
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఏఐ వేళ్ల మీద వినియోగిస్తున్నారు. ఏఐ ఇప్పుడు భారతీయ వినియోగదారుల దైనందిన జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ ‘సర్వీస్ నౌ’ తన తాజా సర్వేలో వివరించింది.
షాపింగ్, ఫుడ్..
షాపింగ్ సిఫార్సుల కోసం 84 శాతం మంది, ఆహారం, భోజన సూచనల కోసం 82 శాతం మంది, పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి ప్రతి ఐదుగురిలో నలుగురు (78 శాతం) ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది. ఇది ఏఐ ఆధారిత ఆర్థిక నిర్ణయాల వైపు మళ్లడాన్ని సూచిస్తుందని సర్వే తెలిపింది.
దేశంలోని 80 శాతం మంది వినియోగదారులు ఇప్పుడు ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు, ఉత్పత్తులపై సలహాల కోసం, స్వయం సహాయక మార్గదర్శకాల కోసం ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆరుగురిలో ఐదుగురు సందేహాల నివృత్తికి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను చురుకుగా ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.
కస్టమర్ సర్వీస్‌లో మాత్రం..
రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ పెరుగుతున్న పాత్ర ఉన్నప్పటికీ, దాని సమయాన్ని ఆదా చేసే సామర్థ్యాలు కస్టమర్ సర్వీస్ నిరీక్షణ సమయాలను తగ్గించడంలో మాత్రం సహాయపడటం లేదు. భారతీయ వినియోగదారులు గత సంవత్సరంలో 15 బిలియన్ గంటలు వేచి ఉన్నారు అని సర్వీస్ నౌ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ రిపోర్ట్ తెలిపింది. కాగా వ్యాపార సంస్థలు వారానికి సగటున ఒక రోజు కంటే తక్కువ కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి, మిగిలిన నాలుగు రోజులు బృందాల ప్రతిస్పందనలు, పరిపాలనా విధులు, ప్రమోషనల్ ఆఫర్లు, శిక్షణ, విరామాల కోసం వెచ్చిస్తున్నాయని సర్వే చెబుతోంది.
వ్యాపార సంస్థలకు భారీ అవకాశాలను అందించే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ గా భారత్ అవతరించబోతోంది. కొత్త ఏఐ టూల్స్ కస్టమర్ సర్వీస్ పై తమ అంచనాలను పెంచాయని 82 శాతం మంది వినియోగదారులు వ్యక్తం చేశారని సర్వీస్ నౌ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ తెలిపారు. 2024 నవంబర్ 1 నుంచి 15 వరకు సుమారు 5,000 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు.