phase-2 project
-
గ్లోబల్ టూరిజం హబ్‌గా భారత్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే కంటైనర్ టెర్మినల్ విస్తరణ ఫేజ్–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ టూరిజం హబ్‌గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్ క్రూయిజ్ హబ్‌లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ హబ్ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్ టెర్మినల్ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్ చీఫ్ ఇంజనీరింగ్ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్ ప్రతినిధి కెప్టెన్ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. పలు సంస్థలతో ఒప్పందాలు గ్లోబల్ మారిటైం ఇండియా సమ్మిట్‌లో మంత్రి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో విశాఖ పోర్టు పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్‌కుమార్ దూబే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఎం.కె.వాతోర్, నేవీ అడ్మిరల్ నెల్సన్ డిసౌజా, ట్రయాన్ సంస్థ తరఫున రజనీష్ మహాజన్ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న 4 లేన్ల రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం పోర్టు రూ.501 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఔటర్ హార్బర్లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు భారత నౌకాదళంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రయాన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా.. విశాఖ పోర్టు సాలగ్రామపురంలోని భూమిని ట్రయాన్ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనుంది. ఈ ఒప్పందం విలువ రూ.900 కోట్లు. ఒప్పందంలో భాగంగా కన్వెన్షన్ సెంటర్లు, ఐటీ టవర్లు నిర్మించనున్నారు. కాగా, గ్లోబల్ మారిటైం సమ్మిట్‌లో విశాఖ పోర్టు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను ఆకట్టుకుంది. విశాఖ పోర్టు అథారిటీ ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన స్టేట్ సెషన్లో పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. -
గ్రీన్ ఎనర్జీ కారిడార్–2కు పచ్చజెండా
న్యూఢిల్లీ: గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ) ఫేస్–2 ప్రాజెక్టును ఏడు రాష్ట్రాల పరిధిలో అమలు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పరిధిలో గ్రీన్ ఎనర్జీ కారిడార్–2 ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. 20 గిగావాట్ల పునరుత్పాదక (రెన్యువబుల్ ఎనర్జీ) ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే విద్యుత్ సరఫరాకు వీలుగా, గ్రిడ్ ఇంటిగ్రేషన్ కోసం 10,750 సర్క్యూట్ కిలోమీటర్ల మేర ట్రాన్స్మిషన్ లైన్లు నిర్మించనున్నారు. అంచనా వ్యయం రూ.12,031 కోట్లు. కేబినెట్ సమావేశం అనంతరం ఈ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ఐదేళ్లలో అమలు.. 2021–22 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య గ్రీన్ కారిడార్ రెండో దశను అమలు చేస్తామని మంత్రి ఠాకూర్ చెప్పారు. మొదటి దశ పనులు 80 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని, మొదటి దశ కోసం రూ.10,142 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు. గ్రీన్ కారిడార్–2 ప్రతిపాదిత రూ.12,031 కోట్లలో 33 శాతాన్ని (రూ.3,970 కోట్లు) కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రాల మధ్య పంపిణీ చార్జీలను కేంద్ర ప్రభుత్వ సాయంతో సర్దుబాటు చేసుకోవచ్చని.. దీంతో వ్యయాలు తగ్గుతాయన్నారు. ప్రభుత్వ సాయం అంతిమ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. 2030 నాటికి 450 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి ఈ పథకం మద్దతుగా నిలవనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఈ ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం భావిస్తోంది. గ్రీన్ కారిడార్–1 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల పరిధిలో ఏర్పాటవుతోంది. 24 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సరఫరాకు ఇది సాయపడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి ఇది పూర్తికానుంది. మొదటి దశ కింద ఈ రాష్ట్రాల్లో 9,700 కిలోమీటర్ల మేర సరఫరా లైన్లు అందుబాటులోకి వస్తాయి. -
12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అత్యవసర వాడుకకు అనుమతినిచ్చింది. అయితే ఈ అనుమతికి పరిమితులు విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2–18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాడకంపై భారత్ బయోటెక్ ఫేజ్–2 ట్రయల్స్ నిర్వహించి సీడీఎస్సీఓకు గతంలో సమర్పించింది. పిల్లలకు కొన్ని నిబంధనలతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అక్టోబర్‌లో సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సిఫార్సును డీజీసీఐకు చెందిన మరో కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, మరిన్ని వివరాలు సమర్పించాలని కంపెనీని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివరాలు పరిశీలించిన అనంతరం డీజీసీఐ కోవాగ్జిన్‌కు శుక్రవారం అనుమతినిచ్చినట్లు వెల్లడించాయి. కమిటీ సూచన మేరకు కోవాగ్జిన్‌ను 12– 18ఏళ్ల వారికి 0– 28 రోజుల వ్యవధిలో అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతినిస్తున్నట్లు డీజీసీఐ ప్రకటన వెల్లడించింది. డీజీసీఐ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో జైడస్ క్యాడిలా వారి జైకోవ్– డీ టీకాను 18 ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పిల్లలపై సీరమ్, బయోలాజికల్–ఇ లిమిటెడ్ కంపెనీల టీకాల ఫేజ్2 ట్రయల్స్‌కు డీజీసీఐ గతంలో అనుమతినిచ్చింది. డీజీసీఐ తాజా నిర్ణయాన్ని మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. -
ఇదేనా చిత్తశుద్ధి?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టు పనులు... ఇప్పటికే నత్తనడకన సాగుతున్నాయి! కానీ డిసెంబర్ నాటికి హిరమండలం జలాశయం పనులు పూర్తి చేసి కొత్త సంవత్సరం తొలిరోజున సాగునీరు ఇచ్చేస్తామని, జాతికి అంకితం చేసేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు సహా అధికార పార్టీ నాయకులు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు! కానీ ప్రాజెక్టు నిర్మాణ పనులపై పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించే జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు (ఎస్ఈ) పోస్టు మూడ్రోజులుగా ఖాళీగా ఉంది. అంటే ఎస్ఈ సెలవుపై వెళ్లారనుకుంటే పొరపాటే! ఈ పోస్టులో ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వర్తించిన బి.అప్పలనాయుడు గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఇప్పటివరకూ ఎవ్వరినీ ప్రభుత్వం నియమించలేదు. కనీసం వేరెవ్వరికైనా ఇన్చార్జి బాధ్యతలైనా అప్పగించలేదు. ఇలా జరగడం బహుశా వంశధార చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో ఆ శాఖ వర్గాలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విస్తుపోతున్నాయి. జిల్లాలో వంశధార ప్రాజెక్టుతో పాటు జలవనరుల శాఖలోని బొబ్బిలి సర్కిల్‌కు కూడా ఎస్ఈ కీలక అధికారి. ఇంచుమించు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ప్రాజెక్టు పనులతో పాటు తోటపల్ల ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే నీరు–చెట్టు పథకం పనులకు ఎస్ఈ నోడల్ అధికారి కూడా. ఇటీవల జరిగిన సాగునీటి సలహామండలి (ఐవోబీ) సమావేశం ఎస్ఈ బి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగింది. వంశధార గొట్టా బ్యారేజీ, తోటపల్లి రిజర్వాయరు నుంచి సాగునీరు విడుదల చేయాలని ఆ సమావేశంలో మంత్రి అచ్చెన్న ఆదేశాలు ఇచ్చారు. కానీ నీరు విడుదల చేయాలంటే ముందుగా కాలువల మరమ్మతులు చేయించాల్సి ఉంది. అవి సవ్యంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా ఎస్ఈదే. సారథి లేకుండా పనులా.... వంశధార, తోటపల్లి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే సమయంలో ఎస్ఈ బి.అప్పలనాయుడు పదవీవిరమణ చేశారు. వాస్తవానికి ఈ ప్రక్రియ జరిగేనాటికే ఎస్ఈ పోస్టులో వేరొకరిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏ కారణం వల్లనైనా దీనికి సమయం తీసుకోవాలనుకుంటే కనీసం ఇన్చార్జి ఎస్ఈగా వేరెవ్వరికైనా బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ మూడ్రోజులైనా ఈ పోస్టులో ఎవ్వరినీ నియమించలేదు. దీంతో ఎస్ఈ పర్యవేక్షించాల్సిన పనులన్నీ స్తంభించిపోయాయి. సాగునీటి విడుదల, ప్రాజెక్టు పనుల పర్యవేక్షణే గాకుండా వర్షాకాలంలో వంశధార, తోటపల్లి ప్రాజెక్టులకు వరద పోటెత్తితే ఎస్ఈనే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత కీలకమైన ఈ పోస్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వారిలో ఎవ్వరికి అవకాశం... ఇన్చార్జి ఎస్ఈగా జలవనరుల శాఖ విశాఖపట్నం సర్కిల్ ఎస్ఈ ఆర్.నాగేశ్వరరావుకు ఇన్చార్జ్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తారని తొలుత ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇంతవరకూ అందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు తోటపల్లి ఎస్ఈ డోల తిరుమలరావును లేదంటే ఆయన తర్వాత కేడర్‌లో డీఎస్ఈగా పనిచేస్తున్న ఆర్.త్రినాధరావుకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.