Director General of Civil Aviation
-
మారుత్ ఏజీ–365ఎస్ డ్రోన్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్
హైదరాబాద్: బహుళ ప్రయోజనకారి అయిన ఏజీ–365ఎస్ వ్యవసాయ డ్రోన్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి టైప్ సర్టిఫికేషన్ లభించినట్లు మారుత్ డ్రోన్స్ తెలిపింది. చిన్న, మధ్య తరహా బ్యాటరీ ఆధారిత డ్రోన్లకు డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికేషన్ పొందిన తొలి సంస్థ తమదేనని పేర్కొంది. ఈ డ్రోన్‌ను ఇటు పురుగు మందుల పిచికారీ కోసం వ్యవసాయ రంగంతో పాటు అటు రిమోట్ పైలట్ ట్రెయినింగ్ (ఆర్పీటీవో)లో కూడా ఉపయోగించవచ్చని తెలిపింది. దీనితో డ్రోన్ ఎంట్రప్రెన్యూర్ రూ. 40,000 నుంచి రూ. 90,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. అలాగే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి నామమాత్రంగా 5–6శాతం వడ్డీ రేటుతో రూ. 10 లక్షల వరకు తనఖా లేని రుణాన్ని పొందేందుకు కూడా ఈ డ్రోన్‌కు అర్హత ఉంటుందని వివరించారు. -
7 శాతం పెరిగిన విమాన ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి కోరలు చాచినా కానీ, మరోవైపు దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 2021 డిసెంబర్లో 6.7 శాతం పెరిగింది. మొత్తం 1.12 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం చేసినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. మొత్తం మీద 2021లో దేశీయ విమాన సర్వీసుల్లో 8.38 కోట్ల మంది ప్రయాణించారు. 2020లో 6.3 కోట్ల మందితో పోలిస్తే 33 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి విమానయాన రంగంపై ఎక్కువ ప్రభావం చూపించడం తెలిసిందే. ఇండిగో వాటా 55 శాతం ► ఇండిగో విమానాల్లో 2021 డిసెంబర్లో 61.41 లక్షల మంది ప్రయాణించారు. మొత్తం ప్రయాణికుల్లో 54.8 శాతం ఇండిగోను ఎంచుకున్నారు. ► గోఫస్ట్ (గతంలో గోఎయిర్) విమానాల్లో 11.93 లక్షల మంది ప్రయాణించారు. ► స్పైస్‌జెట్ విమాన సర్వీసులను 11.51 లక్షల మంది వినియోగించుకున్నారు. సాధారణంగా రెండో స్థానంలో ఉండే స్పైస్‌జెట్ మూడో స్థానానికి పడిపోయింది. ► ఎయిర్ ఇండియా విమానాల్లో 9.89 లక్షల మంది, విస్తారా విమాన సర్వీసుల్లో 8.61 లక్షల మంది, ఎయిరేషియా విమానాల్లో 7.01 లక్షల మంది, అలియన్స్ ఎయిర్ సర్వీసుల్లో 1.25 లక్షల మంది చొప్పున ప్రయాణించారు. ► ఆక్యుపెన్సీ రేషియో లేదా లోడ్ ఫ్యాక్టర్ (సీట్ల భర్తీ)లో స్పైస్‌జెట్ మెరుగ్గా 86 శాతాన్ని డిసెంబర్లో నమోదు చేసింది. ఆ తర్వాత ఇండిగో 80.2%, విస్తారా 78.1%, గోఫస్ట్ 79%, ఎయిర్ ఇండియా 78.2 శాతం, ఎయిరేషియా 74.2% చొప్పున ఆక్యుపెన్సీ రేషియోను సాధించాయి. ► బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నగరాల నుంచి సకాలంలో సర్వీసులు నడిపించడంలో ఇండిగో 83.5 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ► గోఫస్ట్ 83 శాతం, విస్తారా 81.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ వాయిదా
న్యూఢిల్లీ/ జెనీవా/లాగోస్: అంతర్జాతీయ విమానాలను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో విమానాలను అనుకున్న ప్రకారం నడపకూడదని బుధవారం డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయించింది. విమానాల రాకపోకలకు సంబంధించిన కొత్త తేదీపై నిర్ణయం తీసుకోలేదు. కోవిడ్ నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని కేంద్రం రద్దు చేసింది. ఈనెల 15 నుంచి పునరుద్ధరించాలని గత నెల 26న నిర్ణయించింది. తర్వాత ఒమిక్రాన్ కలకలం రేగడంతో పునరుద్ధరణను వాయిదావేసింది. దేశంలో ఈ కేసు లు లేకున్నా గట్టి చర్యలు తీసుకుంటోంది. నిషేధంతో అరికట్టలేరు: డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించినంత మాత్రాన ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చినప్పట్నుంచి ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకొని పలు దేశాలు విమానాల రాకపోకల్ని నిషేధిస్తూ ఉండడంతో డబ్ల్యూహెచ్ఒ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రాయాసెస్ స్పందించారు. ప్రయాణాలను నిషేధిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్ల పైబడిన వారు ప్రయాణాలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, అమెరికాలో ఒమిక్రాన్ తొలి కేసు కాలిఫోర్నియాలో బుధవారం నమోదైంది. దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఒమిక్రాన్ పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఒమిక్రాన్ వేరియెంట్ అక్టోబర్‌లో బయటపడింది. ఈ వేరియెంట్‌పై ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా హెచ్చరించడానికి ముందే నైజీరియాలో ఇది వెలుగులోకి వచ్చిందని ఆ దేశ ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. ‘గత వారంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నమూనాలో జన్యుక్రమాన్ని పరిశీలిస్తే ఒమిక్రాన్ కేసులు అని తేలింది. ఆ నమూనాలు పరీక్షించినప్పుడే అక్టోబర్‌లో సేకరించిన శాంపిళ్లనూ పరీక్షిస్తే ఒమిక్రాన్ వేరియెంట్‌గా నిర్ధారణ అయింది. అంటే రెండు నెలల కిందటే ఒమిక్రాన్ వేరియెంట్ పుట్టుకొచ్చిందని అర్థమవుతోంది’ అని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. -
మాస్క్ సరిగా లేకుంటే దింపేయండి
ముంబై: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? మాస్కు ధరించారా? అది ముక్కు కిందికో, గడ్డానికో ధరిస్తే సరిపోదు. ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచాలి. అలా లేకపోతే నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేస్తారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) దేశంలో అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. విమానాల్లో కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికుల పట్ల దయ చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండడంతో పౌర విమానయాన సంస్థలకు డీజీసీఏ శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సక్రమంగా ధరించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీసీఏను, విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాల్లో తరచుగా తనిఖీలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు డీజీసీఏ సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో ఏముందంటే... ► మాస్కులు లేనివారిని ఎయిర్‌పోర్టుల్లోకి అనుమతించరాదు. ► విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సరిగ్గా ధరించేలా, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. ► విమానాశ్రయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రయాణం ముగిశాక విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేదాకా మాస్కు ఉండాల్సిందే. ► కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను ఎలాంటి రాజీ లేకుండా కఠినంగా అమలు చేయాలి. ► విమానం బయలుదేరే ముందు పదేపదే సూచించినా మాస్కు సరిగ్గా ధరించకపోతే సదరు ప్రయాణికుడిని వెంటనే దింపేయాలి. ► విమానం ప్రయాణిస్తుండగా మాస్కులు సరిగ్గా లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వారిని నిబంధనలు అతిక్రమించిన ప్రయాణికులుగా పరిగణించాలి. ► కొన్ని అత్యవసర సందర్భాల్లో మినహా మిగిలిన సమయంలో మాస్కును ముక్కు నుంచి కిందకు జార్చరాదు. ► కోవిడ్–19 నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డీజీసీఏ గైడ్‌లైన్స్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి. -
లగేజీ తక్కువుంటే ధర కూడా తక్కువే
న్యూఢిల్లీ :మీకు ఎక్కువగా లగేజీ లేదా ? చిన్న బ్యాగుతోనే విమానంలో ప్రయాణించాలనుకుం టున్నారా ? అయితే మీ టిక్కెట్ ధర మరింత చౌకగా లభించనుంది. కేవలం కేబిన్ లగేజీ మాత్రమే ఉన్నవారికి దేశీయ విమానాల్లోని టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ ఇవ్వడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు కేబిన్ లగేజీ కింద 7 కేజీలు, చెక్ ఇన్ లగేజీ కింద 15 కేజీలు తీసుకువెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ బరువున్న సామాన్లు తీసుకువెళితే అదనపు చార్జీలు ఉంటాయి. అయితే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులు టిక్కెట్ బుకింగ్ సమయంలోనే తాము ఎంత బరువైన లగేజీ తీసుకువెళతారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడే తక్కువ లగేజీ ఉన్నవారికి టిక్కెట్ డిస్కౌంట్ ధరకి వస్తుందని తెలిపింది. ప్రత్యేకంగా ఒక సీటు కావాలన్నా, భోజనం, స్నాక్స్, డ్రింక్స్ అడిగినా, మ్యూజిక్ వినాలనుకున్నా విమానయాన సంస్థలు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఈ సర్వీసులు అవసరం లేని ప్రయాణికుల వాటిని ఎంచుకోకపోతే టిక్కెట్« ధర తగ్గుతుంది. అదే విధంగా లగేజీ లేకపోతే టిక్కెట్ ధర తక్కువకి వచ్చే సదుపాయాన్ని డీజీసీఏ ప్రయాణికులకు కల్పించింది. విమానయాన సంస్థలను నష్టాల నుంచి బయటపడేయడానికి కేంద్రం విమాన చార్జీలను 10–30శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. ప్రయాణికులకు కూడా ఊరట కల్పించడానికి ఈ విధానాన్ని తీసుకువచ్చింది. -
తొలగిన అడ్డంకులు
సాక్షి, ముంబై: కొల్హాపూర్ జిల్లా వాసులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన విమాన ప్రయాణికులకు శుభవార్త. కొల్హాపూర్ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సేవలు త్వరలో పునఃప్రారంభం కానున్నాయి. కేంద్ర విమానయాన శాఖ ఇటీవల నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేసింది. దీంతో విమాన సేవలను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. రెండున్నర సంవత్సరాలుగా ఎన్ఓసీ లేనికారణంగా విమాన సేవలు మొదలుకాలేదు. వచ్చే 15-20 రోజుల్లో కేంద్ర విమానయాన శాఖ పరీక్షలు నిర్వహించనుంది. ఆ తరువాత ప్రయాణికుల రాకపోకలకు అనుమతిస్తారు.ఈ విమానాశ్రయంలో రన్ వే దెబ్బతిన్న కారణంగా 2010, జూన్‌లో విమాన సేవలను నిలిపివేశారు. కొద్దిరోజుల తరువాత రన్‌వేకు మరమ్మతు పనులను పూర్తిచేశారు. ఆ తర్వాత కేవలం మూడు నెలలు మాత్రమే విమానాల రాకపోకలు సాగాయి. ఆ తర్వాత పలు విమానసంస్థలు మూత పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రన్ వే పొడవు తక్కువగా ఉన్న కారణంగా భారీ విమానాలు ల్యాండింగ్ కావడానికి వీల్లేకుండా ఉంది. దీంతో అనేక విమాన కంపెనీలు కొల్హాపూర్‌కు విమాన సేవలను అందించలేదు. హోం శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్, ఎంపీ ధనంజయ్ మహాడిక్ విమాన సేవలు మళ్లీ మొదలయ్యేవిధంగా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు రన్ వే పొడవు, వెడల్పు పెంచడంతో కేంద్ర విమానయాన శాఖ ఎన్ఓసీ జారీ చేసింది. దీంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. పరీక్షలు పూర్తయిన తరువాత ముంబై-కొల్హాపూర్ మధ్య తొలుత విమాన సేవలు ప్రారంభమైతాయి. ఆ తరువాత ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మిగతా ప్రాంతాలకు సేవలు విస్తరిస్తారని మహాడిక్ తెలిపారు.