రవిశాస్త్రి వ్యాఖ్యలపై దాదా ఏమన్నాడంటే..
న్యూఢిల్లీ: టీమిండియా చీఫ్ కోచ్ పదవి దక్కనందుకు మాజీ కెప‍్టెన్ రవిశాస్త్రి తీవ్ర నిరాశకు గురయ్యాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ తనను ఇంటర్వ్యూ చేసినపుడు కమిటీ సభ్యుడు సౌరభ్ గంగూలీ పాల్గొనలేదని రవిశాస్త్రి చెప్పాడు. థాయ్లాండ్ నుంచి తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యానని తెలిపాడు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తనను మంచి ప్రశ్నలు అడిగారని చెప్పాడు.
రవిశాస్త్రి వ్యాఖ్యలపై దాదా స్పందిస్తూ.. ఇంటర్వ్యూ పూర్తిగా రహస్య విషయమని చెప్పాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలపై తాను మాట్లాడదలచుకోలేదని చెబుతూనే.. మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఆయన్ను ఇంటర్వ్యూ చేశారని తెలిపాడు. ఆ సమయంలో తాను క్యాబ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నానని చెప్పాడు. ఆ తర్వాత సచిన్, లక్ష్మణ్ను కలిశానని తెలిపాడు.
క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేను నియమించిన సంగతి తెలిసిందే.