
హైదరాబాద్: బహుళ ప్రయోజనకారి అయిన ఏజీ–365ఎస్ వ్యవసాయ డ్రోన్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి టైప్ సర్టిఫికేషన్ లభించినట్లు మారుత్ డ్రోన్స్ తెలిపింది. చిన్న, మధ్య తరహా బ్యాటరీ ఆధారిత డ్రోన్లకు డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికేషన్ పొందిన తొలి సంస్థ తమదేనని పేర్కొంది. ఈ డ్రోన్‌ను ఇటు పురుగు మందుల పిచికారీ కోసం వ్యవసాయ రంగంతో పాటు అటు రిమోట్ పైలట్ ట్రెయినింగ్ (ఆర్‌పీటీవో)లో కూడా ఉపయోగించవచ్చని తెలిపింది.
దీనితో డ్రోన్ ఎంట్రప్రెన్యూర్ రూ. 40,000 నుంచి రూ. 90,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. అలాగే అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి నామమాత్రంగా 5–6శాతం వడ్డీ రేటుతో రూ. 10 లక్షల వరకు తనఖా లేని రుణాన్ని పొందేందుకు కూడా ఈ డ్రోన్‌కు అర్హత ఉంటుందని వివరించారు.