Emergency cases
-
12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అత్యవసర వాడుకకు అనుమతినిచ్చింది. అయితే ఈ అనుమతికి పరిమితులు విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2–18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాడకంపై భారత్ బయోటెక్ ఫేజ్–2 ట్రయల్స్ నిర్వహించి సీడీఎస్సీఓకు గతంలో సమర్పించింది. పిల్లలకు కొన్ని నిబంధనలతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అక్టోబర్‌లో సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సిఫార్సును డీజీసీఐకు చెందిన మరో కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, మరిన్ని వివరాలు సమర్పించాలని కంపెనీని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివరాలు పరిశీలించిన అనంతరం డీజీసీఐ కోవాగ్జిన్‌కు శుక్రవారం అనుమతినిచ్చినట్లు వెల్లడించాయి. కమిటీ సూచన మేరకు కోవాగ్జిన్‌ను 12– 18ఏళ్ల వారికి 0– 28 రోజుల వ్యవధిలో అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతినిస్తున్నట్లు డీజీసీఐ ప్రకటన వెల్లడించింది. డీజీసీఐ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో జైడస్ క్యాడిలా వారి జైకోవ్– డీ టీకాను 18 ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పిల్లలపై సీరమ్, బయోలాజికల్–ఇ లిమిటెడ్ కంపెనీల టీకాల ఫేజ్2 ట్రయల్స్‌కు డీజీసీఐ గతంలో అనుమతినిచ్చింది. డీజీసీఐ తాజా నిర్ణయాన్ని మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. -
రిజిస్ట్రార్ ముందే కేసుల మెన్షనింగ్
సాక్షి, న్యూఢిల్లీ: అత్యవసర కేసుల మెన్షనింగ్ ఇకపై రిజిస్ట్రార్ వద్దే చేసుకోవచ్చని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ తెలిపారు. బెంచ్‌ల వద్ద మెన్షనింగ్ స్థానంలో ఈ కొత్త పద్ధతి ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.‘సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, జూనియర్లు అవకాశాలు కోల్పోవాలని మేం కోరుకోం. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థ రూపొందించాం. బెంచ్‌ల ముందు ప్రస్తావించే అంశాలన్నీ ఇక ముందు రిజిస్ట్రార్ వద్దే ప్రస్తావించొచ్చు’ అని జస్టిస్ రమణ తెలిపారు. బెంచ్‌ల ముందు మెన్షనింగ్ పద్ధతి స్థానంలో సంబంధిత అధికారి ముందు మెన్షన్ చేసుకొనే పద్ధతి తీసుకొస్తున్నట్లు సీజేఐ జస్టిస్ రమణ తెలిపారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించి కామన్‌కాజ్ స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన కేసు విచారణ సందర్భంగా బుధవారం సీజేఐ మాట్లాడారు. -
ప్రసవ వేదన
లక్ష్యాన్ని చేరుకోని ప్రభుత్వాసుపత్రులు వేధిస్తున్న వైద్య సిబ్బంది, మందుల కొరత పీహెచ్సీలలో కరువైన కనీస వసతులు అత్యవసర కేసులు పెద్దాస్పత్రులకు రెఫర్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు కలిసి నడిస్తేనే ఫలితం.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రులు ప్రసవాల విషయంలో నిర్ధేశించినలక్ష్యాలను అధిగమించలేకపోతున్నాయి. అవసరమైన మేరకు వైద్యులు లేకపోవడం, మత్తు డాక్టర్లు అసలే లేకపోవడం, జననీ శిశు సురక్ష కార్యక్రమం ద్వారా నిధుల విడుదలలో జాప్యం... ఇలా పలు సమస్యలు ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో అవగాహన కల్పించాలని చెప్తున్నా... ఆ మేరకు ఫలితాలు రావడం లేదు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అన్న నాటి పరిస్థితుల నుంచి బయట పడలేకపోతున్నారు. అరకొర వసతుల మధ్యన ‘ప్రసవ వేదన’ తప్పదన్న భావన ఇంకా తొలగిపోవడం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలంటే ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల పరిస్థితి, డాక్టర్లు, సిబ్బంది కొరత, ల్యాబ్‌ల్లో అసౌకర్యాలు తదితర అంశాలపై ‘సాక్షి నెట్వర్క్’ అందిస్తున్న పరిశీలనాత్మక కథనం... – సాక్షి, కరీంనగర్ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెంచండి. ప్రభుత్వం వైద్యం, ఆరోగ్యం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకుండా ఉండేందుకు ప్రతి ఆడబిడ్డ ప్రభుత్వాసుపత్రిలోనే పురుడు పోసుకునే విధంగా కృషి చేయండి.. ఇది అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కరీంనగర్/నెట్వర్క్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 20 క్లస్టర్లు, 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 571 ఉప కేంద్రాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 37,76,269 మంది జనాభా ఉంటే... ఇందులో 18,95,469 మంది స్త్రీలు ఉన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 13 మండలాలు ఇతర జిల్లాలకు వెళ్లగా... కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 883 రెవెన్యూ గ్రామాలు, 33,38,497 జనాభా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా విడుదల చేసిన ఆయా జిల్లాల సమాచారంలో ఈ నాలుగు జిల్లాల్లో 1372 పడకల ఆసుపత్రులుంటే... 192 మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి తదితర ఆసుపత్రుల్లో అత్యధికంగా ప్రసవాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగితే రూ.1900 వరకు పారితోషికం కూడా అందిస్తారు. అయితే గత కొద్దిరోజులు జననీ శిశు సురక్ష కింద విడుదలయ్యే నిధులకు గ్రహణం పట్టింది. ఇందుకు తోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, కనీస సౌకర్యాల లేమి, రవాణా సౌకర్యం కల్పించకపోవడం ప్రతిబంధకాలుగా చెప్తున్నారు. చాలాచోట్ల రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలకు సకాలంలో రక్తం అందడం లేదంటున్నారు. అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామ గ్రామాన తిరిగి గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, ఆరోగ్య సమస్యలపై మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపోను మహిళా వైద్యనిపుణులు లేకపోవడంతో ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతుండగా, వైద్య, స్త్రీ,శిశు సంక్షేమ, ఐకేపీ శాఖలు సంయుక్తంగా పనిచేస్తే కొంతైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో... జిల్లాలోని పదమూడు మండలాల గర్భిణులకు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి ఒక్కటే శరణ్యం. ఆస్పత్రిలో ఒక సివిల్‌సర్జన్, ఒక్క అనెస్థీషియ డాక్టర్ ఉన్నారు. రెండు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ఒక అనెస్థీషియ, ఆర్సీహెచ్, సివిల్ సర్జన్, రెండు గైనకాలజిస్టు పోస్టులు ఖాళీ ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రితోపాటు మండలానికొకటి చొప్పున 13 పీహెచ్‌సీలు ఉన్నాయి. సిరిసిల్లలో తప్ప మరెక్కడా ప్రసవాలు జరిపే వీలు లేదు. జిల్లాలో ౖవైద్యాధికారులు 3, డీసీఎస్ 1, సీహెచ్ఓ 1, ఏపీఎంవోలు 5, హెచ్‌ఈలు 2, స్టాఫ్‌నర్స్ 7, రేడియోగ్రాఫర్స్ 2, ఫార్మాసిస్టులు 3, ఎంపీహెచ్ఏలు మొత్తం 48, రెండో ఏఎన్ఎం 2, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో 21, మొత్తంగా 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీల్లో ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు నామమాత్రంగా ఉన్నాయి. మూడు నెలలుగా జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2046 కాన్పులు జరుగగా..899 సాధారణ, 1147 సిజేరియన్ కాన్పులు జరిగాయి. సర్కారు దవాఖానాలో వసతులు లేవు. చీకటి గదులు, ఇరుకైన ప్రదేశాల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. ఇరుకైన గదుల్లోనే గర్భవతులు, బాలింతలు ఉండాల్సిన పరిస్థితి. ఆపరేషన్ థియేటర్లో సదుపాయాలు లేవు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 127 ప్రసవాలు జరిగినట్లు రికార్డులున్నాయి. డిసెంబర్ మాసంలోనే 25 ప్రసవాలు జరిగాయి. -
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం
జీజీహెచ్‌లో ప్రాణాలు కోల్పోతున్న పేదలు క్యాజువాలిటీపై కొరవడిన పర్యవేక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారుల వెనుకడుగు ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చేవారికి గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో సకాలంలో వైద్యం అందటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్యసేవల విభాగంలో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సోమవారం ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే వారు మృత్యువాత పడ్డారని మృతుల బంధువులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితులకు, ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం వచ్చే రోగులకు అత్యవసర వైద్యసేవలను అందించే క్యాజువాలిటీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రికి గుండెకాయ లాంటి అత్యవసర వైద్యసేవల విభాగంలో సకాలంలో వైద్యసేవలు లభించక పలువురు పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిరంగిపురం రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్సకోసం వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులకు సకాలంలో వైద్యులు సేవలను అందించకపోవడం వల్లే మృతిచెందారని ఆరోపిస్తూ ఆదివారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆస్పత్రి అధికారులు సైతం వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమేననే విషయాన్ని సోమవారం సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సమమాల్లో కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి కంటితుడుపు చర్యలే తీసుకుంటున్నారే తప్ప మెరుగైన వైద్యసేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనలు తరచుగా జరుగుతున్నా... అత్యవసర వైద్యసేవల విభాగంలో వైద్యులు పట్టించుకోవడం లేదని గతంలో సైతం పలుమార్లు రోడ్డుప్రమాద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడకు చెందిన ఏడునెలల పసిపాపకు శరీరం కాలి చికిత్స కోసం జీజీహెచ్ క్యాజువాలిటీకి రాగా 24గంటల సేపు క్యాజువాలిటీలో ఉంచారే తప్ప ఎలాంటి వైద్యం చేయలేదని పాప తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే దానికి ఎవరు జవాబుదారీ...పోయిన ప్రాణాలను తిరిగి తేగలరా అనే ప్రశ్నలకు వైద్యాధికారుల వద్ద సమాధానం ఉండదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది బంధువులు సైతం వైద్యం అందక ప్రాణాలు పోతాయనే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీసిన సంఘటనలు ఉన్నాయి. డ్యూటీ డాక్టర్లు కనిపించరు.. అత్యవసర వైద్యసేవల విభాగంలో డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్(డీఏపీ) డ్యూటీ అసిస్టెంట్ సర్జన్(డీఏఎస్)లు విధుల్లో ఉండడం లేదని ఆస్పత్రి అంతా కోడై కూస్తున్నా, వారితో విధులను చేయించే అధికారులు లేకపోవడంతో క్యాజువాలిటీలో మరణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి కేటాయించిన గది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరికీ డ్యూటీ ఉంటే కేవలం ఒకరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. మరొకరు తమ సొంత క్లినిక్‌లో వైద్యం చేసుకుంటూ జీతాలు మాత్రం జీజీహెచ్ నుంచి తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తమకు కేటాయించిన గదిలో నిద్రపోవడం, లేదా కొద్దోగొప్పో డబ్బులు వచ్చే సర్టిఫికెట్ల మంజూరు పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప రోగులకు, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాత్రివేళల్లో మరీ ఘోరం... పగలే చుక్కలు చూపించే వైద్యులు, వైద్య సిబ్బంది ఇక రాత్రివేళల్లో వచ్చే వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు. రాత్రివేళల్లో క్యాజువాలిటిలో ఉండి ఎవరు విధుల్లో ఉన్నారు, ఎవరులేరనే విషయాలను పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండి పోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. - డాక్టర్ రాజునాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటాం. ఆదివారం క్యాజువాలిటీలో రోడ్డుప్రమాద బాధితులు మృతిచెందిన విషయంలో వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. -
హైకోర్టుకు దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషన్ కోర్టును ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు గుండా చంద్రయ్య, ఎం.ఎస్.కె.జైశ్వాల్, సి.ప్రవీణ్‌కుమార్‌లు వెకేషన్ జడ్జీలుగా వ్యవహరిస్తారు. వెకేషన్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయాలనుకునే కక్షిదారులు ఈ నెల 29న దాఖలు చేయాల్సి ఉంటుంది. వీటిని 1వ తేదీన వెకేషన్ జడ్జీలు విచారిస్తారు. జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ జైశ్వాల్‌లు ధర్మాసనంలో ఉంటే, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సింగిల్ జడ్జిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఆపదలో వెళ్తే..ప్రైవేటే!
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వాస్పత్రుల కన్నా మెరుగైన వైద్యం చేస్తారన్న భ్రమతో రోగులను తీసుకొస్తే వైద్యులు లేరని, సరైన పరికరాలు లేవని చెప్పి అడ్మిట్ చేసుకోవడం లేదు. కనీసం ప్రథమ చికిత్స చేసేందుకు కూడా నిరాకరిస్తున్నారు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూస్తాం.. 24 గంటలూ వైద్య సేవలు అందిస్తామని బోర్డులు ఏర్పాటు చే సినా.. అవి కేవలం ప్రచారం వరకేనని స్పష్టమవుతోంది. ఈ నెల ఒకటో తేదీన అనంతపురంలోని కోవూర్‌నగర్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు కోదండరామిరెడ్డి ఆటో ప్రమాదంలో గాయపడి.. ప్రాణాపాయ స్థితిలో ఉండగా పలు ఆస్పత్రులకు తీసుకెళ్తే వైద్యులు తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. సకాలంలో వైద్యమందించక బాలుడి మృతికి కారకులై అతడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ప్రథమ చికిత్సకు పాతర.. అత్యవసర చికిత్స కోసం వచ్చే వారిని ఏ ప్రైవేట్ ఆస్పత్రి అయినా ముందు ప్రథమ చికిత్స చేసి.. అవసరాన్ని బట్టి ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేయాలి. అయితే జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు రోగిని చూసి.. ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉంది అని భావిస్తే.. ప్రాథమిక చికిత్స, పరీక్షలు కూడా చేయకుండానే తిరస్కరిస్తున్నారు. బెంగళూరు, కర్నూలు ఆస్పత్రులకు తీసుకెళ్లండంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ఇలా అన్ని ఆస్పత్రులూ తిరిగి.. చికిత్స చేయించేలోపు రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. ఎందుకిలా..? చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు లేరు. ఏదో ఇద్దరు ముగ్గురు వైద్యులతో నడిపించేస్తున్నారు. కొందరు వైద్యులు వారి విభాగం కాకుండా ఇతరత్రా సమస్యలపై ఇసుమంతైనా జోక్యం (ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని) చేసుకోవడం లేదు. వైద్యంపై కాస్త అవగాహన ఉన్న రోగులెవరైనా వైద్యున్ని రెండు..మూడు సందేహాలడిగితే, ఈ పరీక్షలన్నీ చేయించుకుని రండంటూ చాంతాడంత లిస్టు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్వరాలు, రక్తహీనత, సీజనల్ వ్యాధులైతేనే వెంటనే చేర్చుకుంటున్నారు. కాస్త ఆందోళనకరంగా ఉందని తెలిస్తే మాత్రం చేతులెత్తేస్తున్నారు. ఫిట్స్ వచ్చిన వారిని తీసుకొస్తే చాలు.. కొన్ని ఆస్పత్రులైతే వాకిలి వద్దే ‘కర్నూలుకు వెళ్లండ’ని చెప్పేస్తున్నాయి. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 137 ప్రైవేట్ ఆస్పత్రులు, 40 క్లినిక్‌లు ఉన్నాయి. అందులో 20 పడకల ఆస్పత్రులు 91, 50 పడకల ఆస్పత్రులు 31, వంద పడకల ఆస్పత్రులు 15, డెంటల్ ఆస్పత్రులు 15 ఉన్నాయి. 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు 122 ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా నడుస్తున్న క్లినిక్‌లకు లెక్కేలేదు. జిల్లాలో ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయని ప్రశ్నిస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నోరెళ్లబెడుతున్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు సర్వే చేస్తే గాని ఆ వివరాలు తెలియవంటున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిందే.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఏ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినా వారి పరిస్థితి చూసి ప్రథమ చికిత్స తప్పకుండా చేయాలి. చికిత్స చేయకుండా వెనక్కు పంపకూడదు. వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన వారి బాధితులు మమ్మల్ని ఆశ్రయిస్తే శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తాం. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా అన్ని ఆస్పత్రులూ పనిచేయాలి. - డాక్టర్ సీఆర్ రామసుబ్బారావు, జిల్లా వైద్య రోగ్య శాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌ఓ) -
వైద్యులు ఉండరు..వైద్యం అందదు
భువనగిరి, న్యూస్‌లైన్: నిరుపేదలకు అధునాతన వైద్యం అందించాలని ఏర్పాటు చేసిన సముదాయ (క్లస్టర్) ఆస్పత్రి విధానం జిల్లాలో అభాసుపాలవుతోంది. 2010లో ప్రారంభించిన ఈ విధానం ద్వారా రోగులకు 24గంటలూ అవసరమైన వైద్యం అందించాలని నిర్ణయించారు. అయితే స్థానికంగా వైద్యులు ఉండకపోవడం.. మందుల కొరత, సిబ్బంది లేమి వంటి కారణాలతో ఈ వ్యవస్థ అలంకారప్రాయంగా మారింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 15 క్లస్టర్లుగా విభజించారు. వాటి ద్వారా పేదలకు వైద్యం మరింత చేరువ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతి క్లస్టర్‌కు సీనియర్ మెడికల్ ఆఫీసర్‌ను అధికారిగా నియమించా రు. ఆయన ఆయా క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అంటువ్యాధులు రాకుండా ముందస్తు నివారణ చర్యలు, జ్వరాలు, చిన్న పిల్లల ఆరోగ్యం, ప్రసవాలను పర్యవేక్షించాల్సి ఉంది. ఎంబీబీఎస్ వైద్యులను పీహెచ్‌సీలు, క్లస్టర్లలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా నియమించారు. అదే విధంగా చిన్నపిల్లల, గర్భకోశ, మత్తు, ఎముకల స్పెషలిస్టులతోపాటు అత్యవసర విభాగాల్లో రెండు పోస్టులను భర్తీ చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వైద్యులు, వైద్యం అందుబాటులో ఉండడం లేదు. పోచంపల్లిలో ఒక్కరే డాక్టర్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. వైద్యురాలు నెలలో 15 రోజుల పాటు 104లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మరోడాక్టర్ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. డాక్టర్ స్థానింగా ఉండకపోవడం వల్ల స్టాఫ్‌నర్స్ ఇతర సిబ్బంది వైద్యం అందిస్తారు. ఇక.. బొల్లేపలి,్ల వర్కట్‌పల్లి పీహెచ్‌సీల్లో వైద్యులు వచ్చినప్పుడే రోగులు రావాలి. వైద్యఆరోగ్య శాఖ అధికారి ఇటీవల వర్కట్‌పల్లి పీహెచ్సీ తనిఖీ కోసం వచ్చినప్పుడు వైద్యులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కంగుతిన్నారు. ఇలాంటి పరిస్థితి అన్ని పీహెచ్‌సీల్లోనూ ఉంది. జిల్లాలో ఏర్పాటైన క్లస్టర్లు భువనగిరి : బొల్లేపల్లి, బీబీనగర్, కొం డమడుగు, బొమ్మలరామారం, తు ర్కపల్లి, ఆత్మకూర్(ఎం), గుండాల రామన్నపేట : మునిపంపుల, చిట్యాల, వలిగొండ, వేములకొండ, మోత్కూరు, అడ్డగూడూర్ ఆలేరు : రాజాపేట, శారాజీపేట, యాదగిరిగుట్ట, మోటకొండూర్ చౌటుప్పల్ : వర్కట్‌పల్లి, పోచంపల్లి, నారాయణపురం, వెల్మినేడు నల్లగొండ : నల్లగొండ, కనగల్, గుర్రంపోడ్, తిప్పర్తి, నార్కట్‌పల్లి, అక్కినేపల్లి, మునుగోడు నాగార్జునసాగర్ : హాలియా, నిడమనూరు, పెద్దవూర దేవరకొండ : డిండి, చందంపేట, పీఏపల్లి, గుడిపల్లి, కొండమల్లేపల్లి, చింతపల్లి హూజర్‌నగర్ : మేళ్లచెరువు, మఠంప ల్లి, లింగగిరి, గరిడేపల్లి, కల్మల్చెరువు నకిరేకల్ : కేతేపల్లి, శాలిగౌరారం, ఓగోడు, కట్టంగూర్ మర్రిగూడ : మర్రిగూడ, చండూరు, నాంపల్లి, వి.టి.నగర్ మిర్యాలగూడ : ఆలగడప, వేముల పల్లి, త్రిపురారం, పెద్దదేవులపల్లి, దా మరచర్ల, నేరడుచర్ల, పెంచికల్ దిన్నె కోదాడ : అనంతగిరి, కాపుగల్లు, చిలుకూరు నడిగూడెం :త్రిపురవరం, మునగాల, రేపాల సూర్యాపేట : కాసరాబాద, ఆత్మకూర్.ఎస్, పెన్‌పహాడ్, మోతె, పాములపహాడ్, చివ్వెంల తుంగతుర్తి : తుంగతుర్తి, అర్వపల్లి. నూతనకల్, నాగారం, తిరుమలగిరి అందుబాటులో లేని వైద్యం : గోద శ్రీనివాస్ , సర్పంచ్ బొల్లేపల్లి : మా గ్రామంలో ఉన్న పీహెచ్‌సీల్లో వైద్యు లు, సిబ్బంది సరిగా విధులకు హాజరుకారు. డాక్టర్ ఎప్పుడు వస్తుందో ఎప్పు డు పోతుంతో తెలియదు. సిబ్బంది కూ డా అదే పరిస్థితి. ప్రజలకు అందుబాటు లో ఉండాలని ఇటీవల నేను చెప్పినప్పటికీ వారిలో మార్పు రాలేదు. అధికారు లు గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలి.