ప్రసవ వేదన
లక్ష్యాన్ని చేరుకోని ప్రభుత్వాసుపత్రులు
వేధిస్తున్న వైద్య సిబ్బంది, మందుల కొరత
పీహెచ్‌సీలలో కరువైన కనీస వసతులు
అత్యవసర కేసులు పెద్దాస్పత్రులకు రెఫర్
స్త్రీ శిశు సంక్షేమ శాఖలు కలిసి నడిస్తేనే ఫలితం..
కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రులు ప్రసవాల విషయంలో నిర్ధేశించినలక్ష్యాలను అధిగమించలేకపోతున్నాయి. అవసరమైన మేరకు వైద్యులు లేకపోవడం, మత్తు డాక్టర్లు అసలే లేకపోవడం, జననీ శిశు సురక్ష కార్యక్రమం ద్వారా నిధుల విడుదలలో జాప్యం... ఇలా పలు సమస్యలు ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో అవగాహన కల్పించాలని చెప్తున్నా... ఆ మేరకు ఫలితాలు రావడం లేదు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అన్న నాటి పరిస్థితుల నుంచి బయట పడలేకపోతున్నారు. అరకొర వసతుల మధ్యన ‘ప్రసవ వేదన’ తప్పదన్న భావన ఇంకా తొలగిపోవడం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలంటే ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల పరిస్థితి, డాక్టర్లు, సిబ్బంది కొరత, ల్యాబ్‌ల్లో అసౌకర్యాలు తదితర అంశాలపై ‘సాక్షి నెట్‌వర్క్’ అందిస్తున్న పరిశీలనాత్మక కథనం... – సాక్షి, కరీంనగర్
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెంచండి. ప్రభుత్వం వైద్యం, ఆరోగ్యం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకుండా ఉండేందుకు ప్రతి ఆడబిడ్డ ప్రభుత్వాసుపత్రిలోనే పురుడు పోసుకునే విధంగా కృషి చేయండి.. ఇది అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
కరీంనగర్/నెట్‌వర్క్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 20 క్లస్టర్లు, 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 571 ఉప కేంద్రాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 37,76,269 మంది జనాభా ఉంటే... ఇందులో 18,95,469 మంది స్త్రీలు ఉన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 13 మండలాలు ఇతర జిల్లాలకు వెళ్లగా... కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 883 రెవెన్యూ గ్రామాలు, 33,38,497 జనాభా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా విడుదల చేసిన ఆయా జిల్లాల సమాచారంలో ఈ నాలుగు జిల్లాల్లో 1372 పడకల ఆసుపత్రులుంటే... 192 మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, గోదావరిఖని, రామగుండం, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి తదితర ఆసుపత్రుల్లో అత్యధికంగా ప్రసవాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగితే రూ.1900 వరకు పారితోషికం కూడా అందిస్తారు.
అయితే గత కొద్దిరోజులు జననీ శిశు సురక్ష కింద విడుదలయ్యే నిధులకు గ్రహణం పట్టింది. ఇందుకు తోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, కనీస సౌకర్యాల లేమి, రవాణా సౌకర్యం కల్పించకపోవడం ప్రతిబంధకాలుగా చెప్తున్నారు. చాలాచోట్ల రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలకు సకాలంలో రక్తం అందడం లేదంటున్నారు. అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు గ్రామ గ్రామాన తిరిగి గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, ఆరోగ్య సమస్యలపై మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపోను మహిళా వైద్యనిపుణులు లేకపోవడంతో ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతుండగా, వైద్య, స్త్రీ,శిశు సంక్షేమ, ఐకేపీ శాఖలు సంయుక్తంగా పనిచేస్తే కొంతైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో...
జిల్లాలోని పదమూడు మండలాల గర్భిణులకు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి ఒక్కటే శరణ్యం. ఆస్పత్రిలో ఒక సివిల్‌సర్జన్, ఒక్క అనెస్థీషియ డాక్టర్ ఉన్నారు. రెండు అసిస్టెంట్ సివిల్ సర్జన్‌లు, ఒక అనెస్థీషియ, ఆర్సీహెచ్, సివిల్ సర్జన్, రెండు గైనకాలజిస్టు పోస్టులు ఖాళీ ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా ఆసుపత్రితోపాటు మండలానికొకటి చొప్పున 13 పీహెచ్‌సీలు ఉన్నాయి. సిరిసిల్లలో తప్ప మరెక్కడా ప్రసవాలు జరిపే వీలు లేదు. జిల్లాలో ౖవైద్యాధికారులు 3, డీసీఎస్ 1, సీహెచ్‌ఓ 1, ఏపీఎంవోలు 5, హెచ్‌ఈలు 2, స్టాఫ్‌నర్స్ 7, రేడియోగ్రాఫర్స్ 2, ఫార్మాసిస్టులు 3, ఎంపీహెచ్‌ఏలు మొత్తం 48, రెండో ఏఎన్‌ఎం 2, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో 21, మొత్తంగా 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీల్లో ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు నామమాత్రంగా ఉన్నాయి. మూడు నెలలుగా జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2046 కాన్పులు జరుగగా..899 సాధారణ, 1147 సిజేరియన్ కాన్పులు జరిగాయి. సర్కారు దవాఖానాలో వసతులు లేవు. చీకటి గదులు, ఇరుకైన ప్రదేశాల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. ఇరుకైన గదుల్లోనే గర్భవతులు, బాలింతలు ఉండాల్సిన పరిస్థితి. ఆపరేషన్ థియేటర్‌లో సదుపాయాలు లేవు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 127 ప్రసవాలు జరిగినట్లు రికార్డులున్నాయి. డిసెంబర్ మాసంలోనే 25 ప్రసవాలు జరిగాయి.