
10 శాతం కొనుగోలుకి ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ హల్దీరామ్స్ స్నాక్స్ ఫుడ్‌లో సింగపూర్ సావరిన్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం టెమాసెక్ 10 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. కంపెనీ విలువను 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 85,000 కోట్లు)గా మదింపు చేసి వాటాను సొంతం చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఈ వారం మొదట్లో ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. అంటే 10 శాతం వాటాకు సుమారు బిలియన్ డాలర్లు(రూ. 8,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు అంచనా.
దేశీయంగా ప్యాక్‌డ్ స్నాక్, స్వీట్స్ తయారీలో దిగ్గజంగా నిలుస్తున్న హల్దీరామ్స్ రెస్టారెంట్లను సైతం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో రూ. 12,500 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీలో మరింత వాటా విక్రయం ద్వారా ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబం మరో ఇన్వెస్టర్‌కు సైతం చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలలుగా పీఈ దిగ్గజాలు బ్లాక్‌స్టోన్, అల్ఫావేవ్ గ్లోబల్, బెయిన్ క్యాపిటల్ కన్సార్షియం తదితరాలతో వాటా విక్రయానికి హల్దీరామ్స్ చర్చలు నిర్వహించింది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే అవకాశముంది. తొలుత మెజారిటీ వాటాను విక్రయించాలని భావించిన ప్రమోటర్లు తదుపరి మైనారిటీ వాటా విక్రయానికే ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment