ఏఐ ఉందా జాబ్‌ ఇంద.. | Job market towards technological advancement | Sakshi
Sakshi News home page

ఏఐ ఉందా జాబ్‌ ఇంద..

Published Wed, Mar 26 2025 4:28 AM | Last Updated on Wed, Mar 26 2025 4:28 AM

Job market towards technological advancement

సాంకేతిక పురోగతివైపు జాబ్‌ మార్కెట్‌ 

ఏఐ రెడీ వర్క్‌ఫోర్స్‌ కోరుకుంటున్న కంపెనీలు 

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి 

భారత్‌లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు! 

సాక్షి, స్పెషల్‌ డెస్క్: ‘ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. అభ్యర్థికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పరిజ్ఞానం తప్పనిసరి..’ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్‌ఆర్‌ హెడ్‌ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్‌కు తగ్గట్టుగా  ఉద్యోగులూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

ఏఐ రెడీ వర్క్‌ఫోర్స్‌ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది. సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్‌ మార్కెట్‌ పయనిస్తోంది. కంపెనీల లేఆఫ్‌లకు కారణాల్లో ఒకటైన ఏఐ.. కొత్త ఉద్యోగ అవకాశాలకూ వేదిక అవుతోంది. భారత్‌లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయని బెయిన్‌ అండ్‌ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది. నిపుణుల సంఖ్య మూడేళ్లలో 12 లక్షలకు చేరుకుంటుందని, కొరత 10 లక్షలకు పైమాటే అని వివరించింది. 

బడా కంపెనీల్లో లేఆఫ్స్‌..
ఏఐ సృష్టిస్తున్న ప్రభంజనం ప్రభావం లేఆఫ్స్‌ రూపంలో కనిపిస్తోంది. కంపెనీల ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం, ఉత్పాదకత పడిపోవడం, వ్యయాలు అధికం కావడం, లాభాల కోసం ఇన్వెస్టర్ల ఒత్తిడి.. ఉద్యోగుల తీసివేతలకు కారణమవుతున్నాయి. టెక్నాలజీ కంపెనీలకు అగ్రరాజ్యంగా చెప్పుకునే యూఎస్‌లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 

2025లో ఇప్పటివరకు 89 టెక్‌ కంపెనీలు అంతర్జాతీయంగా సుమారు 23,400 మందిని ఇంటికి పంపించాయి. వీటిలో గూగుల్, మెటా, డిస్నీ, సిటీ గ్రూప్, హెచ్‌పీ, వాల్‌మార్ట్, ఫోర్డ్, స్టార్‌బక్స్‌ వంటి దిగ్గజాలు ఉన్నాయి. అమెజాన్‌ 18 వేల మందికి, ఐబీఎం 9 వేల మందికి, బోయింగ్‌ 10% మందికి ఉద్వాసన పలుకుతున్నాయని సమాచారం. సేల్స్‌ఫోర్స్‌ 30% మందిని ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. 

2024లో 549 కంపెనీలు 1.52 లక్షల మందికి గుడ్‌బై చెబితే.. 2023లో ఏకంగా దాదాపు 1,200 కంపెనీలు 2.64 లక్షల మంది టెకీలను సాగనంపాయి. యూఎస్‌లో టెక్, సంబంధిత రంగాల్లో నిరుద్యోగిత రేటు 2022తో పోలిస్తే 2024లో 2.9 నుంచి 4.4 శాతానికి చేరుకుంది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. 

భారత్‌లో అంత లేదు.. 
భారత్‌లో ఐటీ కంపెనీలు నిశ్శబ్దంగా లేఆఫ్‌లు చేపడుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే ఏడాదిలో 50,000 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. అయితే తీసివేతలు ఆందోళన కలిగించే స్థాయిలో లేవన్నది నిపుణుల మాట. హైదరాబాద్‌లో మాత్రం కంపెనీలు గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా కాకుండా ఆచితూచి నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్‌ 1,80,000 నియామ కాలకు శ్రీకారం చుట్టింది. 

ఇక మొత్తం లేఆఫ్‌లలో ఏఐ ప్రభావానికి గురైనవి 10% మాత్రమేనట. కరోనా కాలంలో కంన్జ్యూమర్‌ టెక్‌పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గట్టుగా కంపెనీలు నియామకాలు చేపట్టాయి. నాటి రిక్రూట్‌మెంట్‌లో పరిమిత నైపుణ్యం గల వారు సైతం ఉన్నారు. వీరి వల్ల ఉత్పాదకతలో అసమతుల్యత ఏర్పడి కంపెనీలు క్లయింట్ల ఆగ్రహానికి లోనయ్యాయి. ఇటువంటి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. మరోవైపు గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ) భారత్‌కు వెల్లువెత్తుతున్నా యి. ఈ కేంద్రాల్లో రిక్రూట్‌మెంట్‌ కొనసాగుతోంది. 

ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాలి 
ప్రీమియం, క్వాలిటీ స్కిల్స్‌ ఉన్నవారికి ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుంది. ఏఐ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ కొరత ఉంది. డిమాండ్‌కు తగ్గ నైపుణ్యం పెంచుకోవడమే ఇప్పుడున్న మార్గం. కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగానైనా నైపుణ్యం అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే.  – వెంకారెడ్డి, హెచ్‌ఆర్‌ రంగ నిపుణులు 

క్యాంపస్‌లోనే కొట్టాలి.. 
విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లోనే జాబ్‌ కొట్టాలి. విఫలం అయితే కాస్త కష్టపడాల్సిందే. దొరికినా రూ.2.5 లక్షల లోపు వార్షిక ప్యాకేజీతోనే. నైపుణ్యం ఉన్నవారికి జీసీసీలు అధిక వేతనాలు ఆఫర్‌ చేస్తున్నా యి. నియామకాల్లో జీసీసీల హవా కొనసాగుతోంది.  – నానబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement