న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ఒక్కసారిగా ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గట్టుగా త్వరలోనే పెట్రోలు, డీజిలు రేట్లు పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నయంగా గ్రీన్ ఎనర్జీపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రీన్ ఫైనాన్స్
వృద్ధి, భవిష్యత్ ఎకానమీ అవసరాలు నెరవేర్చడంపై మంగళవారం నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఫైనాన్సింగ్‌లో వినూత్న విధానాలను అవలంభించాలని ప్రధాని ఆర్థిక సంస్థలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేలా వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరారు. వృద్ధి చెం దుతున్న ఆర్థిక వ్యవస్థ తక్షణ, భవిష్యత్ అవసరాలు నెరవేర్చడంలో ఇవి ఎంతో కీలకాంశాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫైనాన్సింగ్‌ను ఆయన ప్రస్తావించారు. 2070 నాటికి నిర్దేశించుకున్న పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి (నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్) గ్రీన్ ఫైనాన్సింగ్ తక్షణ అవసరం ఎంతో ఉందన్నారు. ఈ దిశలో పర్యావర ణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టుల విస్తరణకు రుణ సంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రధాని ప్రస్తావించిన ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి..
- సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు విజయవంతం కావడం అనే అంశం ఈ రంగాలకు ఫైనాన్సింగ్‌ను బలోపేతం చేయడంపై ఆధారపడి ఉంటుంది.
- ఫిన్‌టెక్, అగ్రిటెక్, మెడిటెక్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి రంగాలలో దేశం ముందుకు సాగే వరకు దేశంలో నాల్గవ పారిశ్రామిక విప్లవం సాధ్యం కాదు.
- నిర్మాణం, స్టార్టప్‌లు, డ్రోన్లు, అంతరిక్షం, జియో–స్పేసియల్ డేటా వంటి 8 నుంచి 10 రంగాలకు ప్రత్యేక గుర్తింపు అవసరం. ఆయా రంగాల్లో పురోగతి ద్వారానే భారత్ టాప్–3లో ఉండగలుగుతుంది. ఈ రంగాల పురోగతికి ఆర్థిక సంస్థల రుణ మద్దతు ఎంతో అవసరం.
- స్టార్టప్‌లకు రుణ దాతలకు ఆయా అంశాలకు సంబంధించి భవిష్యత్తు గురించిన లోతైన అవగాహన అవసరం. అలాంటప్పుడే స్టార్టప్‌ల కార్యకలాపాల విస్తరణ, ఆవిష్కరణలు, కొత్త మార్కెట్ల కోసం అన్వేషణ జరుగుతుంది.
- ఆరోగ్య రంగంలో కృషి, పెట్టుబడి అంశాలను పరిశీలిస్తే, వైద్య విద్యకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడానికి మరిన్ని వైద్య సంస్థలను కలిగి ఉండటం చాలా కీలకం.
- బ్యాంకులు ఎగుమతిదారులకు ప్రాధాన్యతా ప్రాతిపదికన నిధులు అందజేస్తే ఈ రంగం మరింత బలోపేతం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం విజవంతానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.
- సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతో అవసరం. ఎవరైనా సహజ వ్యవసాయంలో కొత్త పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారంటే, అతనికి ఏ విధంగా సహకరించాలో ఆర్థిక సంస్థలు ఆలోచించాలి.
- 2022–23 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేయడానికి బ్యూరోక్రాట్స్ ’క్రియాశీల కార్యాచరణ’తో ముందుకు రావాలి.
Comments
Please login to add a commentAdd a comment