ఈ దుస్తులతో అరగంటలో కరోనా ఖతం! | This fabric can kill coronavirus in 30 minutes | Sakshi
Sakshi News home page

ఈ దుస్తులతో అరగంటలో కరోనా ఖతం!

Published Fri, Jun 12 2020 9:56 AM | Last Updated on Fri, Jun 12 2020 3:37 PM

This fabric can kill coronavirus in 30 minutes - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి  ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేసినా కానీ అనేక కొత్త ఉత్పత్తులకు అవకాశాలను సృష్టిస్తోంది. ఒకవైపు కరోనా కట్టడికి వ్యాక్సిన్ల తయారీలో అనేక దిగ్గజ  ఫార్మా కంపెనీలు తలమునకలై ఉన్నాయి. మరోవైపు కరోనాను అడ్డుకునే విభిన్నమైన విప్లవాత్మక ఉత్పత్తులు, సాధనాల రూపకల్పనలో దిగ్గజ సంస్థలనుంచి స్టార్టప్ కంపెనీల దాకా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతెందుకు కరోనా కారణంగా మొత్తం బిజినెస్ మోడల్  మారిపోయిందని చెప్పవచ్చు.

తాజాగా వైరస్ ను మట్టుబెట్టే యాంటీ వైరల్ దుస్తులు, వస్త్ర బ్రాండ్లు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ దుస్తులు అరగంటలోనే కరోనా వైరస్ ను చంపేస్తుందని చెప్పడం విశేషంగా మారింది. ముంబైకి చెందిన ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ డోనియర్ ఇండస్ట్రీస్ ఈ రకమైన బ్రాండ్లను  పరిచయం చేసింది. స్విట్జర్లాండ్‌ టెక్స్‌టైల్‌ సంస్థ హీక్యూ సహకారంతో, నియో టెక్ బ్రాండ్ క్రింద యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ విడుదల చేసింది.  కేవలం 30 నిమిషాల్లో కోవిడ్-19 వైరస్ ను చంపేస్తుందని చెబుతోంది.  

హీక్యూ వైరోబ్లాక్ ఎన్‌పిజె03 టెక్నాలజీ ద్వారా కోవిడ్-19కు చెక్ పెట్టవచ్చని డోనియర్ ఇండస్ట్రీస్ సీఎండీ రాజేంద్ర అగర్వాల్ చెప్పారు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని కూడా అందుకున్నా మన్నారు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని పీటర్ డోహెర్టీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునిటీ (డోహెర్టీ ఇన్స్టిట్యూట్) ఈ పరీక్షలు నిర్వహించిందనీ, ఇవి వైరస్ ను 99.99 శాతం నిరోధించినట్టుగా నిర్ధారించినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే కరోనా లాంటి ప్రాణాంతాక వైరస్ నివారణ దుస్తులపై పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్పత్తులను అమెరికాలోని మెడికల్ టెక్స్‌టైల్ కంపెనీకి ఎగుమతి చేస్తున్నామనీ, భారతదేశంలోని అనేక రాష్ట్ర పోలీసు విభాగాలకు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు. కరోనా నివారణలో ఈ దుస్తుల సమర్థత నిర్ధారణ అయిన తరువాత భారత మార్కెట్ కోసం తమ ఉత్పత్తిని మరింత పెంచామని అగర్వాల్ చెప్పారు. (భార్యకు కరోనా పాజిటివ్‌.. మనోవేదనతో భర్త మృతి)

ప్రాథమికంగా యాంటీ-వైరల్ దుస్తుల కేటగిరీలో పాలిస్టర్-విస్కోస్ సూటింగ్, వూలుతో చేసిన సూటింగ్స్ అందుబాటులో ఉంచినట్టు అగర్వాల్ తెలిపారు. అంతేకాదు వివిధ పరిశ్రమలు యూనిఫాంలుగా జాకెట్లు, సూట్లు, ప్యాంటు, చొక్కాలు రూపంలో దీన్ని ఉపయోగించవచ్చన్నారు.  ఇది కేవలం పై పూత కాదుకాదు కనుక ఎక్కువసేపు ఉంటుందని  అగర్వాల్ దీమా వ్యక్తం చేశారు. నిర్దిష్ట రసాయనాన్ని ఫాబ్రిక్ నిర్మాణంలోనే పొందుపరచినందువల్ల తరచూ ఉపయోగించినా, ఉతికినా కూడా దీని ప్రభావం పోదని స్పష్టం చేశారు. అయితే ఈ యాంటీ-వైరల్ బట్టల ధరలు 20 శాతం ఎక్కువ.  జూన్ నెలలో 1,000 మంది చిల్లర వ్యాపారుల నుంచి ఆర్డర్లు వచ్చాయని అగర్వాల్ పేర్కొన్నారు.  ఈ నెలాఖరులోగా దేశవ్యాప్తంగా ఆయా రిటైల్ కౌంటర్లలో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రెండు ఉత్పత్తుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకపు ఆదాయంలో కనీసం 15 శాతం పుంజుకుని రూ .200 కోట్లు  ఆర్జించాలని ఆశిస్తున్నాయి.

కాగా టెక్స్‌టైల్ టు రిటైల్ సంస్థ అరవింద్ తైవాన్‌కు చెందిన జింటెక్స్‌ కార్పొరేషన్‌, హీక్యూ మెటీరియల్స్‌ సహకారంతో ఇంటెల్లిఫ్యాబ్రిక్స్‌ బ్రాండ్‌  కింద యాంటీ వైరల్ దుస్తులను విడుదలు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.  కరోనా మహమ్మారి భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో  ధర ఎక్కువైనా  ఈ తరహా దుస్తులు ప్రాధాన్యతను సంతరించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement