న్యూఢిల్లీ: భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి లభించింది. బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ గురువారం షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఈ రెండు టీకాలు ఇకపై సాధారణ మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. కొన్ని షరతులకు లోబడి ఈ రెండు వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
టీకా డేటా ప్రతి ఆరు నెలలకోసారి అందించాల్సి ఉంటుందని భారత ఔషధ నియంత్రణ మండలి తెలిపింది. ప్రతికూల ప్రభావాలపైనా పర్యవేక్షణ కొనసాగనుంది. అయితే వీటిని కేవలం ఆస్పత్రులు, క్లినిక్‌ల నుంచి మాత్రమే పొందగలుగుతారు. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది. అయితే బహిరంగ మార్కెట్‌లో విక్రాయానికి అనుమతించాలంటూ కోవాగ్జిన్ అభివృద్ది చేసిన భారత్ బయోటెక్, కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ సంస్థలు.. గత ఏడాది అక్టోబర్ 25న డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి.
వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ, షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. బహిరంగ మార్కెట్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల ఒక్క డోసు రూ. 275గా నిర్ణయించినట్టుగా, సర్వీస్ చార్జీ మరో రూ. 150 ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర ఒక డోస్‌కు 1,200 రూపాయలుగా ఉండగా.. కోవిషీల్డ్ ధర రూ. 780గా ఉంది. వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి వస్తోంది.
రోజురోజుకూ తగ్గుతున్న కరోనా కేసులు...
వరుసగా మూడో రోజూ దేశంలో కోవిడ్ కేసులు తగ్గాయి. ఒక రోజులో 2,86,384 మంది కరోనావైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల వ్యవధిలో 20,546 కేసులు తగ్గాయని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 22,02,472 క్రియాశీల కేసులున్నాయి. నేటితో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,03,71,500కి పెరిగింది.
వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. 573 మరణాలతో మరణాల సంఖ్య 4,91,700కి చేరుకుంది. అయితే మరణాల సంఖ్యలోనూ తగ్గుదల నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 573 కొత్త మరణాలలో కేరళ నుండి 140 మరియు మహారాష్ట్ర నుండి 79 మంది ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజు 22 లక్షల మంది టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ డోసుల పంపిణీ 163 కోట్లను దాటింది.
Comments
Please login to add a commentAdd a comment