అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం
Published Tue, Aug 2 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
జీజీహెచ్‌లో ప్రాణాలు కోల్పోతున్న పేదలు
క్యాజువాలిటీపై కొరవడిన పర్యవేక్షణ
చర్యలు తీసుకోవడంలో అధికారుల వెనుకడుగు
ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చేవారికి గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో సకాలంలో వైద్యం అందటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్యసేవల విభాగంలో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సోమవారం ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే వారు మృత్యువాత పడ్డారని మృతుల బంధువులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితులకు, ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం వచ్చే రోగులకు అత్యవసర వైద్యసేవలను అందించే క్యాజువాలిటీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రికి గుండెకాయ లాంటి అత్యవసర వైద్యసేవల విభాగంలో సకాలంలో వైద్యసేవలు లభించక పలువురు పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిరంగిపురం రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్సకోసం వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులకు సకాలంలో వైద్యులు సేవలను అందించకపోవడం వల్లే మృతిచెందారని ఆరోపిస్తూ ఆదివారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆస్పత్రి అధికారులు సైతం వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమేననే విషయాన్ని సోమవారం సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సమమాల్లో కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి కంటితుడుపు చర్యలే తీసుకుంటున్నారే తప్ప మెరుగైన వైద్యసేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
సంఘటనలు తరచుగా జరుగుతున్నా...
అత్యవసర వైద్యసేవల విభాగంలో వైద్యులు పట్టించుకోవడం లేదని గతంలో సైతం పలుమార్లు రోడ్డుప్రమాద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడకు చెందిన ఏడునెలల పసిపాపకు శరీరం కాలి చికిత్స కోసం జీజీహెచ్ క్యాజువాలిటీకి రాగా 24గంటల సేపు క్యాజువాలిటీలో ఉంచారే తప్ప ఎలాంటి వైద్యం చేయలేదని పాప తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే దానికి ఎవరు జవాబుదారీ...పోయిన ప్రాణాలను తిరిగి తేగలరా అనే ప్రశ్నలకు వైద్యాధికారుల వద్ద సమాధానం ఉండదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది బంధువులు సైతం వైద్యం అందక ప్రాణాలు పోతాయనే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీసిన సంఘటనలు ఉన్నాయి.
డ్యూటీ డాక్టర్లు కనిపించరు..
అత్యవసర వైద్యసేవల విభాగంలో డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్(డీఏపీ) డ్యూటీ అసిస్టెంట్ సర్జన్(డీఏఎస్)లు విధుల్లో ఉండడం లేదని ఆస్పత్రి అంతా కోడై కూస్తున్నా, వారితో విధులను చేయించే అధికారులు లేకపోవడంతో క్యాజువాలిటీలో మరణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి కేటాయించిన గది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరికీ డ్యూటీ ఉంటే కేవలం ఒకరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. మరొకరు తమ సొంత క్లినిక్‌లో వైద్యం చేసుకుంటూ జీతాలు మాత్రం జీజీహెచ్ నుంచి తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తమకు కేటాయించిన గదిలో నిద్రపోవడం, లేదా కొద్దోగొప్పో డబ్బులు వచ్చే సర్టిఫికెట్ల మంజూరు పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప రోగులకు, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
రాత్రివేళల్లో మరీ ఘోరం...
పగలే చుక్కలు చూపించే వైద్యులు, వైద్య సిబ్బంది ఇక రాత్రివేళల్లో వచ్చే వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు. రాత్రివేళల్లో క్యాజువాలిటిలో ఉండి ఎవరు విధుల్లో ఉన్నారు, ఎవరులేరనే విషయాలను పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండి పోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
- డాక్టర్ రాజునాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్
క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటాం. ఆదివారం క్యాజువాలిటీలో రోడ్డుప్రమాద బాధితులు మృతిచెందిన విషయంలో వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం.
Advertisement
Advertisement