కార్మికులకు పెరుగుతున్న డిమాండ్
2027 నాటికి 5 లక్షల కొత్త కొలువులు
ఇండీడ్ ప్లాట్‌ఫామ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ జోరుతో బ్లూకాలర్ ఉద్యోగాలకు (కార్మికులకు) పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. 2027 నాటికి వివిధ రంగాల్లో 24 లక్షల మంది కార్మికులకు డిమాండ్ ఉంటుందని హైరింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ వెల్లడించింది. ఇందులో ఒక్క క్విక్ కామర్స్ రంగమే 5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది.
డిసెంబర్ త్రైమాసికంలో క్విక్‌కామర్స్ కంపెనీలు 40,000 మందిని నియమించుకున్నట్టు ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ సతీష్ కుమార్ తెలిపారు. ‘‘ఈ రంగం విస్తరించే కొద్దీ, నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులకు డిమాండ్ వృద్ధి చెందుతూనే ఉంటుంది. వేగవంతమైన, టెక్నాలజీ ఆధారిత ప్రపంచానికి అనుగుణంగా నడుచుకునే నైపుణ్యాల కోసం యాజమాన్యాల అన్వేషణ పెరిగింది’’ అని వివరించారు.
బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే విద్యతో పెద్దగా అవసరం లేకుండా శారీరక శ్రమతో, నైపుణ్యాలతో పనులు నిర్వహించే వారు. డెలివరీ డ్రైవర్లు, రిటైల్ సిబ్బంది ఈ విభాగం కిందకే వస్తా రు. ఇండీడ్ నిర్వహించిన సర్వేలో వీరికి బేసిక్ వేతనం రూ. 22,600గా ఉన్నట్టు తెలిసింది. పండుగల సీజన్‌లో క్విక్‌కామర్స్ కంపెనీలు డెలివరీ డ్రైవర్లు, వేర్‌హౌస్ అసోసియేట్ లు, మార్కెటింగ్, ప్రమోషనల్, ప్యాకేజింగ్ సిబ్బంది, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లను నియమించుకోనున్నట్టు ఇండీడ్ నివేదిక తెలిపింది. దీంతో ఇలాంటి డిమాండ్ సీజన్లలో కార్మికులకు బోనస్‌లు, నగదేతర ప్రయోజనాలు అధికంగా అధించనున్నట్టు వివరించింది.
వీరికి డిమాండ్.. : నేవిగేషన్ అండ్ డ్రైవింగ్, డిజిటల్ లిటరసీ, డేటా అనలిటిక్స్, మేనేజ్‌మెంట్, టెక్ సపోర్ట్ నైపుణ్యాలున్న వారికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు ఇండీస్ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్, డిజిటల్ టూల్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలిపింది. కస్టమర్లు నిమిషాల వ్యవధిలో గ్రోసరీ, నిత్యావసరాలను కోరుకుంటున్నారని.. దీంతో వేగవంతమైన డెలివరీలకు డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంది.
క్విక్‌కామర్స్ సంస్థల మధ్య పోటీ పెరిగిపోవడంతో అవి మరింత వేగంగా డెలివరీకి, మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇది ఈ రంగంలో ఉపాధి అవకాశాల విస్తరణకు దారితీస్తోందని వివరించింది. చెన్నై, పుణె, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో బ్లూకాలర్ ఉద్యోగ నియామకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. టైర్–2 నగరాలైన చండీగఢ్, అహ్మదాబాద్‌లోనూ ఇదే ధోరణి నెలకొన్నట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment