ముంబై: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? మాస్కు ధరించారా? అది ముక్కు కిందికో, గడ్డానికో ధరిస్తే సరిపోదు. ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచాలి. అలా లేకపోతే నిర్దాక్షిణ్యంగా విమానం నుంచి దింపేస్తారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) దేశంలో అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. విమానాల్లో కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికుల పట్ల దయ చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతుండడంతో పౌర విమానయాన సంస్థలకు డీజీసీఏ శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేశారు.
విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సక్రమంగా ధరించకపోవడం పట్ల ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీసీఏను, విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాల్లో తరచుగా తనిఖీలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు డీజీసీఏ సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో ఏముందంటే...
► మాస్కులు లేనివారిని ఎయిర్‌పోర్టుల్లోకి అనుమతించరాదు.
► విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సరిగ్గా ధరించేలా, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.
► విమానాశ్రయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రయాణం ముగిశాక విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేదాకా మాస్కు ఉండాల్సిందే.
► కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను ఎలాంటి రాజీ లేకుండా కఠినంగా అమలు చేయాలి.
► విమానం బయలుదేరే ముందు పదేపదే సూచించినా మాస్కు సరిగ్గా ధరించకపోతే సదరు ప్రయాణికుడిని వెంటనే దింపేయాలి.
► విమానం ప్రయాణిస్తుండగా మాస్కులు సరిగ్గా లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వారిని నిబంధనలు అతిక్రమించిన ప్రయాణికులుగా పరిగణించాలి.
► కొన్ని అత్యవసర సందర్భాల్లో మినహా మిగిలిన సమయంలో మాస్కును ముక్కు నుంచి కిందకు జార్చరాదు.
► కోవిడ్–19 నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, డీజీసీఏ గైడ్‌లైన్స్ ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి.
మాస్క్ సరిగా లేకుంటే దింపేయండి
Published Sun, Mar 14 2021 3:26 AM | Last Updated on Sun, Mar 14 2021 3:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment