ఇదేనా చిత్తశుద్ధి?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టు పనులు... ఇప్పటికే నత్తనడకన సాగుతున్నాయి! కానీ డిసెంబర్ నాటికి హిరమండలం జలాశయం పనులు పూర్తి చేసి కొత్త సంవత్సరం తొలిరోజున సాగునీరు ఇచ్చేస్తామని, జాతికి అంకితం చేసేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు సహా అధికార పార్టీ నాయకులు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు! కానీ ప్రాజెక్టు నిర్మాణ పనులపై పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించే జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు (ఎస్‌ఈ) పోస్టు మూడ్రోజులుగా ఖాళీగా ఉంది. అంటే ఎస్‌ఈ సెలవుపై వెళ్లారనుకుంటే పొరపాటే! ఈ పోస్టులో ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వర్తించిన బి.అప్పలనాయుడు గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఇప్పటివరకూ ఎవ్వరినీ ప్రభుత్వం నియమించలేదు. కనీసం వేరెవ్వరికైనా ఇన్‌చార్జి బాధ్యతలైనా అప్పగించలేదు. ఇలా జరగడం బహుశా వంశధార చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో ఆ శాఖ వర్గాలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విస్తుపోతున్నాయి.
జిల్లాలో వంశధార ప్రాజెక్టుతో పాటు జలవనరుల శాఖలోని బొబ్బిలి సర్కిల్‌కు కూడా ఎస్‌ఈ కీలక అధికారి. ఇంచుమించు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ప్రాజెక్టు పనులతో పాటు తోటపల్ల ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే నీరు–చెట్టు పథకం పనులకు ఎస్‌ఈ నోడల్ అధికారి కూడా. ఇటీవల జరిగిన సాగునీటి సలహామండలి (ఐవోబీ) సమావేశం ఎస్‌ఈ బి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగింది. వంశధార గొట్టా బ్యారేజీ, తోటపల్లి రిజర్వాయరు నుంచి సాగునీరు విడుదల చేయాలని ఆ సమావేశంలో మంత్రి అచ్చెన్న ఆదేశాలు ఇచ్చారు. కానీ నీరు విడుదల చేయాలంటే ముందుగా కాలువల మరమ్మతులు చేయించాల్సి ఉంది. అవి సవ్యంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా ఎస్‌ఈదే.
సారథి లేకుండా పనులా....
వంశధార, తోటపల్లి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే సమయంలో ఎస్‌ఈ బి.అప్పలనాయుడు పదవీవిరమణ చేశారు. వాస్తవానికి ఈ ప్రక్రియ జరిగేనాటికే ఎస్‌ఈ పోస్టులో వేరొకరిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏ కారణం వల్లనైనా దీనికి సమయం తీసుకోవాలనుకుంటే కనీసం ఇన్‌చార్జి ఎస్‌ఈగా వేరెవ్వరికైనా బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ మూడ్రోజులైనా ఈ పోస్టులో ఎవ్వరినీ నియమించలేదు. దీంతో ఎస్‌ఈ పర్యవేక్షించాల్సిన పనులన్నీ స్తంభించిపోయాయి. సాగునీటి విడుదల, ప్రాజెక్టు పనుల పర్యవేక్షణే గాకుండా వర్షాకాలంలో వంశధార, తోటపల్లి ప్రాజెక్టులకు వరద పోటెత్తితే ఎస్‌ఈనే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత కీలకమైన ఈ పోస్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వారిలో ఎవ్వరికి అవకాశం...
ఇన్‌చార్జి ఎస్‌ఈగా జలవనరుల శాఖ విశాఖపట్నం సర్కిల్ ఎస్‌ఈ ఆర్.నాగేశ్వరరావుకు ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తారని తొలుత ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇంతవరకూ అందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మరోవైపు తోటపల్లి ఎస్‌ఈ డోల తిరుమలరావును లేదంటే ఆయన తర్వాత కేడర్‌లో డీఎస్‌ఈగా పనిచేస్తున్న ఆర్.త్రినాధరావుకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.