
పెట్టుబడులకు టెమాసెక్, ఐహెచ్‌సీ, అల్ఫా వేవ్ గ్లోబల్ రెడీ
న్యూఢిల్లీ: ఫాస్ట్‌ఫుడ్ కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ తాజాగా యూఏఈ సంస్థ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్‌సీ)తోపాటు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అల్ఫా వేవ్ గ్లోబల్‌కు మైనారిటీ వాటా విక్రయించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం రెండు సంస్థలు సంయుక్తంగా హల్దీరామ్‌లో 6 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.
స్నాక్, ఫుడ్ బ్రాండ్ హల్దీరామ్స్‌లో ఇప్పటికే టెమాసెక్ ఈక్విటీ పెట్టుబడులకు సిద్ధపడగా.. మరో రెండు సంస్థలు ఐహెచ్‌సీ, అల్ఫా వేవ్ గ్లోబల్ సైతం వాటా కొనుగోలు చేయనున్నట్లు హల్దీరామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డీల్ వివరాలు వెల్లడించలేదు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టెమాసెక్‌కు ఇప్పటికే మైనారిటీ వాటా విక్రయించేందుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హల్దీ రామ్ తాజా ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 85,000 కోట్లు) విలువలో హల్దీరామ్ లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అంచనా.