DGCI
-
మారుత్ ఏజీ–365ఎస్ డ్రోన్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్
హైదరాబాద్: బహుళ ప్రయోజనకారి అయిన ఏజీ–365ఎస్ వ్యవసాయ డ్రోన్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి టైప్ సర్టిఫికేషన్ లభించినట్లు మారుత్ డ్రోన్స్ తెలిపింది. చిన్న, మధ్య తరహా బ్యాటరీ ఆధారిత డ్రోన్లకు డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికేషన్ పొందిన తొలి సంస్థ తమదేనని పేర్కొంది. ఈ డ్రోన్‌ను ఇటు పురుగు మందుల పిచికారీ కోసం వ్యవసాయ రంగంతో పాటు అటు రిమోట్ పైలట్ ట్రెయినింగ్ (ఆర్పీటీవో)లో కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. దీనితో డ్రోన్ ఎంట్రప్రెన్యూర్ రూ. 40,000 నుంచి రూ. 90,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. అలాగే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి నామమాత్రంగా 5–6శాతం వడ్డీ రేటుతో రూ. 10 లక్షల వరకు తనఖా లేని రుణాన్ని పొందేందుకు కూడా ఈ డ్రోన్‌కు అర్హత ఉంటుందని వివరించారు. -
బీఈ టీకాకు డీసీజీఐ అనుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 14–వాలెంట్ పీడియాట్రిక్ న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా తయారీ, విక్రయాలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతులు లభించినట్లు బయోలాజికల్ వెల్లడించింది. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియాకు సంబంధించిన ఈ టీకాను 6, 10, 14 వారాల పిల్లలకు 3 డోసులు కింద ఇవ్వొచ్చని పేర్కొంది. భారత్‌లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అయిదేళ్ల లోపు పిల్లల మరణాలకు ఎక్కువగా ఎస్ న్యూమోనియా కారణమవుతోందని తెలిపింది. పీసీవీ14తో కోట్ల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలమని కంపెనీ ఎండీ మహిమా దాట్ల తెలిపారు. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
Covid-19: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారీ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్.. ఐఎన్‌కోవ్యాక్ (బీబీవీ164)ను 18 ఏళ్లుపైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరుచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ మంగళవారం ట్వీట్ చేశారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ తయారీ వ్యాక్సిన్.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ కావడం విశేషం. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 4,000 మంది వలంటీర్లపై జరిపిన పరీక్షల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాధి నిరోధకతను వ్యాక్సిన్ సమర్థవంతంగా ప్రేరేపించిందని వెల్లడించారు. ప్రపంచ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ టెక్నాలజీలో నూతన ఒరవడి మొదలవనుందని ఆయన అన్నారు. -
తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి
న్యూఢిల్లీ: అర్ధరాత్రి పరిణామాల నడుమ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ కొవిడ్-19 వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. పూణేకి చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను వృద్ధి చేసింది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌కమిటీ(SEC) ఈ వ్యాక్సిన్ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెబుతూ.. అత్యవసర వినియోగం శుక్రవారం ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో.. డీసీజీఐ మంగళవారం రాత్రి అనుమతులు జారీ చేసింది. రెండు డోసులతో పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు.. 28 రోజుల టైంతో ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. ఎంఆర్ఎన్ఏ ఆధారిత పూర్తి స్వదేశీయంగా తయారైన ఈ వ్యాక్సిన్‌కు ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే.. రెండు నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా ఈ వ్యాక్సిన్‌ను స్టోరేజ్ చేయొచ్చు. దేశంలోనే ఈ తరహా వ్యాక్సిన్ ఇదే మొదటిది కావడం గమనార్హం. సాధారణంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను.. అత్యంత లో-టెంపరేచర్లలో(సున్నా అంతకంటే తక్కువ) భద్రపరిచి.. సరఫరా చేస్తారు. అలాంటిది జెన్నోవా వ్యాక్సిన్‌కు అలాంటి ఆటంకాలేవీ లేవని కంపెనీ చెబుతోంది. పూణేకు చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్.. దేశంలోనే తొలి కొవిడ్-19 m-RNA వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మూడు దశలుగా ఈ వ్యాక్సిన్ టెస్టింగ్‌లకు సంబంధించిన నివేదికలను డ్రగ్ రెగ్యులేటరీకి సమర్పించింది కూడా. ఫేజ్2, 3లను నాలుగు వేలమందిపై ప్రయోగించింది కంపెనీ. జెన్నోవా వ్యాక్సిన్‌తో పాటు సీరం ఇనిస్టిట్యూట్ రూపొందించిన కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి (ఏడు నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు) డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవ్ ఇచ్చింది. చదవండి: వైరస్ రూపాలెన్ని మార్చినా.. ఏమార్చే టీకా! -
‘భిన్న’ బూస్టర్‌డోస్‌గా కార్బెవ్యాక్స్
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ తయారుచేసిన కార్బెవ్యాక్స్ కోవిడ్ టీకాను బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు ఆ సంస్థకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) తాజాగా అనుమతులిచ్చింది. దేశంలోనే హెటిరోలోగస్ బూస్టర్ డోస్‌గా అనుమతి పొందిన తొలి సంస్థ తమదే అని బయోలాజికల్ ఈ శనివారం ప్రకటించింది. ముందుగా తీసుకున్న రెండు టీకాల తర్వాత వేరే తయారీ సంస్థకు చెందిన కోవిడ్ టీకా మూడోదిగా తీసుకుంటే దానిని హెటిరోలోగస్ బూస్టర్ డోస్‌గా వ్యవహరిస్తారు. దేశంలో 18 ఏళ్లు, ఆపైబడిన వయసు వారు కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ రెండు డోస్‌లు తీసుకున్న 6 నెలల వ్యవధి తర్వాత బూస్టర్‌డోస్‌గా కార్బెవ్యాక్స్‌ను తీసుకోవచ్చు. -
సింగిల్ షాట్ ‘స్పుత్నిక్’కు అత్యవసర అనుమతి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన సింగిల్–డోసు స్పుత్నిక్ లైట్ టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం ట్విటర్లో ప్రకటించారు. స్పుత్నిక్–5 టీకా తరహాలోనే స్పుత్నిక్ లైట్ టీకా పని చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. దీంతో డ్రగ్ రెగ్యులేటర్‌లోని నిపుణుల కమిటీ శనివారం ఈ మేరకు అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. త్వరలో డీసీజీఐ పూర్తి స్థాయిలో తుది అప్రూవల్ ఇవ్వనుందని తెలుస్తోంది. స్పుత్నిక్ లైట్‌తో భారత్‌లో వ్యాక్సిన్ల సంఖ్య 9కి చేరింది. DCGI has granted emergency use permission to Single-dose Sputnik Light COVID-19 vaccine in India. This is the 9th #COVID19 vaccine in the country. This will further strengthen the nation's collective fight against the pandemic. — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 6, 2022 చదవండి: సూది, నొప్పి లేకుండా కరోనా వ్యాక్సిన్.. మనదేశంలోనే! -
కోవాగ్జిన్, కోవిషీల్డ్ విక్రయానికి అనుమతి
న్యూఢిల్లీ: భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ గురువారం షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఈ రెండు టీకాలు ఇకపై సాధారణ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. టీకా డేటా ప్రతి ఆరు నెలలకోసారి అందించాల్సి ఉంటుందని భారత ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. ప్రతికూల ప్రభావాలపైనా పర్యవేక్షణ కొనసాగనుంది. అయితే వీటిని కేవలం ఆస్పత్రులు, క్లినిక్‌ల నుంచి మాత్రమే పొందగలుగుతారు. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. అయితే బహిరంగ మార్కెట్లో విక్రాయానికి అనుమతించాలంటూ కోవాగ్జిన్ అభివృద్ది చేసిన భారత్ బయోటెక్, కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ సంస్థలు.. గత ఏడాది అక్టోబర్ 25న డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ, షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. బహిరంగ మార్కెట్లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల ఒక్క డోసు రూ. 275గా నిర్ణయించినట్టుగా, సర్వీస్ చార్జీ మరో రూ. 150 ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200 రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. రోజురోజుకూ తగ్గుతున్న కరోనా కేసులు... వరుసగా మూడో రోజూ దేశంలో కోవిడ్ కేసులు తగ్గాయి. ఒక రోజులో 2,86,384 మంది కరోనావైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో 20,546 కేసులు తగ్గాయని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 22,02,472 క్రియాశీల కేసులున్నాయి. నేటితో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,03,71,500కి పెరిగింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. 573 మరణాలతో మరణాల సంఖ్య 4,91,700కి చేరుకుంది. అయితే మరణాల సంఖ్యలోనూ తగ్గుదల నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 573 కొత్త మరణాలలో కేరళ నుండి 140 మరియు మహారాష్ట్ర నుండి 79 మంది ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజు 22 లక్షల మంది టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ డోసుల పంపిణీ 163 కోట్లను దాటింది. -
కోవిడ్ ఔషధం వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న కోవిడ్–19 ఔషధం మోల్నుపిరావిర్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ యాంటీ వైరల్ డ్రగ్‌కు అయిదు రోజుల్లో వైరస్‌ను కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉండడంతో సహజంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు మోల్నుపిరావిర్ ఔషధం తయారీ, విక్రయానికి పలు కంపెనీలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంగళవారం అనుమతి ఇచ్చింది. ఔషధ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుని వాటి ఫలితాల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించిన ఈ సంస్థలు.. మోల్నుపిరావిర్ జనరిక్ వర్షన్ ఉత్పత్తికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. మోల్నుపిరావిర్‌ను మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ అభివృద్ధి చేశాయి. అయిదు రోజులు వాడితే చాలు.. ప్రస్తుతానికి మోల్నుపిరావిర్ 200 ఎంజీ క్యాప్సూల్స్ ఉత్పత్తికి డీసీజీఐ ఆమోదం తెలిపింది. మోల్నుపిరావిర్‌ను 18 ఏళ్లు పైబడి, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్న కోవిడ్–19 రోగులకు వైద్యులు సిఫార్సు చేస్తారు. ప్రత్యేకత ఏమంటే అయిదు రోజులు ఈ మందు వాడితే చాలు. ఉదయం 800 ఎంజీ, రాత్రి 800 ఎంజీ తీసుకోవాల్సి ఉంటుంది. తాము చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 80 శాతం మంది రోగులు అయిదు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారని.. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ఒక కంపెనీ డైరెక్టర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘10 రోజుల్లో 93 శాతం, 14 రోజుల్లో 99 శాతం మందికి నెగెటివ్ వచ్చింది. ఈ మందు వైరస్ ప్రభావాన్ని పూర్తిగా నియంత్రించడం విశేషం. కోవిడ్–19కు ఈ ఒక్క డ్రగ్ సరిపోతుంది. ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిన అవసరం దాదాపుగా ఉండదు’ అని ఆయన వివరించారు. ఇదీ కంపెనీల జాబితా.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మోల్నుపిరావిర్ ఔషధం తయారీకి సంబంధించి భారత్‌లో ప్రస్తుతానికి 13 కంపెనీలు ఆమోదం పొందాయి. ఇందులో ఆరు సంస్థలు హైదరాబాద్‌కు చెందినవే కావడం విశేషం. వీటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో, నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఆప్టిమస్ ఫార్మా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన సన్ ఫార్మా, సిప్లా, వయాట్రిస్ (గతంలో మైలాన్) టోరెంట్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బీడీఆర్ ఫార్మాస్యూటికల్స్‌కు సైతం డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. మోల్నుపిరావిర్ ఔషధ పరీక్షలను రెడ్డీస్, అరబిందో, హెటిరో, నాట్కో, ఎంఎస్ఎన్, ఆప్టిమస్, స్ట్రైడ్స్, బీడీఆర్ జరిపాయి. డాక్టర్ రెడ్డీస్ నేతృత్వంలో సన్, సిప్లా, వయాట్రిస్, టోరెంట్, ఎమ్క్యూర్ కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి ఔషధ పరీక్షలను నిర్వహించాయి. అన్ని బ్రాండ్లు వారంలోనే.. మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్‌ను నేడో రేపో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. అన్ని బ్రాండ్లు ఈ వారమే విపణిలోకి రానున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఔషధాన్ని సరఫరా చేయగలిగే సామర్థ్యం తమకు ఉందని అరబిందో వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఈ క్యాప్సూల్స్ తయారు చేయనున్నట్టు హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థ సారథి రెడ్డి తెలిపారు. కాగా, బ్రాండ్‌నుబట్టి ఒక్కో క్యాప్సూల్ గరిష్ట ధర రూ.30 నుంచి రూ.75 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం. 400 ఎంజీ క్యాప్సూల్స్ తయారీకై అనుమతించాల్సిందిగా ఇప్పటికే కంపెనీలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ వారంలోనే గ్రీన్ సిగ్నల్ రావొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. 400 ఎంజీ అందుబాటులోకి వస్తే రోగులకు పెద్ద ఉపశమనం ఉంటుంది. -
12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అత్యవసర వాడుకకు అనుమతినిచ్చింది. అయితే ఈ అనుమతికి పరిమితులు విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2–18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాడకంపై భారత్ బయోటెక్ ఫేజ్–2 ట్రయల్స్ నిర్వహించి సీడీఎస్సీఓకు గతంలో సమర్పించింది. పిల్లలకు కొన్ని నిబంధనలతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అక్టోబర్‌లో సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సిఫార్సును డీజీసీఐకు చెందిన మరో కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, మరిన్ని వివరాలు సమర్పించాలని కంపెనీని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివరాలు పరిశీలించిన అనంతరం డీజీసీఐ కోవాగ్జిన్‌కు శుక్రవారం అనుమతినిచ్చినట్లు వెల్లడించాయి. కమిటీ సూచన మేరకు కోవాగ్జిన్‌ను 12– 18ఏళ్ల వారికి 0– 28 రోజుల వ్యవధిలో అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతినిస్తున్నట్లు డీజీసీఐ ప్రకటన వెల్లడించింది. డీజీసీఐ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో జైడస్ క్యాడిలా వారి జైకోవ్– డీ టీకాను 18 ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పిల్లలపై సీరమ్, బయోలాజికల్–ఇ లిమిటెడ్ కంపెనీల టీకాల ఫేజ్2 ట్రయల్స్‌కు డీజీసీఐ గతంలో అనుమతినిచ్చింది. డీజీసీఐ తాజా నిర్ణయాన్ని మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. -
కోటి ‘జైకోవ్–డి’ డోసులకు కేంద్రం ఆర్డర్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి నియంత్రణకు గాను 12 నుంచి 18 ఏళ్లలోపు వారి కోసం భారత్‌లో అనుమతి పొందిన తొలి టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్–డి వ్యాక్సిన్ కోటి డోసుల కొనుగోలుకు కేంద్రం ఆర్డర్ ఇచ్చినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. ఈ టీకాకు ఆగస్టు 20న డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్‌కు పన్నులు మినహాయించి రూ.358 ఖర్చవుతుంది. తమవద్ద ఉన్న పరిమిత వనరుల నేపథ్యంలో ప్రతినెలా ఒక కోటి డోసులను మాత్రమే సరఫరా చేయగలమని జైడస్ క్యాడిలా సంస్థ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. కరోనా నియంత్రణ కోసం జైకోవ్–డి టీకాను మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోస్ తర్వాత 28వ రోజు రెండో డోస్, 56వ రోజు మూడో డోస్ ఇవ్వాలి. -
కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి అనుమతులివ్వండి
న్యూఢిల్లీ: భారత్‌తో పాటు పలు దేశాల్లో 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగినందువల్ల కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి వ్యాపార అనుమతి మంజూరు చేయాలని తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియా (సీఐఐ) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. భారత్‌లో వినియోగిస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్లకు అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఇదివరకే సమర్పించామని, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకాల పంపిణీ జరిగిందని, వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని, వ్యాక్సిన్ సమర్థతకు ఇదే నిదర్శనమని సీరమ్ పేర్కొంది. -
గౌతం గంభీర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌పై డ్రగ్ కంట్రోలర్ శాఖ దాఖలు చేసిన కేసులో స్టే ఇవ్వలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గంభీర్ తరపున న్యాయవాది డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం కింద ప్రాసిక్యూషన్‌కు స్టే ఇవ్వాలని కోరగా, కోర్టు ఈ విధంగా తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఫాబీప్లూ మందులకు డిమాండ్ భారీగా ఉంది. ఆ పరిస్థితుల్లో గంభీర్ ఫౌండేషన్ సుమారు రెండు వేలకు పైగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను ప్రజలకు పంచిన సంగతి తెలిసిందే. దీంతో ఫాబీఫ్లూ టాబ్లెట్లను అక్రమంగా నిల్వ చేసినట్లు గంభీర్‌పై ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశానుసారం డీజీసీఐ.. గంభీర్ నిర్వహిస్తున్న ఫౌండేషన్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను అనధికారికంగా నిల్వ ఉంచడమే కాకుండా, పంపిణీ చేయడం డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ ప్రకారం నేరంగా పరిగణిస్తూ ఆ ఫౌండేషన్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో గంభీర్‌ను దోషిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరింత పురోగతి విచారణ కోసం కోర్టు అధికారులకు ఆరు వారాల గడువు ఇచ్చింది. అయితే తాజాగా ఆ కేసుకు సంబంధించి గంభీర్ తరపు న్యాయవాది స్టే కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం తీర్పునిస్తూ.. ఆ కేసులో మేం స్టే ఇవ్వలేమని, ఢిల్లీ హైకోర్టు ముందే మీ వాదనలు వినిపించాలంటూ తేల్చి చేప్పింది. -
విదేశీ టీకాలకు మూడు రోజుల్లోనే అనుమతులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగానికి విదేశీ కోవిడ్ టీకా సంస్థలు పెట్టుకునే దరఖాస్తులపై మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. విదేశీ కంపెనీలు పెట్టుకున్న పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు అవి అందిన మూడు పనిదినాల్లోగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) అనుమతి మంజూరు చేస్తుందని వివరించింది. సదరు విదేశీ సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఉత్పత్తి ప్రాంతం, ఉత్పత్తి) దిగుమతి అనుమతి పత్రాలను సీడీఎస్‌సీవో పరిశీలిస్తుందని పేర్కొంది. సంతృప్తికరంగా ఉంటే ఆయా కోవిడ్ టీకాలను పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి మాత్రమే అనుమతిస్తుందని తెలిపింది. మార్గదర్శకాలకు లోబడి ఆ టీకాను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. విదేశీ టీకా కంపెనీలు భారత్‌లోని తమ అనుబంధ సంస్థ ద్వారా గానీ అధీకృత ఏజెంట్ ద్వారా గానీ సీడీఎస్‌సీవోకు దరఖాస్తు చేసుకోవాలనిఆరోగ్య శాఖ తెలిపింది. ‘వ్యాక్సినేషన్లో వినియోగించటానికి ముందుగా సదరు విదేశీ టీకాను 100 మంది లబ్ధిదారులకు వేసి, వారం రోజుల పరిశీలన తర్వాత ప్రభుత్వ నిపుణుల కమిటీ వారి పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. ఆ టీకా రోగ నిరోధక శక్తి, భద్రతలను బేరీజు వేశాకే అనుమతి ఇస్తుంది’అని వివరించింది. సీడీఎస్‌సీవో ప్రోటోకాల్ ప్రకారం సదరు విదేశీ టీకాల ప్రతి బ్యాచ్‌ను కసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చి లేబొరేటరీ(సీడీఎల్) ద్వారానే విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా, యూకే, జపాన్‌ల్లో అత్యవసర వినియోగానికి అనుమతించిన కోవిడ్ టీకాలకు దేశంలో ఫాస్ట్‌ట్రాక్ విధానంలో అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
మార్చిలో ‘స్పుత్నిక్ వి’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్ వి టీకాను దేశీయంగా మార్చిలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వెల్లడించింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయని, ఇవి ముగిశాక అత్యవసర వినియోగం కింద అనుమతుల కోసం (ఈయూఏ) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకోనున్నామని సంస్థ సీఈవో (ఏపీఐ, ఫార్మా సేవల విభాగం) దీపక్ సప్రా తెలిపారు. తొలుత 12.5 కోట్ల మందికి సరిపడా డోసేజీలను అందుబాటులోకి తేనున్నట్లు శుక్రవారం మూడో ్రౖలె మాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన వివరించారు. ధర విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రష్యాకి చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడీమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ çస్పుత్నిక్ వి టీకాను అభివృద్ధి చేసింది. దీన్ని భారత్‌లో పంపిణీ చేసేందుకు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో డీఆర్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. పరిమిత లాభం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డీఆర్ఎల్ నికర లాభం రూ. 28 కోట్లకు పరిమితమైంది. కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ఊహించని విధంగా పోటీ పెరిగిపోవడం, అనూహ్యంగా ధరలు పతనమవడం వంటి ప్రతికూల పరిణామాల కారణంగా దాదాపు రూ. 600 కోట్లు కేటాయించాల్సి రావడం ఇందుకు కారణమని డీఆర్ఎల్ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 538 కోట్ల నష్టం ప్రకటించింది. మరోవైపు, తాజా సమీక్షా కాలంలో ఆదాయం 12 శాతం పెరిగి రూ. 4,397 కోట్ల నుంచి రూ. 4,942 కోట్లకు పెరిగింది. మార్జిన్లను కాపాడుకుంటూ వృద్ధి కొనసాగించగలిగామని సంస్థ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కొత్త ఉత్పత్తుల ఊతంతో మెరుగైన అమ్మకాలు నమోదు చేయగలిగామని డీఆర్ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. జనరిక్స్ ఆదాయం 13 శాతం అప్.. విభాగాల వారీగా చూస్తే గ్లోబల్ జనరిక్స్ ఆదాయం వార్షికంగా 13 శాతం వృద్ధితో రూ. 4,075 కోట్లుగా నమోదైంది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం ఒక్క శాతం వృద్ధితో రూ. 701 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికా మార్కెట్ 9 శాతం (1,739 కోట్లు), భారత మార్కెట్ 26 శాతం వృద్ధి (సుమారు రూ. 959 కోట్లు) నమోదు చేశాయి. శుక్రవారం బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు ఆరు శాతం క్షీణించి రూ. 4,599 వద్ద క్లోజయ్యింది. -
కొత్త ఏడాది శుభవార్త !
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న శుభవార్త కొత్త ఏడాదిలో వింటామని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వీజీ సోమని సూచన ప్రాయంగా వెల్లడించారు. ఈ ఏడాది నిజంగానే వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అని ఆయన వ్యాఖ్యానించారు. చేతిలో ఏదో ఒక వ్యాక్సిన్‌తో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ భారత్ సంబరాలు చేసుకునే అవకాశాలున్నాయని అందుకే ఈ ఏడాది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని ఆయన అన్నారు. బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్ గురువారం నిర్వహించిన వెబినార్‌లో సోమని మాట్లాడుతూ పరిశోధనా సంస్థలు, బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్కి ఇది పరీక్షా సమయమని అన్నారు. కరోనా కేసులు, బ్రిటన్ కొత్త స్ట్రెయిన్ కలకలం నేపథ్యంలో అనుమతుల మంజూరు ప్రక్రియ వేగవంతం చేశామని చెప్పారు. అయితే టీకా భద్రత, సామర్థ్యం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. వ్యాక్సిన్‌పై నేడు నిర్ణయం..? దేశంలో ఇప్పటికే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భారత్ బయోటెక్, ఫైజర్ కంపెనీలు కోవిడ్–19 వ్యాక్సిన్ అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఆ వ్యాక్సిన్ల అనుమతులకు సంబంధించి చర్చించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) గురువారం మరోసారి సమావేశం కానుంది. బుధవారం నాడు ఒక దఫా చర్చలు జరిపిన ఈ సంస్థ కొత్త సంవత్సరం ప్రారంభం రోజు మరింత లోతుగా చర్చించాలని నిర్ణయించింది. దీంతో వ్యాక్సిన్‌కు అనుమతులు మంజూరు చేస్తారేమోనన్న ఉత్కంఠ నెలకొంది. కోవిడ్–19పై ఏర్పాటు చేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఇచ్చిన సమాచారాన్ని ఇప్పటికే విశ్లేషించి కేంద్రానికి నివేదిక సమర్పించింది. వ్యాక్సిన్ పంపిణీకి వ్యూహాలు వ్యాక్సిన్ పంపిణీలో సమాచార లోపం తలెత్తకుండా వ్యూహాలను రచిస్తూ కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. ప్రజలందరూ వ్యాక్సినేషన్ వివరాలన్నీ తెలుసుకునేలా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమాచారాన్ని పంచుకునే వీలుండేలా వ్యూహాలను రచించింది. వ్యాక్సిన్‌పై అపోహలుంటే తొలగిపోయేలా అన్ని రాష్ట్రాలు సమాచారం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అడిగిన వారందరికీ వ్యాక్సిన్‌పై సమాచారాన్ని ఇవ్వడం, ప్రజల్లో అపోహలు తొలగించడం, వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఆసక్తిని కలిగించడం వంటివి చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. రేపు దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్ కరోనా వ్యాక్సిన్‌కు త్వరలోనే అనుమతులు లభిస్తాయన్న అంచనాలున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ శనివారం నాడు టీకా డ్రైరన్‌ను నిర్వహించనున్నారు. వ్యాక్సినేషన్ సమయంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించడానికి, టీకా పంపిణీ ప్రణాళిక సమర్థవంతంగా అమలవుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ డ్రైరన్‌ను నిర్వహించనున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లోని ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో ఈ డ్రైరన్ నిర్వహించనున్నారు. చాలా రాష్ట్రాల్లో సిబ్బంది, మౌలిక సదుపాయాల కొరత ఉండడంతో ముందస్తుగా సమస్యల్ని గుర్తించడం కోసమే డ్రై రన్ నిర్వహించనున్నట్టుగా కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సన్నద్ధతపై సమీక్షించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కేంద్రం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన చెప్పారు. -
కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు
న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ భారత్‌లో వినియోగానికి అత్యవసర అనుమతుల్ని మంజూరు చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ని కోరింది. ఇప్పటికే యూకే, బహ్రెయిన్‌లో ఫైజర్ అనుమతులు పొందింది. కరోనా టీకా వినియోగం కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న మొదటి సంస్థ ఇదే కావడం విశేషం. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగం కోసం శుక్రవారం ఫైజర్ దరఖాస్తు చేసుకుందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ టీకా అత్యవసర వినియో గానికి అనుమతులు ఇవ్వాలని సీరం ఇన్స్టి ట్యూట్ కూడా ఆదివారం కేంద్రాన్ని కోరింది. నిబంధనల ప్రకారం ఔషధ వినియోగానికి అనుమతులు కోరితే 90 రోజుల్లో బదులివ్వాల్సి ఉంది. యూకే, బహ్రెయిన్లలో ఫైజర్ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తే డీసీజీఐ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ప్రయోజనం ఎంత ? భారత్‌లో ఈ వ్యాక్సిన్ వినియోగం ఎంతవరకు ఉపయోగం అన్న దానిపై అనుమానాలున్నాయి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరచాలి. సాధారణంగా భారత్‌లో వ్యాక్సిన్లన్నీ రెండు నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనే ఉంచుతారు. మన దగ్గర ఈ వ్యాక్సిన్‌ను భద్రపరిచే కోల్డ్ స్టోరేజీలు దొరకడం దుర్లభం. అందుకే భారత్ మొదట్నుంచి ఫైజర్‌తో ఎలాంటి ఒప్పందాలు కానీ వ్యాక్సిన్ ప్రయోగాలు కానీ చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ 95% సామర్థ్యంతో పని చేస్తుందని తేలినప్పటికీ ఈ సంస్థల మాతృదేశాలైన అమెరికా, జర్మనీలు ఇంకా అనుమతులివ్వలేదు. జనవరి నుంచి నెలకి 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తామని ఫైజర్ సంస్థ చెప్పింది. దీంతో భారత్ అవసరాలకు సరిపడా డోసులు ఉత్పత్తి, పంపిణీ చేయడం ఫైజర్ ఇప్పట్లో చేయడం కష్టమేనని కరోనాపై జాతీయ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. -
డీసీజీఐ అనుమతి కోరిన ఫైజర్
న్యూఢిల్లీ: కోవిడ్-19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ‘భారత ఔషధ నియంత్రణ జనరల్’ (డీసీజీఐ)ని అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ కోరింది. ఈ టీకాను ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్, బహ్రెయిన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. భారతదేశంలో 96 లక్షలకు పైగా ప్రజలను ప్రభావితం చేసిన మహమ్మారి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనే రేసులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. డిసెంబర్ 4న సమర్పించిన తన దరఖాస్తులో ఫైజర్ ఇండియా ‘వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించడానికి, పంపిణీకి అనుమతించాలని, భారత ప్రజలపై క్లినికల్ పరీక్షల నిర్వహణ కోసం ఆవశ్యకతను ప్రత్యేక నిబంధనల కింద రద్దు చేయాలని దానిలో కోరింది’ అని పిటిఐ పేర్కొంది. (కరోనా వైరస్: ఎన్నో వ్యాక్సిన్లు..) కరోనా వ్యాక్సిన్‌పై ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్ 95 శాతం సేఫ్ అని ఫైజర్ ప్రకటించింది. తుది దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను ఫైజర్ సంస్థ ఈయూకి అందించింది. ఈ వ్యాక్సిన్ కి మొదట అనుమతిచ్చిన మొదటి పాశ్చాత్య దేశంగా యుకె నిలిచింది. వ్యాక్సిన్ తయారీ, పంపిణీలకు జర్మన్ కంపెనీ బయో ఎన్‌టెక్ తోపాటు, చైనీస్ కంపెనీ ఫోజన్ తోనూ ఫైజర్ ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా యూరోపియన్ దేశాలు, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. యుకె దీనిని ముందుకు తీసుకెళ్లడం ఒక చారిత్రాత్మక క్షణం అని ఫైజర్ తెలిపింది. భారత్ లో కూడా ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మెసంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీలలో స్టోర్ చేయవలసి ఉంటుందని ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. (వైరస్ ముప్పు సమసిపోలేదు..) -
100 మందిపై స్పుత్నిక్–వీ ప్రయోగం
మాస్కో/న్యూఢిల్లీ: భారత్‌లోని 100 మంది వలంటీర్లపై, రష్యా కోవిడ్ టీకా స్పుత్నిక్–వీను ప్రయోగించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కి డ్రగ్ కంట్రోలర్ జనరల్(డీసీజీఐ) అనుమతిచ్చినట్లు రష్యా వార్త సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ నిర్ణయించాల్సి ఉంది. మూడో దశలోకి ప్రవేశించే ముందు, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీకి, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ప్రయోగాల అనంతరం 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారుచేయడానికి రెడ్డీస్ ల్యాబ్‌కి అనుమతిచ్చినట్లు ఆర్డీఐఎఫ్ వెల్లడించింది. గత నెలలో ఆర్డీఐఎఫ్ భారత ప్రభుత్వంతోనూ, ఔషధ కంపెనీలతో స్థానికంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీపై చర్చించింది. అలాగే స్పుత్నిక్–వీ భద్రత, దాని పనితీరుపై మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ‘ది లాన్సెట్’మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కి 100 మందిపై, మూడో దశలో 1,400 మంది వలంటీర్లపై ప్రయోగాలు జరుపుతారని అధికారులు వెల్లడించారు. తొలిగా 4 కేటగిరీల వారికి టీకా పంపిణీ కరోనా మహమ్మారికి భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ‘స్పెషల్ కోవిడ్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం’ కింద ప్రాధాన్య వర్గాలకు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశలో వ్యాక్సిన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రజలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించింది. ఇందులో కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆశా వర్కర్లు ఉన్నారు. అలాగే 2 కోట్ల మంది మున్సిపల్ కార్మికులు, పోలీసులు, సైనిక సిబ్బంది.. 26 కోట్ల మంది 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 50 ఏళ్లలోపు వయసుండి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికీ మొదటి దశలోనే టీకా ఇచ్చే అవకాశం ఉంది. 77 లక్షలు దాటిన కేసులు దేశంలో గత 24 గంటల్లో 54,366 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 690 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,17,306 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 69,48,497 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,95,509 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 8.96 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 89.53 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.51గా నమోదైంది. -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మన దేశంలోనూ ఆగాయి. ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రయోగాలు చేపట్టేవరకు తామూ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉండగా టీకా డోసు ఇచ్చిన ఒక వాలంటీర్‌కి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలేవరకూ భారత్‌లో రెండు, మూడో దశలకు ఇచ్చిన అనుమతుల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) డాక్టర్ వి.జి. సొమానీ సీరమ్ ఇన్స్టిట్యూట్కి షోకాజ్ నోటీసులు పంపింది. ఆ నోటీసులు అందుకున్న తర్వాతే ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా సీరమ్ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలకు బ్రేక్ పడినప్పటికీ ముందుగా అనుకున్నట్టుగానే ఈ ఏడాది చివరికి టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కాల్ సోరియెట్ చెప్పారు. టీకా భద్రతపై సమీక్షను వేగవంతంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కరోనాకు చైనా నాజల్ స్ప్రే వ్యాక్సిన్ బీజింగ్: కరోనాను నిలువరించడానికి నాజల్ స్ప్రే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కి చైనా అనుమతించింది. తొలి దశ క్లినికల్ ట్రయల్ నవంబర్‌లో ప్రారంభం కావొచ్చని చైనా తెలిపింది. చైనాకి చెందిన నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ తరహా వ్యాక్సిన్‌ని ఆమోదించడం ఇదే తొలిసారి. -
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆగిందా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి నుంచి రక్షిస్తుందని అందరూ నమ్ముతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ప్రయోగాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించడం ఇందుకు కారణమైంది. బ్రిటన్‌లోని ఆరోగ్య వెబ్సైట్ స్టాట్‌న్యూస్ ప్రయోగాలు నిలిపివేస్తున్న సమాచారాన్ని ప్రకటించింది. ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, పుణే కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు జరిపిన ప్రయోగాలూ ఆగిపోతాయా? ఆ పరిస్థితి వచ్చే అవకాశాలు తక్కువ అని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేస్తున్న ఈ టీకా తొలి రెండు దశల మానవ ప్రయోగాలు పూర్తయ్యాయి. అమెరికా, యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో కనీసం 30 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు మొదలయ్యాయి. వేల మందిపై జరిగే ఈ మూడో దశ ప్రయోగాలు ఏళ్లపాటు కొనసాగుతాయి. ఈ క్రమంలో ఒకరిద్దరు జబ్బుపడటం అసాధారణంకాదని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన శాస్త్రవేత్త చెప్పారు. ఆస్ట్రాజెనెకా ఏం చెబుతోంది? స్వతంత్ర సంస్థ ఒకటి ప్రయోగాలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సమీక్షించనుందని, ఆ తరువాతే ప్రయోగాల కొనసాగింపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రాజెనెకా చెప్పినట్లు వార్తాలొచ్చాయి. గతంలోనూ ఒకసారి ఈ టీకా ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేశామని, టీకా వేసిన వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి సమస్యకు కారణం వెంటనే తెలియని పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రయోగాలు నిలిపివేస్తారని ఆరోగ్యవార్తలను మాత్రమే ప్రచురించే స్టాట్‌న్యూస్ తెలిపింది. అన్నీ సవ్యంగా సాగితే కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రయోగాలను పునరుద్దరిస్తారని వివరించింది. భారత్‌లో సాఫీగా ఆక్స్ఫర్డ్ రెండోదశ ప్రయోగాల్లో భారత్‌లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. రెండోదశలో 100 మంది వలంటీర్లపై టీకాను ప్రయోగించామని, కీలకంగా భావించే ఏడురోజుల సమయం దాటినా ఎవరిలోనూ సైడ్ఎఫెక్ట్స్ కనిపించలేదంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ 100 కోట్ల ఆక్స్ఫర్డ్ టీకాలను ఉత్పత్తి చేయడానికి అస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకుంది. సీరమ్‌కు నోటీసు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌పై విదేశాల్లో ప్రయోగాలు నిలిపివేసిన సమాచారాన్ని తమకు ఇవ్వనందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) సీరమ్ ఇన్స్టిట్యూట్కు బుధవారం షోకాజ్ నోటీసు జారీచేసింది. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమేనని నిరూపణ అయ్యేంతవరకు రెండు, మూడో దశల కోసం సీరమ్‌కు ఇచ్చిన అనుమతులను ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలని కోరింది. షోకాజ్‌కు వెంటనే బదులివ్వాలని, లేని పక్షంలో సీరమ్ వద్ద వివరణ ఇవ్వడానికేమీ లేదని భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీసీఏ డాక్టర్ వి.జి.సొమానీ స్పష్టం చేశారు. ప్లాస్మా.. పని చేయట్లేదు వెల్లడించిన ఐసీఎంఆర్ న్యూఢిల్లీ: కోవిడ్ వైద్యంలో భాగంగాచేసే ప్లాస్మా చికిత్స పెద్దగా ప్రభావం చూపలేదని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్) బుధవారం స్పష్టంచేసింది. మరణాల రేటును తగ్గించడంలో గానీ, కోవిడ్ తీవ్రతను తగ్గించడంలోగానీ ప్లాస్మా ప్రభావం చూపలేకపోయిందంది. ఏప్రిల్ 22 నుంచి జూలై 14 మధ్య 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపెన్ లేబెల్ పారలెల్ ఆర్మ్ ఫేజ్ 2 మల్టీ సెంటర్ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్(ప్లాసిడ్ ట్రయల్) పేరుతో జరిపిన పరీక్షల్లో ఈ వివరాలు వెల్లడైనట్లు తెలిపింది. ఈ పరిశోధనలో భాగంగా వైద్య నిపుణులు.. 464 మంది కోవిడ్ రోగులను ఎన్నుకొని, వారిలో 235 మందికి ప్లాస్మాను ఎక్కించారు. మరో 229 మందికి సాధారణ చికిత్స చేశారు. పరీక్షలో పాల్గొన్న వారికి 24 గంటలకు ఒక్కొక్కటి చొప్పున రెండు డోసుల ప్లాస్మా ఇచ్చినట్లు తెలిపింది. ప్రతి డోసులో 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఇచ్చినట్లు పేర్కొంది. పేషెంట్ల ఎన్రోల్, డేటా కలెక్షన్ వంటి విషయాల్లో ఐసీఎంఆర్ కలుగజేసుకోలేదని, అయితే పరీక్షల డిజైన్, స్టడీ కోఆర్డినేషన్, డేటా అనలైజేషన్ వంటి విషయాలను పరిశీలించిందని చెప్పింది. ప్లాస్మా ఇచ్చిన నాటి నుంచి 28 రోజుల వరకు వారిని పరీక్షించగా, రెండు గ్రూపుల మధ్య పెద్ద తేడాలేమీ లేవని గుర్తించినట్లు చెప్పారు. మరణాల రేటు కూడా పెద్దగా మారలేదని తెలిపారు. కోవిడ్ 19 కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ ఈ పరిశోధనను పరిశీలించి ఆమోదించిందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ప్లాస్మా థెరపీ ప్రయోగించడం సురక్షితమే అయినప్పటికీ ప్లాస్మాను నిల్వ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దేశంలో కేవలం కొన్ని సంస్థల్లోనే ఈ తరహా సదుపాయం ఉంది. దీనిపై చైనా, నెదర్లాండ్ లు కూడా పరిశోధనలు చేశాయి. అయితే రెండు దేశాలూ ఆయా పరిశోధనలను మధ్యలోనే ఆపేశాయి. ప్లాస్మా థెరపీని కోవిడ్ ఓ మోస్తరు స్థాయిలో ఉన్న వారిపైనే, పరిశోధనా పూర్వకంగా ప్రయోగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో తెలిపింది. 43లక్షలు దాటిన కేసులు న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి ఆగడం లేదు. ఇటీవల రోజుకు 90 వేలకు పైగా కేసులు బయట పడగా, తాజాగా గత 24 గంటల్లో 89,706 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,70,128 కు చేరుకుంది. గత 24 గంటల్లో 74,894 మంది కోలుకోగా.. 1,115 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 73,890 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33,98,844 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,97,394 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.53 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.77 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.69 శాతానికి పడిపోయిందని తెలిపింది. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1,678 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి మిలియన్ మందికి 37,539 పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. -
ఆఫర్ టికెట్ల అమ్మకాలు ఆపండి
న్యూఢిల్లీ: ప్రభుత్వం విధించిన చార్జీల పరిమితులు అమల్లో ఉన్నందున సోమవారం నుంచి ప్రారంభించిన ఐదు రోజుల రాయితీ టికెట్ల అమ్మకాలను నిలిపివేయాలని ఏవియేషన్ రెగ్యులేటర్ (డీజీసీఏ) చౌక విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను కోరింది. రెండు నెలల క్రితం దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి చార్జీల పరిమితులు అమలులో ఉన్నాయని డీజీసీఏ సీనియర్ అధికారులు తెలిపారు. చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఐదు రోజుల ‘1+1 ఆఫర్ సేల్‘ ను ప్రారంభించినట్లు సోమవారం ఉదయం ప్రకటించడంతో డీజీసీఏ వెంటనే స్పందించింది. దేశీ ప్రయాణాలకు పన్నులను మినహాయించి రూ .899 నుండి వన్–వే బేస్ చార్జీలను అందిస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది.అమ్మకం సమయంలో టికెట్ బుక్ చేసుకునే కస్టమర్లకు గరిష్టంగా రూ .2,000 విలువ కలిగిన కాంప్లిమెంటరీ వోచర్ లభిస్తుందని, భవిష్యత్తులో బుకింగ్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. కరోనావైరస్ వ్యాప్తితో దాదాపు రెండు నెలల సస్పెన్షన్ తర్వాత దేశీయ ప్రయాణికుల సేవలు మే 25 న తిరిగి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 24 వరకు విమాన చార్జీల పరిమితి ఉంటుందని మే 21 న పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రకటించిన తరువాత, మరిన్ని వివరాలతో డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. పతి విమానయాన సంస్థ తన టిక్కెట్లలో కనీసం 40 శాతం కనిష్ట గరిష్ట ధరల మద్య స్థాయి కన్నా తక్కువకు విక్రయించాలని రెగ్యులేటర్ స్పష్టం చేసింది. -
15 బంగారం షాప్‌లకు డీజీసీఐ నోటీసులు
-
15 బంగారం షాప్‌లకు డీజీసీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ బంగారం అమ్మకాలపై డైరెక్టర్ జనరల్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటె లిజెన్స్ (డీజీసీఐ) నిఘా పెట్టింది. హైదరాబాద్‌లోని 15 దుకాణాలకు శుక్రవారం సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం డీజీసీఐ నోటీసులిచ్చింది. గత నాలుగు రోజులుగా విక్రయించిన బంగారం, వజ్రాభరణాల లావాదేవీల పూర్తి వివరాలను 24 గంటల్లోగా తెలపాలని బంగారం వ్యాపారులను ఆదేశించింది. నగరంలో అక్రమ బంగారం వ్యాపారం, నల్లకుబేరుల ఆటకట్టించేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీసీఐ తెలిపింది. మరోవైపు చెన్నై నగరంలో ఏకకాలంలో ఎనిమిది చోట్ల శుక్రవారం ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. చెన్నైలోని ప్రముఖ వ్యాపార కూడలి ప్యారిస్, ఎన్ఎస్సీ బోస్ రోడ్లలోని బంగారు దుకాణాలు, మనీ ఎక్చేంజ్ సెంటర్లు, అనుమానిత హవాల కేంద్రాలపై దాడులు చేశారు. అయితే ఈ దాడుల్లో ఎంత సొమ్ము పట్టుబడిందన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.