లండన్/వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలమందికిపైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారికి చికిత్స అందుబాటులోకి వచ్చేసింది. కరోనా వైరస్‌కి చికిత్స లేదు నివారణే మార్గం అనుకుంటున్న సమయంలో ఒక గేమ్‌ఛేంజర్‌గా యాంటీవైరల్ మాత్రలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. బ్రిటన్, అమెరికాలు ఈ దిశగా ముందడుగు వేశాయి.
ప్రపంచంలోనే కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ మాత్రకి ఆమోద ముద్ర వేసిన తొలి దేశంగా యూకే నిలిస్తే, అమెరికాలో ఫైజర్ కంపెనీ తయారు చేసిన మాత్ర 90శాతం మరణాలను నివారిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్ లాగెవ్రియో (మోల్నూపిరావిర్)ని కోవిడ్ చికిత్సకి అనుమతినిస్తూ బ్రిటన్‌కు చెందిన ది మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) గురువారం అనుమతులు మంజూరు చేసింది. రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిటిక్స్, మెర్క్ షార్ప్ అండ్ ధోమె (ఎంఎస్‌డీ) కంపెనీలు సంయుక్తంగా ఈ మాత్రను రూపొందించాయి.
‘కరోనా సోకితే ఇక ఆస్పత్రుల్లో చేరాల్సిన పని లేదు. ఇంట్లోనే ట్యాబ్లెట్ మింగొచ్చు. ప్రపంచంలోనే అలాంటి మాత్రకు అనుమతులిచ్చిన మొదటి దేశం మాదే’అని యూకే ఆరోగ్య శాఖ మంత్రి సజీద్ జావిద్ ప్రకటించారు. కరోనా వైరస్ లోడు స్వల్పంగా, ఓ మోస్తరుగా సోకిన వారిలో తీవ్రతరం కాకుండా ఈ మాత్ర నిరోధిస్తుంది. ఊబకాయం, 60 ఏళ్ల పైబడిన వయసు, షుగర్, గుండెకు సంబంధించిన సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్న వారిలో అయినా ఈ టాబ్లెట్ బాగా పని చేస్తుందని ఇప్పటికే ప్రయోగాల్లో తేలింది. కరోనా సోకిన వెంటనే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే అత్యంత శక్తిమంతంగా పని చేస్తున్నట్టుగా ఎంహెచ్‌ఆర్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జునె రెయిన్ వెల్లడించారు.
త్వరలో మార్కెట్లోకి ఫైజర్ మాత్ర
కోవిడ్–19 మాత్రకు బ్రిటన్ ఆమోద ముద్ర వేసిన ఒక్క రోజులోనే అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్ తమ కంపెనీ తయారు చేసిన యాంటీవైరల్ మాత్ర కూడా పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్టుగా వెల్లడించింది. కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ 90% మరణాలను ఆ మాత్ర నిరోధిస్తుందని తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో చేర్పించి ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోనే అత్యంత సులభంగా వాడే మాత్రను తయారు చేసినట్టుగా ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ మైకేల్ డోల్‌స్టెన్ శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ మాత్ర అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) పరిశీలనలో ఉందని చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకోకుండా ఊబకాయం, మధుమేహం, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న 775 మందిపై ఫైజర్ ఈ టాబ్లెట్ ఇచ్చి చూస్తే 89% మందికి ఆస్పత్రి అవసరం రాలేదని వెల్లడించింది. ఒక్క శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం వచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ టాబ్లెట్ ఇచ్చిన వారెవరూ మరణించలేదని ఆ కంపెనీ తెలిపింది. 90% సామర్థ్యంతో, 100 శాతం మరణాలను అరికట్టేలా ఈ మాత్ర పని చేస్తున్నట్టుగా మైకేల్ వివరించారు. ఈ కొత్త మాత్ర అనుమతులు ఇవ్వడానికి ఎఫ్‌డీఏ సన్నాహాలు చేస్తున్నప్పటికీ కరోనాపై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని అభిప్రాయపడుతోంది. మాత్రలు అందుబాటులోకి వస్తే ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్య రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment