
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అత్యవసర వాడుకకు అనుమతినిచ్చింది. అయితే ఈ అనుమతికి పరిమితులు విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2–18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాడకంపై భారత్ బయోటెక్ ఫేజ్–2 ట్రయల్స్ నిర్వహించి సీడీఎస్‌సీఓకు గతంలో సమర్పించింది. పిల్లలకు కొన్ని నిబంధనలతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అక్టోబర్‌లో సీడీఎస్‌సీఓకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సిఫార్సును డీజీసీఐకు చెందిన మరో కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, మరిన్ని వివరాలు సమర్పించాలని కంపెనీని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ వివరాలు పరిశీలించిన అనంతరం డీజీసీఐ కోవాగ్జిన్‌కు శుక్రవారం అనుమతినిచ్చినట్లు వెల్లడించాయి. కమిటీ సూచన మేరకు కోవాగ్జిన్‌ను 12– 18ఏళ్ల వారికి 0– 28 రోజుల వ్యవధిలో అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతినిస్తున్నట్లు డీజీసీఐ ప్రకటన వెల్లడించింది. డీజీసీఐ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో జైడస్ క్యాడిలా వారి జైకోవ్– డీ టీకాను 18 ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పిల్లలపై సీరమ్, బయోలాజికల్–ఇ లిమిటెడ్ కంపెనీల టీకాల ఫేజ్2 ట్రయల్స్‌కు డీజీసీఐ గతంలో అనుమతినిచ్చింది. డీజీసీఐ తాజా నిర్ణయాన్ని మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment