సాక్షి, అమరావతి: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) సర్వాంతర్యామిగా మారింది. అన్ని రంగాల్లోకి దూసుకువస్తోంది. మనుషులు చేయాల్సిన పనులన్నీ.. చక్కబెట్టేస్తోంది. తాజాగా కంపెనీల ఉద్యోగ నియామక ప్రక్రియలోనూ ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమయ్యింది. అమెరికాకు చెందిన ‘రెజ్యూమ్ బిల్డర్’ అనే వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా 43 శాతం కంపెనీలు ‘ఏఐ’ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటున్నాయని నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం 10 శాతం కంపెనీలు ఎంపికల్లో ఏఐను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. అలాగే 15 శాతం కంపెనీలు పూర్తిగా ఏఐపైనే ఆధారపడి ఇంటర్వ్యూలు చేయాలనుకుంటున్నాయని వెల్లడించింది.
దాదాపు మూడింట రెండు వంతుల కంపెనీలు.. ఏఐ ఇంటర్వ్యూల వల్ల నియామక సామర్థ్యం మెరుగుపడుతుందని బలంగా విశ్వసిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం కృత్రిమ మేధకు పూర్తిగా పగ్గాలు అప్పగించేందుకు సిద్ధంగా లేవు. ఏఐ కంటే అధునాతన అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్‌లు అభ్యర్థుల ఎంపికలో మరింత మెరుగ్గా పని చేస్తాయని అభిప్రాయపడ్డాయి. అలాగే హెచ్‌ఆర్ ఉద్యోగులు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏఐ నిపుణుల కోసం వేట..
ప్రస్తుతం ‘ఏఐ’లో నైపుణ్యం కలిగిన వారికి మంచి డిమాండ్ ఉంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత మార్చి నుంచి మే నెల వరకే వీరి కోసం 24% ఎక్కువ ప్రకటనలు వెలువడ్డాయి. వచ్చే త్రైమాసికాల్లో ఇది కనీసం 30% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలపై భారత్‌కు చెందిన స్పెక్ట్రమ్ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ సర్వే నిర్వహించింది.
ఇందులో ఏఐ సంబంధిత సాంకేతికతలో కంపెనీలు ఎక్కువగా పెట్టుబడి పెట్టనున్నాయని.. ఏఐ నిపుణుల కోసం డిమాండ్‌ను పెంచుతున్నాయని వెల్లడైంది. ఏఐ నిపుణులను ఆకర్షించడంలో కూడా తీవ్ర పోటీ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణులను అందించే దేశాల్లో భారత్ టాప్‌లో ఉండగా.. ఏఐ ఆధారిత ఉద్యోగ ప్రకటనల్లో దేశంలోనే బెంగళూరు అగ్రస్థానంలో ఉంది.
బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై కేంద్రంగా ఏఐ నిపుణుల కోసం వేట కొనసాగుతోంది. ఏఐ రంగంలో అనుభవమున్న వారితో పాటు కొత్తవారిని 1:2 నిష్పత్తిలో నియమించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లకు ఎక్కువ అవకాశాలున్నాయని నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment