సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి పరీక్షల నిర్వహణ కోసం జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటు కోట్లాది యువతకు ప్రయోజనకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఏతో పలు పరీక్షలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోగా.. సమయం, వనరులు ఆదా అవుతాయని అన్నారు. ఎన్‌ఆర్‌ఏతో ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత నెలకొంటుందని ప్రధాని బుధవారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటైన ఎన్‌ఆర్‌ఏతో నియామక ప్రక్రియలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎన్‌ఆర్‌ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో 1517 కోట్ల రూపాయల కేటాయింపుతో ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. అన్ని ఉద్యోగాలకు ఉమ్మడి సిలబస్‌తో ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తారు. ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. చదవండి : నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment