హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్ వి టీకాను దేశీయంగా మార్చిలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్) వెల్లడించింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయని, ఇవి ముగిశాక అత్యవసర వినియోగం కింద అనుమతుల కోసం (ఈయూఏ) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకోనున్నామని సంస్థ సీఈవో (ఏపీఐ, ఫార్మా సేవల విభాగం) దీపక్ సప్రా తెలిపారు.
తొలుత 12.5 కోట్ల మందికి సరిపడా డోసేజీలను అందుబాటులోకి తేనున్నట్లు శుక్రవారం మూడో ్రౖలె మాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన వివరించారు. ధర విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రష్యాకి చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడీమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ çస్పుత్నిక్ వి టీకాను అభివృద్ధి చేసింది. దీన్ని భారత్‌లో పంపిణీ చేసేందుకు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)తో డీఆర్‌ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది.
పరిమిత లాభం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డీఆర్‌ఎల్ నికర లాభం రూ. 28 కోట్లకు పరిమితమైంది. కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ఊహించని విధంగా పోటీ పెరిగిపోవడం, అనూహ్యంగా ధరలు పతనమవడం వంటి ప్రతికూల పరిణామాల కారణంగా దాదాపు రూ. 600 కోట్లు కేటాయించాల్సి రావడం ఇందుకు కారణమని డీఆర్‌ఎల్ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 538 కోట్ల నష్టం ప్రకటించింది. మరోవైపు, తాజా సమీక్షా కాలంలో ఆదాయం 12 శాతం పెరిగి రూ. 4,397 కోట్ల నుంచి రూ. 4,942 కోట్లకు పెరిగింది. మార్జిన్లను కాపాడుకుంటూ వృద్ధి కొనసాగించగలిగామని సంస్థ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కొత్త ఉత్పత్తుల ఊతంతో మెరుగైన అమ్మకాలు నమోదు చేయగలిగామని డీఆర్‌ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు.
జనరిక్స్ ఆదాయం 13 శాతం అప్..
విభాగాల వారీగా చూస్తే గ్లోబల్ జనరిక్స్ ఆదాయం వార్షికంగా 13 శాతం వృద్ధితో రూ. 4,075 కోట్లుగా నమోదైంది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం ఒక్క శాతం వృద్ధితో రూ. 701 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికా మార్కెట్ 9 శాతం (1,739 కోట్లు), భారత మార్కెట్ 26 శాతం వృద్ధి (సుమారు రూ. 959 కోట్లు) నమోదు చేశాయి. శుక్రవారం బీఎస్‌ఈలో డీఆర్‌ఎల్ షేరు సుమారు ఆరు శాతం క్షీణించి రూ. 4,599 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment