కోవిడ్‌ ఔషధం వచ్చేసింది! | Government panel recommends EUA for COVID-19 vaccines | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ ఔషధం వచ్చేసింది!

Published Wed, Dec 29 2021 6:12 AM | Last Updated on Wed, Dec 29 2021 8:49 AM

Government panel recommends EUA for COVID-19 vaccines - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న కోవిడ్‌–19 ఔషధం మోల్నుపిరావిర్‌ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ యాంటీ వైరల్‌ డ్రగ్‌కు అయిదు రోజుల్లో వైరస్‌ను కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉండడంతో సహజంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు మోల్నుపిరావిర్‌ ఔషధం తయారీ, విక్రయానికి పలు కంపెనీలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) మంగళవారం అనుమతి ఇచ్చింది. ఔషధ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుని వాటి ఫలితాల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించిన ఈ సంస్థలు.. మోల్నుపిరావిర్‌ జనరిక్‌ వర్షన్‌ ఉత్పత్తికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. మోల్నుపిరావిర్‌ను మెర్క్, రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరపీటిక్స్‌ అభివృద్ధి చేశాయి.  

అయిదు రోజులు వాడితే చాలు..
ప్రస్తుతానికి మోల్నుపిరావిర్‌ 200 ఎంజీ క్యాప్సూల్స్‌ ఉత్పత్తికి డీసీజీఐ ఆమోదం తెలిపింది. మోల్నుపిరావిర్‌ను 18 ఏళ్లు పైబడి, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్న కోవిడ్‌–19 రోగులకు వైద్యులు సిఫార్సు చేస్తారు. ప్రత్యేకత ఏమంటే అయిదు రోజులు ఈ మందు వాడితే చాలు. ఉదయం 800 ఎంజీ, రాత్రి 800 ఎంజీ తీసుకోవాల్సి ఉంటుంది. తాము చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో దాదాపు 80 శాతం మంది రోగులు అయిదు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారని.. ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిందని ఒక కంపెనీ డైరెక్టర్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘10 రోజుల్లో 93 శాతం, 14 రోజుల్లో 99 శాతం మందికి నెగెటివ్‌ వచ్చింది. ఈ మందు వైరస్‌ ప్రభావాన్ని పూర్తిగా నియంత్రించడం విశేషం. కోవిడ్‌–19కు ఈ ఒక్క డ్రగ్‌ సరిపోతుంది. ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిన అవసరం దాదాపుగా ఉండదు’ అని ఆయన వివరించారు.  

ఇదీ కంపెనీల జాబితా..
డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి మోల్నుపిరావిర్‌ ఔషధం తయారీకి సంబంధించి భారత్‌లో ప్రస్తుతానికి 13 కంపెనీలు ఆమోదం పొందాయి. ఇందులో ఆరు సంస్థలు హైదరాబాద్‌కు చెందినవే కావడం విశేషం. వీటిలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో, నాట్కో ఫార్మా, ఎంఎస్‌ఎన్‌ ల్యాబొరేటరీస్, ఆప్టిమస్‌ ఫార్మా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన సన్‌ ఫార్మా, సిప్లా, వయాట్రిస్‌ (గతంలో మైలాన్‌) టోరెంట్‌ ఫార్మా, స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్, ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్, బీడీఆర్‌ ఫార్మాస్యూటికల్స్‌కు సైతం డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. మోల్నుపిరావిర్‌ ఔషధ పరీక్షలను రెడ్డీస్, అరబిందో, హెటిరో, నాట్కో, ఎంఎస్‌ఎన్, ఆప్టిమస్, స్ట్రైడ్స్, బీడీఆర్‌ జరిపాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ నేతృత్వంలో సన్, సిప్లా, వయాట్రిస్, టోరెంట్, ఎమ్‌క్యూర్‌ కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి ఔషధ పరీక్షలను నిర్వహించాయి.

అన్ని బ్రాండ్లు వారంలోనే..
మోల్నుపిరావిర్‌ క్యాప్సూల్స్‌ను నేడో రేపో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. అన్ని బ్రాండ్లు ఈ వారమే విపణిలోకి రానున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఔషధాన్ని సరఫరా చేయగలిగే సామర్థ్యం తమకు ఉందని అరబిందో వైస్‌ చైర్మన్‌ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఈ క్యాప్సూల్స్‌ తయారు చేయనున్నట్టు హెటిరో గ్రూప్‌ చైర్మన్‌ బి.పార్థ సారథి రెడ్డి తెలిపారు. కాగా, బ్రాండ్‌నుబట్టి ఒక్కో క్యాప్సూల్‌ గరిష్ట ధర రూ.30 నుంచి రూ.75 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల సమాచారం. 400 ఎంజీ క్యాప్సూల్స్‌ తయారీకై అనుమతించాల్సిందిగా ఇప్పటికే కంపెనీలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ వారంలోనే గ్రీన్‌ సిగ్నల్‌ రావొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. 400 ఎంజీ అందుబాటులోకి వస్తే రోగులకు పెద్ద ఉపశమనం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement