సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–18 నియామకాల ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. 2018 అక్టోబరులో నోటిఫికేషన్ విడుదల చేసి అదే ఏడాది డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. మెరిట్ జాబితాను ఫిబ్రవరి 15న విడుదల చేశారు. మే 15న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. మెరిట్ జాబితా అభ్యర్థులేమో ఎదురు చూస్తున్నారు. మెరిట్ జాబితా విడుదలైనా సెలక్షన్ జాబితాపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికివారు ‘కటాఫ్’పై అంచనాలు వేసుకుని ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో సెలక్షన్ జాబితా కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం 1:2 ప్రకారం సెలక్షన్ జాబితా ప్రకటించగానే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఇందుకు వేదిక ఖరారు చేయాలంటూ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మూడు రోజుల కిందట డీఈఓ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానిక గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ (ఇంగ్లిష్ మీడియం)ను ఖరారు చేసి ఇక్కడి అధికారులు నివేదిక పంపారు. రాష్ట్ర అధికారుల కబురుకోసం వేచి చూస్తున్నారు. వివిధ కేటగిరీల్లో జిల్లాలో మొత్తం 602 పోస్టులు భర్తీ చేయనున్నారు.
మ్యూజిక్ పోస్టులు రాష్ట్రస్థాయిలో భర్తీ
602 పోస్టుల్లో ఆరు మ్యూజిక్ టీచర్ పోస్టులను 418 మంది అర్హత సాధించారు. ఈ పోస్టులను రాష్ట్రస్థాయిలోనే భర్తీ చేయనున్నారు. తక్కిన పోస్టులను జిల్లాలోనే భర్తీ చేస్తారు. ఎస్జీటీ తెలుగుకు సంబంధించి 377 పోస్టులకు గాను 18,149 మంది అభ్యర్థులు మెరిట్‌జాబితాలో ఉన్నారు. ఎస్జీటీ కన్నడకు సంబంధించి 11 పోస్టులకుగాను 77 మంది, ఎస్‌ఏ ఇంగ్లిష్‌కు 16 పోస్టులకుగాను 729 మంది, ఎస్‌ఏ సంస్కృతం రెండు పోస్టులకు గాను ముగ్గురు, ఎస్‌ఏ ఉర్దూ ఒక పోస్టుకు 42 మంది, ఎస్‌ఏ గణితం (తెలుగు), 16 పోస్టులకు 1387 మంది, ఎస్‌ఏ గణితం (ఉర్దూ) రెండు పోస్టులకు 9 మంది, ఎస్‌ఏ పీఎస్ 19 పోస్టులకు 661 మంది, ఎస్‌ఏబీఎస్ 18 పోస్టులకు 1191 మంది, ఎస్‌ఏ సోషల్ 28 పోస్టులకు 3579 మంది, ఎల్‌పీ ఉర్దూ 4 పోస్టులకు 25 మంది, ఎల్‌పీ సంస్కృతం 5 పోస్టులకు ముగ్గురు, ఎల్‌పీ కన్నడ ఒక పోస్టుకు ఇద్దరు అభ్యర్థులు మెరిట్ సాధించారు. కోర్టు కేసులు, తదితర కారణంగా ఎస్జీటీ ఉర్దూ, ఎస్‌ఏ తెలుగు, ఎస్‌ఏ హిందీ, ఎల్‌పీ తెలుగు, ఎల్‌పీ హిందీ, పీఈటీ పోస్టులకు సంబంధించి మెరిట్ జాబితాను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
19న స్పెషల్ డీఎస్సీ
స్పెషల్ డీఎస్సీ–19 పరీక్షలు ఈనెల 19న నిర్వహించనున్నారు. వాస్తవానికి గత నెల 31న నిర్వహించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. 19న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. జిల్లాలో 55 పోస్టులకు గాను 329 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అనంతపురం నగర శివారులోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలతో పాటు పుట్టపర్తి సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్లు https;// apssa.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment