసీసీఐలోకి ‘త్రిమూర్తులు’
బోర్డు సలహా కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ ఇక బీసీసీఐలో భాగం కానున్నారు. ఈ ముగ్గురితో బోర్డు కొత్తగా క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. భవిష్యత్‌లో క్రికెట్‌కు సంబంధించిన అన్ని విషయాలతో పాటు... సవాళ్లు ఎదురైనప్పుడు ఈ కమిటీ అటు బోర్డుకు, ఇటు జాతీయ జట్టుకు తగిన మార్గదర్శకం చేయనుంది. ‘సచిన్, లక్ష్మణ్, గంగూలీలను నూతన క్రికెట్ సలహా కమిటీలోకి బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నామినేట్ చేశారు.
ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు బోర్డు నిర్ణయాన్ని అంగీకరించారు. అవసరమైన సమయంలో వివిధ పురోగతి చర్యలను తీసుకునేందుకు ఈ త్రయం బోర్డుకు సలహాలనిస్తుంది. మూడు, నాలుగు అంశాల్లో వారి సలహాలను తీసుకోవాలని నేను భావిస్తున్నాను’ అని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశవాళీ క్రికెట్ ను మరింతగా పటిష్టపరచడంతో పాటు కఠినతరమైన విదేశీ పర్యటనకు భారత జట్టు సన్నద్ధమయ్యే తీరుపై వీరి నుంచి బోర్డు సలహాలను కోరనుంది.
ఎవరికి ఏ బాధ్యతలు..
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం భారత క్రికెటర్లు సాంకేతిక సలహాల కోసం వీరిని సంప్రదించవచ్చు. అలాగే ఈ ముగ్గురికీ పలు బాధ్యతలను అప్పగించారు. కొన్ని పటిష్ట జట్లతో ఆడేందుకు విదేశీ పర్యటనల కోసం వెళ్లడానికి ముందు ఆయా బ్యాట్స్‌మెన్... సచిన్‌తో మాట్లాడాలని బోర్డు కోరుకుంటోంది. అలాగే విదేశాల్లో జట్టు విజయాల కోసం ఏం చేయాలనే అంశాలతో బ్లూ ప్రింట్‌ను తయారు చేయడంతో పాటు రిజర్వ్ బెంచ్ బలాబలాలపై, కొత్త టాలెంట్‌ను పసిగట్టే విషయంలో గంగూలీ, లక్ష్మణ్‌లు పనిచేసే అవకాశం ఉంది.
బంగ్లా పర్యటనకు ముందు సమావేశం
భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లడానికి ముందు బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా, కార్యదర్శి ఠాకూర్‌లతో క్రికెట్ సలహా కమిటీ తొలిసారిగా భేటీ కానుంది. ఈనెల 4 లేదా 5న ఈ సమావేశం జరిగే అవకాశాలున్నాయి. జట్టు సహాయక సిబ్బంది నియామకంపై వీరి అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. అలాగే జట్టుతో పాటు బంగ్లాకు ఎవరు వెళతారనేది కూడా తేలనుంది.
నా పాత్ర ఏమిటో తెలీదు: గంగూలీ
సచిన్, లక్ష్మణ్‌లతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. అయితే ఈ కమిటీలో తన పాత్ర గురించి ఇంకా తనకేమీ తెలీదని అన్నాడు.
ఆ ముగ్గురిపై నమ్మకముంది: దాల్మియా
భారత క్రికెట్ మరింత ఎత్తు ఎదిగేందుకు సచిన్, లక్ష్మణ్, గంగూలీ సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయనే నమ్మకాన్ని బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా వ్యక్తం చేశారు. ‘దేశంలో ప్రముఖ ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న ఈ ముగ్గురూ తమ అనుభవాన్ని మాతో పంచుకునేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉంది. మేమంతా భారత క్రికెట్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు చక్కటి ప్రణాళికలతో ముందుకెళతాం. రాబోయే క్రికెటర్స్ ఈ నిష్ణాతుల సూచనలతో లాభం పొందుతారు’ అని దాల్మియా అన్నారు.