అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వాస్పత్రుల కన్నా మెరుగైన వైద్యం చేస్తారన్న భ్రమతో రోగులను తీసుకొస్తే వైద్యులు లేరని, సరైన పరికరాలు లేవని చెప్పి అడ్మిట్ చేసుకోవడం లేదు. కనీసం ప్రథమ చికిత్స చేసేందుకు కూడా నిరాకరిస్తున్నారు.
అత్యవసర కేసులు అన్ని వేళలా చూస్తాం.. 24 గంటలూ వైద్య సేవలు అందిస్తామని బోర్డులు ఏర్పాటు చే సినా.. అవి కేవలం ప్రచారం వరకేనని స్పష్టమవుతోంది. ఈ నెల ఒకటో తేదీన అనంతపురంలోని కోవూర్‌నగర్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు కోదండరామిరెడ్డి ఆటో ప్రమాదంలో గాయపడి.. ప్రాణాపాయ స్థితిలో ఉండగా పలు ఆస్పత్రులకు తీసుకెళ్తే వైద్యులు తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. సకాలంలో వైద్యమందించక బాలుడి మృతికి కారకులై అతడి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి.
ప్రథమ చికిత్సకు పాతర..
అత్యవసర చికిత్స కోసం వచ్చే వారిని ఏ ప్రైవేట్ ఆస్పత్రి అయినా ముందు ప్రథమ చికిత్స చేసి.. అవసరాన్ని బట్టి ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేయాలి. అయితే జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు రోగిని చూసి.. ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉంది అని భావిస్తే.. ప్రాథమిక చికిత్స, పరీక్షలు కూడా చేయకుండానే తిరస్కరిస్తున్నారు. బెంగళూరు, కర్నూలు ఆస్పత్రులకు తీసుకెళ్లండంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ఇలా అన్ని ఆస్పత్రులూ తిరిగి.. చికిత్స చేయించేలోపు రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి.
ఎందుకిలా..?
చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు లేరు. ఏదో ఇద్దరు ముగ్గురు వైద్యులతో నడిపించేస్తున్నారు. కొందరు వైద్యులు వారి విభాగం కాకుండా ఇతరత్రా సమస్యలపై ఇసుమంతైనా జోక్యం (ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని) చేసుకోవడం లేదు. వైద్యంపై కాస్త అవగాహన ఉన్న రోగులెవరైనా వైద్యున్ని రెండు..మూడు సందేహాలడిగితే, ఈ పరీక్షలన్నీ చేయించుకుని రండంటూ చాంతాడంత లిస్టు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్వరాలు, రక్తహీనత, సీజనల్ వ్యాధులైతేనే వెంటనే చేర్చుకుంటున్నారు. కాస్త ఆందోళనకరంగా ఉందని తెలిస్తే మాత్రం చేతులెత్తేస్తున్నారు. ఫిట్స్ వచ్చిన వారిని తీసుకొస్తే చాలు.. కొన్ని ఆస్పత్రులైతే వాకిలి వద్దే ‘కర్నూలుకు వెళ్లండ’ని చెప్పేస్తున్నాయి.
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 137 ప్రైవేట్ ఆస్పత్రులు, 40 క్లినిక్‌లు ఉన్నాయి. అందులో 20 పడకల ఆస్పత్రులు 91, 50 పడకల ఆస్పత్రులు 31, వంద పడకల ఆస్పత్రులు 15, డెంటల్ ఆస్పత్రులు 15 ఉన్నాయి. 24 గంటలు పనిచేసే ఆస్పత్రులు 122 ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా నడుస్తున్న క్లినిక్‌లకు లెక్కేలేదు. జిల్లాలో ఎన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయని ప్రశ్నిస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నోరెళ్లబెడుతున్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు సర్వే చేస్తే గాని ఆ వివరాలు తెలియవంటున్నారు.
ప్రథమ చికిత్స చేయాల్సిందే..
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ఏ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినా వారి పరిస్థితి చూసి ప్రథమ చికిత్స తప్పకుండా చేయాలి. చికిత్స చేయకుండా వెనక్కు పంపకూడదు. వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన వారి బాధితులు మమ్మల్ని ఆశ్రయిస్తే శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తాం. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా అన్ని ఆస్పత్రులూ పనిచేయాలి. - డాక్టర్ సీఆర్ రామసుబ్బారావు, జిల్లా వైద్య రోగ్య శాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌ఓ)