Antiviral
-
నిఫాపై నిరంతర నిఘా
తిరువనంతపురం: ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ రాష్ట్రంలో వెలుగుచూడటంతో కేరళ రాష్ట్రం అప్రమత్తమైంది. నిఫా వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగించేందుకు కావాల్సిన యాంటీవైరల్ ఔషధాలు కేరళకు చేరుకున్నాయని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖతో రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ‘ నిఫాకు ఉన్న ఏకైక యాంటీవైరల్ చికిత్స.. మోనోక్లోనల్ యాంటీబాడీలే. అందుకే వాటిని హుటాహుటిన రాష్ట్రానికి తెప్పించాం. కోజికోఢ్ జిల్లాలో నిఫా వెలుగుచూడడంపై ఆందోళన వద్దు. జిల్లాలోని ప్రజానీకం సరైన నివారణ చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి గట్టెక్కగలం’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మహిళా మంత్రి వీణ జార్జ్ వ్యాఖ్యానించారు. కోజికోడ్ జిల్లాలో వ్యాపించిన వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇన్షెక్షన్ రేటు తక్కువ ఉన్నాసరే మరణాల రేటు ఎక్కువ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. పుణె నుంచి వైరాలజీ నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపిన విషయం తెల్సిందే. 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు నిఫా సోకడంతో ఇప్పటిదాకా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో అన్ని విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. కోజికోఢ్ జిల్లా మాత్రమేకాదు ఇలాంటి ఇన్ఫెక్షన్ల బారిన రాష్ట్రం మొత్తం పడే వాతావరణం అక్కడ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి ప్రకటించాయని కేరళ సర్కార్ పేర్కొంది. బుధవారం సాయంత్రం నాటికి కోజికోడ్‌లో 11 వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. -
Facial Paralysis: ఒకవైపు కనురెప్ప మూసుకుపోతోందా? అయితే...
కొందరిలో ముఖంలోని ఒకవైపు కండరాలపై మెదడు నియంత్రణ తగ్గిపోతుంది దాంతో ఒకవైపు కనురెప్ప వాలిపోవడం, ఒకవైపు భాగమంతా అకస్మాత్తుగా జారిపోయినట్లుగా అయిపోతుంది. దీన్నే వాడుక భాషలో ‘ఫేషియల్ పెరాలసిస్’, వైద్య పరిభాషలో ‘బెల్స్పాల్సీ’ అంటారు. ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. చాలావరకు నిరపాయకరమైనది. మెదడు కింద ఉన్న వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అలా పుర్రె భాగం నుంచి బయటకు వచ్చిన నాడులను ‘క్రేనియల్ నర్వ్స్’ అంటారు. ఇందులో ముఖం కండరాలను నియంత్రించే ‘ఏడవ నరం’ దెబ్బతినడం వల్ల ముఖంలోని ఒకవైపు భాగమంతా చచ్చుబడినట్లు అయిపోతుంది. ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు హెర్పిస్ సింప్లెక్స్ లాంటి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాక, దాని వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్ ఫేషియల్‌ను దెబ్బతీసాయి. ఫలితంగా నరానికి వాపు వస్తుంది. దాంతో అది నియంత్రించే భాగాలు చచ్చుబడిపోతాయి. ఫలితంగా మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తున్నప్పుడు ఒకవైపు నుంచి ఆపని సరిగా చేయలేకపోవడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సలో భాగంగా అవసరాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు యాంటీ వైరల్ మందులు, స్టెరాయిడ్స్ వాడతారు. మెరుగుదల అన్నది జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. తొంభైశాతం పైగా బాధితులు ఆరునెలల్లో పూర్తిగా కోలుకుంటారు. చదవండి: Bappi Lahiri Death: బప్పీలహరి మృతికి కారణం ఇదే.. సాధారణంలా అనిపించినా ఎంతో ప్రాణాంతకం కూడా! -
ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కరోనా దేశంలో శరవేగంగా దూసుకొస్తోంది. కరోనా థర్డ్ వేవ్ దేశంలోకి వచ్చేసినట్టేనని వైద్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే లక్ష 17 వేల కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన పుట్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా లక్షణాలు స్వల్పంగా ఉన్నప్నటికీ వైరస్‌ను లైట్ తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల కొత్తగా ఆమోదించినన యాంటీ-కోవిడ్-19 డ్రగ్ మోల్నుపిరావిర్‌లో "ప్రధానమైన సేఫ్టీ సమస్యలు" ఉన్నాయని భారతదేశపు ఉన్నత ఆరోగ్య పరిశోధన సంస్థ తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలే అంటూ లైట్ తీసుకుంటున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారనంగా ఆసుపత్రుల్లో బాధితులు అవస్తలు పడుతున్నారనీ, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. మోల్నుపిరవిర్ ద్వారా టెరాటోజెనిసిటీ, మ్యూటా జెనిసిటీ, కండరాలు , ఎముకలు దెబ్బతినడం వంటి ప్రధాన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ మందు తీసుకున్న స్త్రీ పురుషులు, మూడు నెలల పాటు గర్భ నిరోధం పాటించక తప్పదని, లేదంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు రావచ్చన్నారు.అందుకే దీన్ని నేషనల్ టాస్క్ ఫోర్స్ ట్రీట్మెంట్ జాబితాలో చేర్చలేదన్నారు. అలాగే డబ్ల్యుహెచ్వో గానీ, యూకేలో గానీ దీన్ని చికిత్సలో భాగంగా చేయలేదన్నారు. దీనిమై మరింత చర్చిస్తున్నామని భార్గవ వెల్లడించారు. #bharatbiotech #covaxin #covid #covid19vacccine #immunization #vaccination #childrensafety #clinicaltrials #vaccinatedandhappy pic.twitter.com/Pri0u0UlFe — BharatBiotech (@BharatBiotech) January 5, 2022 ఆరోగ్యమంత్రిత్వ శాఖ సవరించిన టీకా మార్గదర్శకాల ప్రకారం, 15-18 సంవత్సరాల వయస్సు వారికి "కోవాక్సిన్" మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కోవిడ్ టీకా తీసుకున్న వచ్చే జ్వరం, నొప్పుల నివారణకు టీనేజర్లకు పారాసెటమాల్ మాత్రలు అసలు వాడవద్దని కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ అధికారికంగా ప్రకటించింది. కోవాక్సిన్‌తో టీకా తీసుకున్నాక పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదని చెప్పింది. తేలికపాటి ఇబ్బందులు వచ్చినా, రెండు మూడు రోజులకు అవే తగ్గిపోతాయని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 30,000 మందిలో దాదాపు 10-20 శాతం మందికి మాత్రమే సమస్యలొచ్చాయని, చాలా వరకు తేలికపాటివి,1-2రోజులలో తగ్గిపోతాయని మందులు అవసరం లేదని తెలిపింది. వైద్యుడి సలహా మేరకే మందులువాడాలని కూడా పేర్కొంది.అలాగే వ్యాక్సిన్ తరువాత జ్వరం, చలి, తలనొప్పి లేదా అలసటను లాంటి సమస్యలు రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి సూచిక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్-19 తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న వారికి అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ తయారు చేసిన యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్. ఇది త్వరలోనే అన్ని మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రానుందని డ్రగ్ కంట్రోలర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు ఫార్మా కంపెనీలకు అనుమతినిచ్చిందంటూ వార్త లొచ్చాయి. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉంది. కరోనా సెకండ్‌వేవ్ కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. వైరస్ వ్యాప్తిని అడ్డు కునేందుకు భౌతిక దూరం, ఫేస్ మాస్క్, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం అనే మూడు మంత్రాలను కచ్చితంగా పాటించాలి. అలాగే రద్దీగా ఉండే ప్రదేశాలను, క్లోజ్డ్. వెంటిలేషన్ తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచింది. అలాగే దగ్గినపుడు, తుమ్మినపుడు చేతులను అడ్డుపెట్టుకోవడం, ఇంట్లో అందరం ఉన్నపుడు, కిటికీలు తెరిచి ఉంచుకోవడం, మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. -
ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
-
కోవిడ్ ఔషధం వచ్చేసింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న కోవిడ్–19 ఔషధం మోల్నుపిరావిర్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ యాంటీ వైరల్ డ్రగ్‌కు అయిదు రోజుల్లో వైరస్‌ను కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉండడంతో సహజంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు మోల్నుపిరావిర్ ఔషధం తయారీ, విక్రయానికి పలు కంపెనీలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంగళవారం అనుమతి ఇచ్చింది. ఔషధ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుని వాటి ఫలితాల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించిన ఈ సంస్థలు.. మోల్నుపిరావిర్ జనరిక్ వర్షన్ ఉత్పత్తికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. మోల్నుపిరావిర్‌ను మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరపీటిక్స్ అభివృద్ధి చేశాయి. అయిదు రోజులు వాడితే చాలు.. ప్రస్తుతానికి మోల్నుపిరావిర్ 200 ఎంజీ క్యాప్సూల్స్ ఉత్పత్తికి డీసీజీఐ ఆమోదం తెలిపింది. మోల్నుపిరావిర్‌ను 18 ఏళ్లు పైబడి, వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్న కోవిడ్–19 రోగులకు వైద్యులు సిఫార్సు చేస్తారు. ప్రత్యేకత ఏమంటే అయిదు రోజులు ఈ మందు వాడితే చాలు. ఉదయం 800 ఎంజీ, రాత్రి 800 ఎంజీ తీసుకోవాల్సి ఉంటుంది. తాము చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 80 శాతం మంది రోగులు అయిదు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారని.. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ఒక కంపెనీ డైరెక్టర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘10 రోజుల్లో 93 శాతం, 14 రోజుల్లో 99 శాతం మందికి నెగెటివ్ వచ్చింది. ఈ మందు వైరస్ ప్రభావాన్ని పూర్తిగా నియంత్రించడం విశేషం. కోవిడ్–19కు ఈ ఒక్క డ్రగ్ సరిపోతుంది. ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సిన అవసరం దాదాపుగా ఉండదు’ అని ఆయన వివరించారు. ఇదీ కంపెనీల జాబితా.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మోల్నుపిరావిర్ ఔషధం తయారీకి సంబంధించి భారత్‌లో ప్రస్తుతానికి 13 కంపెనీలు ఆమోదం పొందాయి. ఇందులో ఆరు సంస్థలు హైదరాబాద్‌కు చెందినవే కావడం విశేషం. వీటిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో, నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఆప్టిమస్ ఫార్మా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన సన్ ఫార్మా, సిప్లా, వయాట్రిస్ (గతంలో మైలాన్) టోరెంట్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్, బీడీఆర్ ఫార్మాస్యూటికల్స్‌కు సైతం డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. మోల్నుపిరావిర్ ఔషధ పరీక్షలను రెడ్డీస్, అరబిందో, హెటిరో, నాట్కో, ఎంఎస్ఎన్, ఆప్టిమస్, స్ట్రైడ్స్, బీడీఆర్ జరిపాయి. డాక్టర్ రెడ్డీస్ నేతృత్వంలో సన్, సిప్లా, వయాట్రిస్, టోరెంట్, ఎమ్క్యూర్ కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి ఔషధ పరీక్షలను నిర్వహించాయి. అన్ని బ్రాండ్లు వారంలోనే.. మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్‌ను నేడో రేపో మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. అన్ని బ్రాండ్లు ఈ వారమే విపణిలోకి రానున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఔషధాన్ని సరఫరా చేయగలిగే సామర్థ్యం తమకు ఉందని అరబిందో వైస్ చైర్మన్ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్లాంట్లలో ఈ క్యాప్సూల్స్ తయారు చేయనున్నట్టు హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థ సారథి రెడ్డి తెలిపారు. కాగా, బ్రాండ్‌నుబట్టి ఒక్కో క్యాప్సూల్ గరిష్ట ధర రూ.30 నుంచి రూ.75 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం. 400 ఎంజీ క్యాప్సూల్స్ తయారీకై అనుమతించాల్సిందిగా ఇప్పటికే కంపెనీలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ వారంలోనే గ్రీన్ సిగ్నల్ రావొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. 400 ఎంజీ అందుబాటులోకి వస్తే రోగులకు పెద్ద ఉపశమనం ఉంటుంది. -
మోల్నుపిరావిర్ వైరస్‌ను ఏమార్చి, హతమారుస్తుంది.. ఇంతకూ ఆ పేరెలా వచ్చింది?
కల్లోల కరోనా సోకకుండా టీకాలు చాలావరకు అడ్డుకుంటాయి. కానీ కరోనా సోకిన వారికి నిర్ధిష్టమైన వైద్యం పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులో ఉన్న వివిధ రకాల ఔషధాల కాంబినేషన్లను, యాంటీ వైరల్ మందులను వాడి కరోనా రోగులను కాపాడే యత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కరోనా సోకిన వారి చికిత్స కోసం ఫైజర్, మెర్క్ సంస్థలు మాత్రలు తయారుచేశాయి. మెర్క్ తయారీ మోల్నుపిరావిర్ మాత్ర (‘EIDD 2801’’) కు భారత్‌లో తాజాగా అనుమతులు లభించాయి. కరోనాకు కళ్లెం వేయడంలో ఇది ఉపయోగపడుతుందని, కరోనా వల్ల ఆస్పత్రి పాలవకుండా చాలావరకు కాపాడుతుందని కంపెనీ చెబుతోంది. భారత్‌లో దీన్ని సిప్లా తదితర సంస్థలతో కూడిన కన్సార్టియం వేర్వేరు పేర్లతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో కొత్త మాత్ర కథా కమామీషు చూద్దాం.. ఎవరికి మంచిది? ఎవరికి వద్దు? కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి దీన్ని వాడే వీలు లేదు. కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఇవి బాగా ముదిరి మరింత అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్న(హైరిస్కు) వ్యక్తులకు మాత్రమే డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఉదాహరణకు వృద్దులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే వీటిని సిఫార్సు చేస్తారు. ఇక 18 ఏళ్లలోపు పిల్లలకు ఈ మందు వాడకూడదు. ఇది వారిలో ఎముకల వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే గర్భిణులకు కూడా దీన్ని సిఫార్సు చేయరు. వీరికి ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిపాలై చికిత్స పొందేవారికి దీని వాడకం కూడదు. ఎప్పుడు ఆరంభించాలి? కరోనా పాజిటివ్ వచ్చాక లక్షణాలు బయటపడుతున్న ఐదురోజుల్లోపు దీని వాడకం ఆరంభించాలి. దగ్గు, తలనొప్పి, జ్వరం, వాసన లేకపోవడం, నొప్పుల్లాంటి సంకేతాలు కరోనా తొలిరోజుల్లో ఉంటాయి. ఈ దశలోనే వీటని డాక్టర్ సిఫార్సుతో వాడాల్సి ఉంటుంది. ఎంత డోసేజ్? ఈ మాత్రలు 200 ఎంజీ రూపంలో లభిస్తాయి. ప్రతి 12 గంటలకు ఒకసారి నాలుగు మాత్రల చొప్పున ఐదు రోజుల పాటు తీసుకోవడంతో కోర్సు పూర్తవుతుంది. అంటే మొత్తం కోర్సులో 40 క్యాప్సుల్స్ (ఐదు రోజులు– రోజుకు 8 మాత్రలు) వాడాల్సి ఉంటుంది. వరుసగా ఐదు రోజులకు మించి దీన్ని వాడకూడదని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ సహా దాదాపు అన్ని కోవిడ్ వేరియంట్లపై ఇది ప్రభావం చూపగలదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నాయి? కరోనా లక్షణాలు బయటపడ్డవారు (ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోనివారు) ఆస్పత్రి పాలయ్యే రిస్కును, చనిపోయే ప్రమాదాన్ని ఈ మందు వాడకంతో దాదాపు 30– 50 శాతం తగ్గించవచ్చని క్లినికల్ డేటా ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. దీన్ని కేవలం కరోనా సోకిన తర్వాత మాత్రమే వాడాలని, టీకాలకు బదులు దీన్ని తీసుకుంటే సరిపోతుందని భావించవద్దని నిపుణుల హెచ్చరిక. ప్రతికూలతలు ఈ మాత్ర వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతినివ్వడంపై పలువురు నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేమీ మ్యాజిక్ పిల్ కాదని, దీనివల్ల జరిగే మేలు పరిమితమని ప్రొఫెసర్ విలియం షాఫ్నర్ హెచ్చరించారు. దీని వాడకం వల్ల కొన్నిసార్లు డయేరియా, వికారం, వాంతులు, తలతిరగడం వంటి ప్రతికూలతలు కనిపించవచ్చు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లో దీన్ని 18 ఏళ్లు లోపువారికి, గర్భిణులకు, ఆస్పత్రిపాలైనవారికి వాడకూడదు. ఈ ఔషధానికి వైరస్ కణాల్లో ఉత్పరివర్తనాలను ప్రేరేపించే శక్తి ఉంది. ఈ శక్తి మానవ కణాలపై కూడా చూపే ప్రమాదం ఉందని, దీనివల్ల మానవ కణాల్లో అనవసర మార్పులు వచ్చి క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదం ఉందన్న వాదనలు ఉన్నాయి. కానీ దీన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాల్లేవు. ఏ దేశాల్లో అనుమతించారు? ఇప్పటివరకు ఈ ఔషధానికి యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, భారత్‌లో అనుమతి లభించింది. ధ్వంస రచన... ► ఉత్పరివర్తనాల్లో ఈ మందు కలగజేసే మార్పులతో వైరస్‌లోని మొత్తం మ్యుటేషన్ ప్రక్రియ తప్పులతడకగా మారడాన్ని ‘‘ఎర్రర్ కెటాస్ట్రోఫ్’’ లేదా ‘‘లీథల్ మ్యుటాజెనిసిస్’’ అంటా రు. ఈ విధ్వంసం కారణంగా అతిధేయి శరీరంలో వైరల్ లోడు క్రమంగా తగ్గిపోతుంది. ► సాధారణంగా రెమిడెసివిర్ లాంటి యాంటీ వైరల్ మందులు సదరు వైరస్‌లో పత్రికృతి (రిప్లికేషన్) ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా దాని వ్యాప్తిని నివారిస్తాయి. టీకాలు అతిధేయి శరీరంలో యాంటీబాడీ రెస్పాన్స్‌ను పెంచడం ద్వారా వైరస్‌ను అడ్డుకుంటాయి. వీటితో పోలిస్తే మోల్నుపిరావిర్ పనిచేసే తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ► ఇది వైరస్ రిప్లికేషన్ ప్రక్రియలో అవసరపడే ఎంజైములను తప్పుదోవ పట్టిస్తుంది. దీంతో వైరస్ కణాల్లో తప్పుడు ఉత్పరివర్తనాలు ఆరంభమవుతాయి. వీటివల్ల రోగి శరీరంలో వైరస్ సంఖ్య పెరగడం ఆగిపోతుంది, ప్రతికృతి చెందిన వైరస్లు బతికినా అవి బలహీనంగా ఉండి వెంటనే నశించిపోవడం జరుగుతుంది. ► సింపుల్‌గా చెప్పాలంటే ఒక యంత్రంలో కీలక భాగాన్ని మారిస్తే దాని పనితీరు పూర్తిగా ధ్వం సమైనట్లే ఈ ఔషధం వైరస్‌పై పనిచేస్తుంది. ► శాస్త్రీయ భాషలో చెప్పుకుంటే ఈ ఔషధం వైరస్‌లోని ఆర్‌డీఆర్‌ఏ (ఆర్ఎన్ఏ డైరెక్టెడ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్) ఎంజైమ్‌ను ప్రేరేపించి వైరల్ ఆర్ఎన్ఏలో పలు తప్పుడు మ్యుటేషన్లను కలిగిస్తుంది. ► ఆర్ఎన్ఏ నిర్మాణంలో అడినైన్, గ్వానైన్, యురాసిల్ (యురిడిన్), సైటోసిన్ అవసరమవుతాయి. వీటిని ఆర్ఎన్ఏ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. ► మోల్న్యుపిరావిర్కు ఈ బిల్డింగ్ బ్లాక్స్‌లోని సైటిడిన్ (ఎన్‌హెచ్‌సీ– టీపీ) లేదా యురిడిన్ లాగా కనిపించే శక్తి ఉంది. దీంతో ఆర్‌డీఆర్‌ఏ ఎంజైమ్ దీన్ని వైరస్ ఆర్ఎన్ఏలో నిజమైన సైటిడిన్ లేదా యురిడిన్ బదులు ప్రవేశపెడుతుంది. ► వైరస్ రిప్లికేషన్‌ను ప్రూఫ్ రీడింగ్ చేసే ఎక్సో న్యూక్లియేజ్ ఎంజైమ్‌లు కూడా ఈ తప్పును గ్రహించలేవు. దీంతో నిజమైన బిల్డింగ్ బ్లాక్స్ ఉన్న ఆర్ఎన్ఏ బదులు మోల్నుపిరావిర్ ఉన్న ఆర్ఎన్ఏ ఉత్పత్తి అవుతుంది. ► ఇలా మారిన ఆర్ఎన్ఏ పలు తప్పుడు ఉత్పరివర్తనాలకు కారణమై పైన చెప్పుకున్న ఎర్రర్ కెటాస్ట్రోఫ్కు దారి తీస్తుంది. ఆ పేరే ఎందుకంటే.. అవెంజర్స్ సినిమాలు చూసినవారికి అందులో థోర్ పాత్ర, ఆ హీరో చేతిలోని శక్తులున్న ఆయుధం.. సుత్తి గుర్తుండే ఉంటాయి. ఈ సుత్తికి మొల్నిర్ అని పేరు. అలాగే యాంటీ వైరల్ మందులకు చివర ‘అవిర్’ అంత్య ప్రత్యయం (సఫిక్స్) పెడతారు. కోవిడ్ వేరియంట్లపై థోర్ ఆయుధం లాగా విరుచుకుపడుతుందన్న ఉద్దేశంతో కొత్త మాత్రకు మోల్నుపిరావిర్ అని పేరు పెట్టినట్లు మెర్క్ కంపెనీ ఆర్ అండ్ డి అధిపతి డీన్ లీ చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
గుడ్‌న్యూస్: కోవిడ్ సోకితే ఇక ఇంట్లోనే మాత్రలు వేసుకుంటే చాలు!
లండన్/వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలమందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారికి చికిత్స అందుబాటులోకి వచ్చేసింది. కరోనా వైరస్‌కి చికిత్స లేదు నివారణే మార్గం అనుకుంటున్న సమయంలో ఒక గేమ్‌ఛేంజర్‌గా యాంటీవైరల్ మాత్రలు మార్కెట్లోకి రాబోతున్నాయి. బ్రిటన్, అమెరికాలు ఈ దిశగా ముందడుగు వేశాయి. ప్రపంచంలోనే కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ మాత్రకి ఆమోద ముద్ర వేసిన తొలి దేశంగా యూకే నిలిస్తే, అమెరికాలో ఫైజర్ కంపెనీ తయారు చేసిన మాత్ర 90శాతం మరణాలను నివారిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్ లాగెవ్రియో (మోల్నూపిరావిర్)ని కోవిడ్ చికిత్సకి అనుమతినిస్తూ బ్రిటన్‌కు చెందిన ది మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) గురువారం అనుమతులు మంజూరు చేసింది. రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిటిక్స్, మెర్క్ షార్ప్ అండ్ ధోమె (ఎంఎస్డీ) కంపెనీలు సంయుక్తంగా ఈ మాత్రను రూపొందించాయి. ‘కరోనా సోకితే ఇక ఆస్పత్రుల్లో చేరాల్సిన పని లేదు. ఇంట్లోనే ట్యాబ్లెట్ మింగొచ్చు. ప్రపంచంలోనే అలాంటి మాత్రకు అనుమతులిచ్చిన మొదటి దేశం మాదే’అని యూకే ఆరోగ్య శాఖ మంత్రి సజీద్ జావిద్ ప్రకటించారు. కరోనా వైరస్ లోడు స్వల్పంగా, ఓ మోస్తరుగా సోకిన వారిలో తీవ్రతరం కాకుండా ఈ మాత్ర నిరోధిస్తుంది. ఊబకాయం, 60 ఏళ్ల పైబడిన వయసు, షుగర్, గుండెకు సంబంధించిన సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్న వారిలో అయినా ఈ టాబ్లెట్ బాగా పని చేస్తుందని ఇప్పటికే ప్రయోగాల్లో తేలింది. కరోనా సోకిన వెంటనే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే అత్యంత శక్తిమంతంగా పని చేస్తున్నట్టుగా ఎంహెచ్ఆర్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జునె రెయిన్ వెల్లడించారు. త్వరలో మార్కెట్లోకి ఫైజర్ మాత్ర కోవిడ్–19 మాత్రకు బ్రిటన్ ఆమోద ముద్ర వేసిన ఒక్క రోజులోనే అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్ తమ కంపెనీ తయారు చేసిన యాంటీవైరల్ మాత్ర కూడా పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్టుగా వెల్లడించింది. కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ 90% మరణాలను ఆ మాత్ర నిరోధిస్తుందని తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో చేర్పించి ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోనే అత్యంత సులభంగా వాడే మాత్రను తయారు చేసినట్టుగా ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ మైకేల్ డోల్‌స్టెన్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ మాత్ర అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) పరిశీలనలో ఉందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోకుండా ఊబకాయం, మధుమేహం, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న 775 మందిపై ఫైజర్ ఈ టాబ్లెట్ ఇచ్చి చూస్తే 89% మందికి ఆస్పత్రి అవసరం రాలేదని వెల్లడించింది. ఒక్క శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం వచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ టాబ్లెట్ ఇచ్చిన వారెవరూ మరణించలేదని ఆ కంపెనీ తెలిపింది. 90% సామర్థ్యంతో, 100 శాతం మరణాలను అరికట్టేలా ఈ మాత్ర పని చేస్తున్నట్టుగా మైకేల్ వివరించారు. ఈ కొత్త మాత్ర అనుమతులు ఇవ్వడానికి ఎఫ్‌డీఏ సన్నాహాలు చేస్తున్నప్పటికీ కరోనాపై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని అభిప్రాయపడుతోంది. మాత్రలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్య రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కోవిడ్ పోరులో కొత్త ఆశలు
వసుధైక కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనాను సమూలంగా నియంత్రించే కొత్త అస్త్రం తయారవుతోంది. టీకాల కన్నా మెరుగ్గా ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో, ప్రాణ రక్షణ చేయడంలో కొత్త ఔషధం కీలకపాత్ర పోషించనుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా సోకిన వారికి వాడుతున్న ఔషధాల కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఈ ఔషధం కరోనాను కట్టడి చేయనుంది. అలాంటి ఒక ఆశలు కలిగించే నూతనౌషధం తుదిదశ పరీక్షల్లో ఉంది. అనుమతులన్నీ లభించి బయటకు వస్తే కరోనాను ఒక్క మాత్రతో అంతం చేసే అవకాశం లభించనుంది. కల్లోల కరోనాను శాంతింపజేయడానికి ఆధునిక వైద్యం అత్యంత సత్వరంగా స్పందించి టీకాలను రూపొందించింది. అయితే అవి కరోనా వ్యాప్తిని ఆశించినంత మేర అడ్డుకోవడం లేదని గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కరోనాను సంపూర్ణంగా సమర్ధవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని రూపొందించేందుకు శాస్త్రవేత్తలు శతధా ప్రయతి్నస్తూనే ఉన్నారు. వీరి ప్రయ త్నాలు ఫలించే సూచనలు తాజాగా కనిపిస్తున్నాయి. ఒకే ఒక ఓరల్ డ్రగ్(నోటి ద్వారా తీసుకునే ఔషధం)తో కరోనాకు చెక్ పెట్టే యత్నాల్లో ముందడుగు పడింది. మోల్న్యుపిరవిర్‌గా పిలిచే ఈ యాంటీ వైరల్ ఔషధం రూపకల్పన తుదిదశకు చేరింది. దీన్ని మానవులపై పెద్దస్థాయిలో పరీక్షించేందుకు, ఫేజ్3 ట్రయల్స్ కోసం అనుమతులు లభించాయి. ఈ మందుతో కరోనాను అడ్డుకోవడం, కరోనా సోకినవారికి నయం చేయడం సాధ్య మని నిపుణులు నమ్ముతున్నారు. పైగా దీన్ని తీసుకోవడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. మాత్రల రూపంలో వాడితే సరిపోతుంది. ఇలా పనిచేస్తుంది కరోనా వైరస్ ప్రమాదకరంగా మారడానికి ముఖ్యకారణం దానిలో ఉండే రిప్లికేషన్ పవర్(ఉత్పాదక సామర్థ్యం). తాజా ఔషధం నేరుగా ఈ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. వైరస్ జెనిటిక్ పదార్థంలోని బిల్డింగ్‌బ్లాక్స్‌ను పోలిఉండే ఈ మందు వైరస్ ఉత్పాదన జరగకుండా ఆపుతుంది. ఇందుకోసం వైరస్ రిప్లికేట్ చెందినప్పుడు ఏర్పడే నూతన ఆర్ఎన్ఏలో సహజంగా ఉండాల్సిన బిల్డింగ్‌బ్లాక్స్ స్థానంలో ఇది చేరుతుంది. అలా ఏర్పడిన కొత్త వైరస్‌లో ఈ మందు అతిగా మ్యుటేషన్ల(ఉత్పరివర్తనాలు)ను ప్రేరేపిస్తుంది. వైరస్ మ్యుటేషన్ చెందినప్పుడల్లా అందులోని ఆర్‌ఎన్‌లో ఉండే ఈ ఔషధం కూడా భారీగా పెరుగుతుంది. ఇది వైరస్ జెనిటిక్ పదార్ధంలో ఎర్రర్‌కు దారితీస్తుంది, మరోపక్క అతి మ్యు టేషన్లు వైరస్ రిప్లికేషన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో వైరస్ ఉత్పత్తి కావడం ఆగి చివరకు నశిస్తుంది. ఇంతవరకు దీన్ని చాలా స్వల్ప స్థాయి(800 ఎంజీ) లో మనుషుల్లో (202మంది కరోనా లక్షణాలున్న పేషెంట్లు)ప్రయోగించారు. మూడు రోజుల అనంతరం పేషెంట్లలో వైరస్ మొత్తం చాలా స్వ ల్పానికి చేరినట్లు, ఐదు రోజుల తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలను మరింతగా విశ్లేíÙంచాల్సిఉంది. తర్వాతేంటి? నిజానికి ఈ ఔషధాన్ని కొన్నిచోట్ల కరోనా చికిత్సలో వాడుతూనే ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున పరిశోధనలు జరగలేదు. త్వరలో 1850మంది పేషెంట్లపై ఈ ఔషధ ట్రయల్స్ ప్రస్తుతం జరుపుతున్నారు. దీని ఫలితాలను బట్టి ఫేజ్ 3 ట్రయల్స్ జరపనున్నారు. ఇందుకోసం 17 దేశాల నుంచి పేషెంట్ల నమోదు కార్యక్రమం ఆరంభమైంది. మోల్న్యుపిరవిర్‌ను ఇచి్చన పేషెంట్ల నుంచి ఇతరులకు కరోనా సోకకుండా నివారించవచ్చా? అనే అంశాన్ని ఈ ట్రయిల్స్‌లో పరిశోధిస్తారు. విజయవంతమైన ఫలితాలు వస్తే కరోనాపై పోరు కొత్త మలుపు తీసుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఔషధ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కూడా చౌకేనని అందువల్ల టీకాల కన్నా సులభంగా అందరికీ అందించవచ్చని చెప్పారు. నిజానికి ఈ ఔషధాన్ని బ్రాడ్‌స్పెక్ట్రమ్ యాంటీవైరల్‌గా(అనేక జాతుల వైరస్‌లపై పనిచేసేది) 2013లో రూపొందించారు. అనంతరం ఎన్సెఫలైటిస్, ఇన్‌ఫ్లూయెంజా, ఆర్ఎస్వీ తదితర వైరస్‌లను సమర్ధవంతంగా నియంత్రిస్తుందని కనుగొన్నారు. ఇప్పటికే ఇన్‌ఫ్లూయెంజాపై దీన్ని వాడేందుకు యూఎస్ ఎఫ్‌డీఏకు అనుమతులకు దరఖాస్తు చేశారు. కరోనా వచి్చన అనంతరం దీనిపై పోరాటానికి కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. త్వరలో సదరు అనుమతులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇదే నిజమై ప్రయోగాలు విజయవంతమైతే కరోనా కథ ముగిసినట్లే! – నేషనల్ డెస్క్, సాక్షి -
కోవిడ్ చికిత్సలో మరో ముందడుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్ విషయంలో భారత్‌లో మరో ముందడుగు పడింది. మూడవ దశ ఔషధ పరీక్షలకై అయిదు కంపెనీలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ జాబితాలో తాము కూడా ఉన్నట్టు హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా బుధవారం ప్రకటించింది. స్వల్ప, మోస్తరు కోవిడ్–19 లక్షణాలున్న 2,500 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు ఆప్టిమస్ సీఎండీ డి.శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మోల్నుపిరావిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ), ఫార్ములేషన్స్‌ను తాము సొంతంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఔషధ పరీక్షల్లో భాగంగా రోగులకు గరిష్టంగా అయిదు రోజుల చికిత్స ఉంటుందని, 29 రోజులపాటు అధ్యయనం కొనసాగుతుందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఔషధ సామర్థ్యం తెలుస్తుందని వివరించారు. అయిదు రోజుల్లోనే..: యూఎస్‌లో జరిగిన ఔషధ పరీక్షల్లో మోల్నుపిరావిర్ తీసుకున్న స్వల్ప, మోస్తరు కోవిడ్–19 లక్షణాలున్న రోగులు అయిదు రోజుల్లోనే కోలుకున్నారని ఆప్టిమస్ ఫార్మా డైరెక్టర్ పి.ప్రశాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘చికిత్సలో భాగంగా 800 ఎంజీ మోతాదులో ఉదయం, రాత్రి 5 రోజులపాటు మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో రోగి శరీరం నుంచి వైరస్ పూర్తిగా తొలగిపోతుంది. ఔషధాన్ని తీసుకున్న రోజు నుంచే రోగి ద్వారా వేరొకరికి వైరస్ వ్యాపించకపోవడం దీని ప్రత్యేకత. మోల్నుపిరావిర్ ఏపీఐ, ఫార్ములేషన్స్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్‌కు భారీగా ఖర్చు ఉంటుంది. ఇతర ఔషధాల మాదిరిగానే మార్కెట్లోకి వచ్చిన నెల తర్వాత ధర తగ్గుతుంది. జూలై ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో)కు ఔషధ పరీక్షల ఫలితాల నివేదిక సమర్పించే అవకాశం ఉంది’ అని చెప్పారు. ఆప్టిమస్ ఫార్మా మోల్నుపిరావిర్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్‌కై సీడీఎస్‌సీవోకు ఏప్రిల్ 26న దరఖాస్తు చేసుకుంది. -
ఈ దుస్తులతో అరగంటలో కరోనా ఖతం!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేసినా కానీ అనేక కొత్త ఉత్పత్తులకు అవకాశాలను సృష్టిస్తోంది. ఒకవైపు కరోనా కట్టడికి వ్యాక్సిన్ల తయారీలో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు తలమునకలై ఉన్నాయి. మరోవైపు కరోనాను అడ్డుకునే విభిన్నమైన విప్లవాత్మక ఉత్పత్తులు, సాధనాల రూపకల్పనలో దిగ్గజ సంస్థలనుంచి స్టార్టప్ కంపెనీల దాకా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతెందుకు కరోనా కారణంగా మొత్తం బిజినెస్ మోడల్ మారిపోయిందని చెప్పవచ్చు. తాజాగా వైరస్ ను మట్టుబెట్టే యాంటీ వైరల్ దుస్తులు, వస్త్ర బ్రాండ్లు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ దుస్తులు అరగంటలోనే కరోనా వైరస్ ను చంపేస్తుందని చెప్పడం విశేషంగా మారింది. ముంబైకి చెందిన ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ డోనియర్ ఇండస్ట్రీస్ ఈ రకమైన బ్రాండ్లను పరిచయం చేసింది. స్విట్జర్లాండ్ టెక్స్టైల్ సంస్థ హీక్యూ సహకారంతో, నియో టెక్ బ్రాండ్ క్రింద యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ విడుదల చేసింది. కేవలం 30 నిమిషాల్లో కోవిడ్-19 వైరస్ ను చంపేస్తుందని చెబుతోంది. హీక్యూ వైరోబ్లాక్ ఎన్‌పిజె03 టెక్నాలజీ ద్వారా కోవిడ్-19కు చెక్ పెట్టవచ్చని డోనియర్ ఇండస్ట్రీస్ సీఎండీ రాజేంద్ర అగర్వాల్ చెప్పారు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని కూడా అందుకున్నా మన్నారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని పీటర్ డోహెర్టీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునిటీ (డోహెర్టీ ఇన్స్టిట్యూట్) ఈ పరీక్షలు నిర్వహించిందనీ, ఇవి వైరస్ ను 99.99 శాతం నిరోధించినట్టుగా నిర్ధారించినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే కరోనా లాంటి ప్రాణాంతాక వైరస్ నివారణ దుస్తులపై పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్పత్తులను అమెరికాలోని మెడికల్ టెక్స్టైల్ కంపెనీకి ఎగుమతి చేస్తున్నామనీ, భారతదేశంలోని అనేక రాష్ట్ర పోలీసు విభాగాలకు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. కరోనా నివారణలో ఈ దుస్తుల సమర్థత నిర్ధారణ అయిన తరువాత భారత మార్కెట్ కోసం తమ ఉత్పత్తిని మరింత పెంచామని అగర్వాల్ చెప్పారు. (భార్యకు కరోనా పాజిటివ్.. మనోవేదనతో భర్త మృతి) ప్రాథమికంగా యాంటీ-వైరల్ దుస్తుల కేటగిరీలో పాలిస్టర్-విస్కోస్ సూటింగ్, వూలుతో చేసిన సూటింగ్స్ అందుబాటులో ఉంచినట్టు అగర్వాల్ తెలిపారు. అంతేకాదు వివిధ పరిశ్రమలు యూనిఫాంలుగా జాకెట్లు, సూట్లు, ప్యాంటు, చొక్కాలు రూపంలో దీన్ని ఉపయోగించవచ్చన్నారు. ఇది కేవలం పై పూత కాదుకాదు కనుక ఎక్కువసేపు ఉంటుందని అగర్వాల్ దీమా వ్యక్తం చేశారు. నిర్దిష్ట రసాయనాన్ని ఫాబ్రిక్ నిర్మాణంలోనే పొందుపరచినందువల్ల తరచూ ఉపయోగించినా, ఉతికినా కూడా దీని ప్రభావం పోదని స్పష్టం చేశారు. అయితే ఈ యాంటీ-వైరల్ బట్టల ధరలు 20 శాతం ఎక్కువ. జూన్ నెలలో 1,000 మంది చిల్లర వ్యాపారుల నుంచి ఆర్డర్లు వచ్చాయని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా దేశవ్యాప్తంగా ఆయా రిటైల్ కౌంటర్లలో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రెండు ఉత్పత్తుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకపు ఆదాయంలో కనీసం 15 శాతం పుంజుకుని రూ .200 కోట్లు ఆర్జించాలని ఆశిస్తున్నాయి. కాగా టెక్స్టైల్ టు రిటైల్ సంస్థ అరవింద్ తైవాన్‌కు చెందిన జింటెక్స్ కార్పొరేషన్, హీక్యూ మెటీరియల్స్ సహకారంతో ఇంటెల్లిఫ్యాబ్రిక్స్ బ్రాండ్ కింద యాంటీ వైరల్ దుస్తులను విడుదలు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ధర ఎక్కువైనా ఈ తరహా దుస్తులు ప్రాధాన్యతను సంతరించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. -
కోవిడ్-19 : స్ట్రయిడ్స్ ఫార్మా మందు
సాక్షి, ముంబై: కోవిడ్ -19 చికిత్సలో కీలకమైన ఫావిపిరవిర్ ఔషధ ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభించామని దేశీ ఫార్మా కంపెనీ స్ట్రయిడ్స్ ఫార్మా సైన్స్ బుధవారం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 చికిత్సలో సానుకూల ఫలితాలనిచ్చిన ఈ యాంటి వైరల్ ఫావిపిరవిర్ టాబెట్లను వాణిజ్య ప్రాతిపదికన తయారీ, ఎగుమతులను ప్రారంభించినట్లు బుధవారం వెల్లడించింది. తద్వారా కరోనా వైరస్ సోకినవారి చికిత్సకు ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను ఎగుమతి చేస్తున్న తొలి దేశీ కంపెనీగా నిలవనున్నట్లు ప్రకటించింది. సౌకర్యవంత డోసేజ్ కింద 400 ఎంజీ. 200 ఎంజీబలంతో ఫావిపిరవిర్ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. అంతేకాదు ఈ ఔషధాన్ని దేశీయంగా వినియోగించేందుకు వీలుగా ఔషధ అధికారిక, నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేయనున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో 20 శాతం ఎగిసింది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ .3890 కోట్లకు పెరిగింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) తొలి దశలో భాగంగా గల్ఫ్ సహకార దేశాల (జీసీసీ)కు సరఫరా చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఆయా దేశాలలో కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్సలో వీటిని వినియోగించనున్నట్లు వివరించింది. ఈ ఔషధ తయారీకి అవసరమయ్యే ఏపీఐల సరఫరాకు వీలుగా ఓ దేశీ ఫార్మా కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కోసం వారి చికిత్సా కార్యక్రమం కింద రోగులకు చికిత్స చేయడానికి ఈ ఉత్పత్తిని ప్రస్తుతం జిసిసి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా జపనీస్ దిగ్గజం టొయమా కెమికల్ తయారీ ఎవిగాన్ ఔషధానికి జనరిక్ వెర్షన్. ఈ ఔషధాన్ని గతంలో జపాన్‌లో తలెత్తిన ఇన్ఫ్లుయెంజా నివారణకు రూపొందించారట. అయితే ఇటీవల ఈ ఔషధ వినియోగం ద్వారా కోవిడ్-19 రోగులలో ఊపిరితిత్తుల పరిస్థితి మెరుగుపడటాన్ని గుర్తించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. (ఈ ఏడాది ఐటీ కొలువులు లేనట్టే!) -
గర్భవతికి చికెన్‌పాక్స్ సోకితే..?
సాధారణంగా గర్భవతులకు చికెన్‌పాక్స్ సోకినా దాని కారణంగా గర్భస్రావం కావడం అన్నది చాలా అరుదు. అయితే చికెన్‌పాక్స్ ప్రభావం కడపులోని బిడ్డపై ఎలా ఉంటుందన్నది గర్భవతికి ఏ నెల అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. అయితే చికెన్‌పాక్స్ సోకిన గర్భవతులు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. గర్భవతులకు చికెన్‌పాక్స్ సోకినట్లయితే వారి ప్రెగ్నెన్సీలోని 12వ వారం, 16వ వారం, 20వ వారం, 24వ వారాల్లో నిపుణుల చేత పరీక్ష చేయించుకుని, బిడ్డపై ఎలాంటి ప్రభావాలు లేవని నిర్ధారణ చేసుకుని నిశ్చింతగా ఉండవచ్చు. ఏడు నెలల గర్భంతో(అంటే 28 వారాల ప్రెగ్నెన్సీ) ఉన్నవారికి చికెన్‌పాక్స్ సోకితే దాని ప్రభావం కడుపులోని బిడ్డపైనా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ. చికెన్‌పాక్స్ కారణంగా బిడ్డలో కళ్లు, కాళ్లు, భుజాలు (ఆర్మ్స్), మెదడు, బ్లాడర్, ెపేగులు (బవెల్) వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అయితే ఇలాంటి అవకాశం చాలా అరుదు. దాదాపు నూరు కేసుల్లో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ గర్భవతికి 7వ నెల నుంచి 9వ నెల మధ్యకాలంలో చికెన్‌పాక్స్ సోకితే అప్పుడు పుట్టబోయే బిడ్డలో కూడా చికెన్‌పాక్స్ వైరస్ ఉంటుంది. కానీ ఆ వైరస్ తాలూకు ఎలాంటి ప్రభావాలూ బిడ్డపై పడవు. కాకపోతే బిడ్డ కాస్త బరువు తక్కువగా పుట్టవచ్చు. ఇక 36 వారాల ప్రెగ్నెన్సీలో (అంటే... 9 నెలలు నిండాక, ప్రసవానికి దగ్గరగా) గర్భవతికి చికెన్‌పాక్స్ సోకితే... పుట్టిన తర్వాత బిడ్డకూ సోకిందేమోనంటూ దాదాపు 28 రోజుల వరకు పరిశీలించాలి. ఒకవేళ సోకి ఉంటే బిడ్డకు కూడా చికెన్‌పాక్స్ చికిత్స అందించాలి. అయితే బిడ్డకు తల్లిపాలు పట్టడానికి ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు ఉండవు. నిర్భయంగా పట్టవచ్చు. ఇక చికెన్‌పాక్స్ వచ్చిన తల్లికి జ్వరం, నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆ సమయంలో తల్లికి యాంటీవైరల్ మందులను ఇస్తారు. అయితే చికెన్‌పాక్స్ అన్నది ఒకరి నుంచి మరొకరికి తేలిగ్గా సంక్రమించే వ్యాధి కాబట్టి ఒకవేళ ఇది సోకినప్పుడు మనమే స్వచ్ఛందంగా మిగతా గర్భవతులు, బిడ్డ తల్లుల వంటి వారి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం అన్నది మనందరి సామాజిక బాధ్యత. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్