ఆ ముగ్గురు డబ్బులు అడగలేదు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు నూతన కోచ్‌ను ఎంపిక చేసేందుకు తగినంత రెమ్యునరేషన్ ఇవ్వాలని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) కోరినట్టు వచ్చిన మీడియా కథనాలను బీసీసీఐ ఖండించింది. అవన్నీ నిరాధార, కల్పిత వార్తలుగా కొట్టివేసింది. తమ సేవలను జీతం తీసుకోకుండా కేవలం గౌరవార్థం చేయలేమని గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ.. బోర్డు సీఈవో రాహుల్ జోహ్రికి చెప్పినట్టు ఓ పత్రికలో కథనం వచ్చింది. ‘కోచ్ ఎంపిక కోసం సీఏసీ డబ్బులను డిమాండ్ చేసినట్టు వచ్చి వార్తల్లో నిజం లేదు. ఆ ఆర్టికల్‌లో పేర్కొన్న విషయాలు దిగ్గజ క్రికెటర్లను అవమానపరిచినట్టుగా ఉంది. వారి మార్గదర్శకం, సూచనలు భారత క్రికెట్‌కు మేలు చేసేవి. వెంటనే ఆ ఆర్టికల్‌పై వివరణ ఇవ్వాలి’ అని బోర్డు సీఈవో ఘాటుగా స్పందించారు.
గుహ ఆరోపణలపై దృష్టిసారించండి: సీఐసీ
భారత క్రికెట్‌లో జరుగుతున్న పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై ఇటీవల క్రికెట్ చరిత్రకారుడు రామచంద్ర గుహ లేవనెత్తిన అంశాలపై బీసీసీఐ దృష్టి సారించాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సూచించింది. తమిళనాడు సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయిన బీసీసీఐ.. ఏ ప్రాతిపదిక అంతర్జాతీయ ఈవెంట్లకు జట్టును పంపుతుందో తెలపాలని ఓం ప్రకాశ్ కాశీరామ్ అనే కార్యకర్త క్రీడా శాఖకు అప్పీల్ చేసుకున్నారు.
అయితే అటునుంచి స్పందన లేకపోవడంతో ఆయన కమిషన్ ముందుకు వచ్చారు. ‘సుప్రీం కోర్టు సూచన మేరకు పరిపాలక కమిటీ (సీఓఏ) వెంటనే బీసీసీఐ పగ్గాలు చేపట్టింది. రోజువారీ వ్యవహారాలను సీఈవో జోహ్రి చూస్తున్నారు. దీంతో కమిటీ ద్వారా బోర్డు పాలనను కేంద్రం తమ చేతుల్లోకి తీసుకున్నట్టే అవుతుంది. కాబట్టి బీసీసీఐ, సీఓఏ ప్రజలకు జవాబుదారీనే అవుతారు. అలాగే గుహ లేవనెత్తిన అభ్యంతరాలను కూడా సీఓఏ పరిశీలించాల్సి ఉంది’ అని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు.