న్యూఢిల్లీ: గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) ఫేస్–2 ప్రాజెక్టును ఏడు రాష్ట్రాల పరిధిలో అమలు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పరిధిలో గ్రీన్ ఎనర్జీ కారిడార్–2 ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. 20 గిగావాట్ల పునరుత్పాదక (రెన్యువబుల్ ఎనర్జీ) ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే విద్యుత్ సరఫరాకు వీలుగా, గ్రిడ్ ఇంటిగ్రేషన్ కోసం 10,750 సర్క్యూట్ కిలోమీటర్ల మేర ట్రాన్స్‌మిషన్ లైన్లు నిర్మించనున్నారు. అంచనా వ్యయం రూ.12,031 కోట్లు. కేబినెట్ సమావేశం అనంతరం ఈ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
ఐదేళ్లలో అమలు..
2021–22 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య గ్రీన్ కారిడార్ రెండో దశను అమలు చేస్తామని మంత్రి ఠాకూర్ చెప్పారు. మొదటి దశ పనులు 80 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని, మొదటి దశ కోసం రూ.10,142 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. గ్రీన్ కారిడార్–2 ప్రతిపాదిత రూ.12,031 కోట్లలో 33 శాతాన్ని (రూ.3,970 కోట్లు) కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాల మధ్య పంపిణీ చార్జీలను కేంద్ర ప్రభుత్వ సాయంతో సర్దుబాటు చేసుకోవచ్చని.. దీంతో వ్యయాలు తగ్గుతాయన్నారు.
ప్రభుత్వ సాయం అంతిమ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. 2030 నాటికి 450 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి ఈ పథకం మద్దతుగా నిలవనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఈ ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం భావిస్తోంది. గ్రీన్ కారిడార్–1 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల పరిధిలో ఏర్పాటవుతోంది. 24 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సరఫరాకు ఇది సాయపడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి ఇది పూర్తికానుంది. మొదటి దశ కింద ఈ రాష్ట్రాల్లో 9,700 కిలోమీటర్ల మేర సరఫరా లైన్లు అందుబాటులోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment