dr. Reddys laboratory
-
కరోనా: మరో గుడ్ న్యూస్ చెప్పిన డా.రెడ్డీస్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి చికిత్సలో డీఆర్డీవో రూపొందించిన కీలక డ్రగ్‌ను ఇటీవల విడుదల చేసిన దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ మరో శుభవార్త అందించింది. రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ లైట్ టీకాను దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ ప్రతినిధి రాయిటర్స్‌కు తెలిపారు. గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ఈ సింగిల్-డోస్ వ్యాక్సిన్‌ను రష్యా ఇప్పటికే ఆమోదించింది. అనేక దేశాలలోదీని ట్రయల్స్ కొన సాగుతున్నాయి. స్పుత్నిక్ లైట్ టీకాను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు రష్యా తయారీదారు, దాని భారతీయ భాగస్వామ్య కంపెనీలతో సహా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నియంత్రణ సంస్థ అధికారులను ఇటీవల ఆదేశించింది. అనుకున్నట్టుగా అనుమతులు మంజూరైతే, దేశంలో అందుబాటులోకి రానున్న తొలి సింగిల్ డోస్ టీకా స్పుత్నిక్-వీ లైట్ కానున్నది. ఈ నేపథ్యంలో రెగ్యులేటరీ ఆమోదం కోరుతూ వచ్చే రెండు వారాల్లో కంపెనీ దరఖాస్తు చేయనుంది. స్పుత్నిక్ వ్యాక్సిన్ వెబ్సైట్ ప్రకారం సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకా 79.4 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించింది. కాగా రష్యన్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ అత్యవసర ఉపయోగానికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీజఐ) నుండి అనుమతి పొందిన మూడవ టీకాగా నిలిచిన సంగతి తెలిసిందే. డాక్టర్ రెడ్డి లాబ్స్ ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ టీకాను వినియోగిస్తున్నారు. అలాగే వచ్చే నెల మధ్యలో దేశంలో వాణిజ్యపరంగా ప్రారంభించాలని భావిస్తున్న ఈ రెండు డోసుల స్పుత్నిక్- వీ వ్యాక్సిన్ సరఫరా కోసం కూడా రెడ్డీస్ అటు కేంద్రం, ఇటు ప్రైవేటు రంగాలతో చర్చిస్తోంది. చదవండి: కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు బుల్ రన్: రాందేవ్ అగర్వాల్ సంచలన అంచనాలు వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్! -
మార్చిలో ‘స్పుత్నిక్ వి’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్ వి టీకాను దేశీయంగా మార్చిలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వెల్లడించింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయని, ఇవి ముగిశాక అత్యవసర వినియోగం కింద అనుమతుల కోసం (ఈయూఏ) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకోనున్నామని సంస్థ సీఈవో (ఏపీఐ, ఫార్మా సేవల విభాగం) దీపక్ సప్రా తెలిపారు. తొలుత 12.5 కోట్ల మందికి సరిపడా డోసేజీలను అందుబాటులోకి తేనున్నట్లు శుక్రవారం మూడో ్రౖలె మాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన వివరించారు. ధర విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రష్యాకి చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడీమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ çస్పుత్నిక్ వి టీకాను అభివృద్ధి చేసింది. దీన్ని భారత్‌లో పంపిణీ చేసేందుకు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో డీఆర్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. పరిమిత లాభం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డీఆర్ఎల్ నికర లాభం రూ. 28 కోట్లకు పరిమితమైంది. కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ఊహించని విధంగా పోటీ పెరిగిపోవడం, అనూహ్యంగా ధరలు పతనమవడం వంటి ప్రతికూల పరిణామాల కారణంగా దాదాపు రూ. 600 కోట్లు కేటాయించాల్సి రావడం ఇందుకు కారణమని డీఆర్ఎల్ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 538 కోట్ల నష్టం ప్రకటించింది. మరోవైపు, తాజా సమీక్షా కాలంలో ఆదాయం 12 శాతం పెరిగి రూ. 4,397 కోట్ల నుంచి రూ. 4,942 కోట్లకు పెరిగింది. మార్జిన్లను కాపాడుకుంటూ వృద్ధి కొనసాగించగలిగామని సంస్థ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కొత్త ఉత్పత్తుల ఊతంతో మెరుగైన అమ్మకాలు నమోదు చేయగలిగామని డీఆర్ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. జనరిక్స్ ఆదాయం 13 శాతం అప్.. విభాగాల వారీగా చూస్తే గ్లోబల్ జనరిక్స్ ఆదాయం వార్షికంగా 13 శాతం వృద్ధితో రూ. 4,075 కోట్లుగా నమోదైంది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం ఒక్క శాతం వృద్ధితో రూ. 701 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికా మార్కెట్ 9 శాతం (1,739 కోట్లు), భారత మార్కెట్ 26 శాతం వృద్ధి (సుమారు రూ. 959 కోట్లు) నమోదు చేశాయి. శుక్రవారం బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు ఆరు శాతం క్షీణించి రూ. 4,599 వద్ద క్లోజయ్యింది. -
రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అంతానికి రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు మన దేశంలో అనుమతి లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్)లకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. తాజా అనుమతి మేరకు భారతదేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించ నున్నామని ఇరు సంస్థలు శనివారం ప్రకటించాయి. (రెండో వాక్సిన్ : పుతిన్ కీలక ప్రకటన) 2020 సెప్టెంబరులో, డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఈఐఎఫ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ని భారతదేశంలో పంపిణీ చేసేందుకు ఒక ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది. మొదట భారత్ లో 3వ దశ ట్రయల్ మాత్రమే నిర్వహించాలని అనుకున్నా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్కో) నిపుణుల కమిటీ (ఎస్ఇసి) ఆదేశాల మేరకు వరుసగా 2,3 దశల క్లినికల్ ట్రయల్ నిర్వహిచనుంది. 1500 మందితో అడాప్టివ్ ఫేజ్ 2,3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు సన్నద్ధమవుతున్నామని టీకాను విదేశాలలో మార్కెటింగ్ చేస్తున్న ఆర్డిఐఎఫ్ తెలిపింది. సురక్షిత, సమర్థవంతమైన వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు కట్టుబడిఉన్నామని డాక్టర్ రెడ్డీస్కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. డీసీజీఐ సానుకూల సహకారం సంతోషానిచ్చిందని ఆర్డిఐఎఫ్ సీఈఓ కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు. భారతీయ క్లినికల్ ట్రయల్ డేటాతో పాటు, రష్యాలోమూడో దశ క్లినికల్ ట్రయల్ డేటా, వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకతపై విదేశాల్లో నిర్వహించిన అధ్యయనాలను కూడా అందిస్తామన్నారు. కాగా రష్యాకు చెందిన స్పుత్నిక్-వి కొవిడ్-19 వ్యాక్సిన్‌పై భారత్‌లో భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించాలనుకున్న డాక్టర్ రెడ్డీస్‌కు అనుతిమిని నిరాకరించిన సంగతి తెలిసిందే. -
డాక్టర్ రెడ్డీస్ నుంచి కేన్సర్ ఇంజక్షన్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో కేన్సర్ చికిత్సకు అవసరమైన ఇంజక్షన్‌ను డాక్టర్ రెడ్డీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు బొర్టెజొమిబ్ 3.5 ఎంజీ ఇంజక్షన్‌ను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) ఆమోదించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వయోజన రోగులలో వివిధ రకాల కేన్సర్ చికిత్స కోసం దీని ప్రవేశపెట్టినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నార్త్ అమెరికా జనరిక్స్ సీఈఓ మార్క్ కికుచీ తెలిపారు. యుక్త వయసున్న కేన్సర్ పేషెంట్లకు ఇంట్రావీనియస్ వినియోగం కోసం మాత్రమే యూఎస్ఎఫ్డీఏ ఈ కొత్త డ్రగ్ 505 (బీ)(2)కు అనుమతిచ్చిందని పేర్కొన్నారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 44% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018–19, క్యూ4)లో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 44 శాతం ఎగిసింది. రూ. 434.4 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే కాలంలో లాభం రూ.302.2 కోట్లు. మరోవైపు, తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం 14% వృద్ధి చెందింది. రూ.3,535 కోట్ల నుంచి రూ.4,017 కోట్లకు పెరిగింది. పూర్తి ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20 తుది డివిడెండు ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి ఈ విషయాలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 ఔషధాలు మార్కెట్లోకి ప్రవేశపెట్టామని, ఈసారి కూడా సుమారు అదే స్థాయిలో కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికాలో మూడు డెర్మటాలజీ బ్రాండ్స్ విక్రయాలకు సంబంధించి నాలుగో త్రైమాసికంలో ఎన్కోర్ డెర్మటాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పనితీరును గణనీయంగా మెరుగుపర్చుకోగలిగినట్లు సంస్థ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంలోనూ పురోగతి సాధించినట్లు వివరించారు. ‘రాబోయే రోజుల్లో లాభదాయక వృద్ధిని సాధించడంతో పాటు కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్దేశించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేషంట్లకు అధిక ప్రయోజనం చేకూర్చే నూతన ఆవిష్కరణలపైనా దృష్టి పెడతాం‘ అని ప్రసాద్ చెప్పారు. సుబాక్సోన్ జనరిక్ ఔషధ విక్రయాలను నిలిపివేయాలంటూ అమెరికా కోర్టులో కేసు వేసిన ఇండీవియర్ సంస్థ.. ఒకవేళ కేసు వీగిపోయిన పక్షంలో పరిహారంగా చెల్లించేందుకు 72 మిలియన్ డాలర్ల బాండు సమర్పించినట్లు పేర్కొన్నారు. తుది తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన పక్షంలో అంతకుమించి పరిహారం కోరనున్నట్లు తెలిపారు. జనరిక్స్‌కు వర్ధమాన మార్కెట్ల ఊతం.. యూరప్, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం నాలుగో త్రైమాసికంలో మెరుగైన పనితీరు కనపర్చింది. వార్షికంగా తొమ్మిది శాతం వృద్ధితో ఆదాయం రూ. 3,038 కోట్లకు పెరిగింది. అటు కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ కేవలం మూడు శాతం వృద్ధికి పరిమితమైంది. ఈ మార్కెట్ నుంచి క్యూ4లో ఆదాయం రూ. 1,449 కోట్ల నుంచి రూ. 1,496 కోట్లకు పెరిగింది. నాలుగో త్రైమాసికంలో కొత్తగా 5 ఉత్పత్తులను ఉత్తర అమెరికా మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటిలో యాడ్సిర్కా, సయాలిస్ ప్రధానమైనవని సంస్థ తెలిపింది. భారత మార్కెట్ నుంచి క్యూ4లో ఆదాయాలు 6 శాతం పెరిగి రూ. 650 కోట్లకు, వార్షికంగా 12 శాతం వృద్ధితో రూ. 2,620 కోట్లకు పెరిగాయి వార్షికంగా రూ. 1,880 కోట్ల లాభం.. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను డీఆర్ఎల్ ఆదాయం రూ. 15,385 కోట్లు కాగా.. లాభం రూ. 1,880 కోట్లుగా నమోదైంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతమున్న ఉత్పత్తుల మార్కెట్ వాటా పెరగడంతో పాటు సానుకూల విదేశీ మారక రేటు తదితర అంశాలు ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి ఆదాయాలు మెరుగుపడటానికి దోహదపడినట్లు చక్రవర్తి తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై రూ. 1,560 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. -
డా.రెడ్డీస్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
సాక్షి, ముంబై : దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్‌కు మరోసారి అమెరికా ప్రాతిపాధిక ఆహార నియంత్రణ సంస్థ(యూఎస్ఎఫ్డీఏ) షాక్ తగిలింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి యూనిట్-3లో తనిఖీలు నిర్వహించిన సంస్థ యూనిట్లో 11 ( అబ్జర్వేషన్లను) లోపాలను గుర్తించింది. ఈ మేరకు 483-ఫామ్‌ను జారీ చేసినట్లు డా. రెడ్డీస్ యాజమాన్యం శుక్రవారం స్టాక్ ఎక్చ్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. దీంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. ఒక దశలో షేరు 8శాతానికిపైగా కుప్పకూలింది. అనంతరం కోలుకుని 3శాతం నష్టాలకు పరిమితమైనా...మిడ్ సెషనన్ తరువాత మళ్లీ 6శాతం పతనమైంది. కాగా.. నియమిత కాలంలోగా ఎఫ్‌డీఏ గుర్తించిన లోపాలను సవరించనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ఒక ప్రకటనలో తెలిపింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభంలో క్షీణత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 29 శాతం క్షీణించింది. ఐఎఫ్ఆర్ఎస్ అకౌంటింగ్ విధానం ప్రకారం రూ.334 కోట్లకు పరిమితమైంది. పన్ను పరంగా రూ.93 కోట్ల వన్ టైమ్ చార్జీకి సర్దుబాటు చేయటమే ఇందుకు కారణమని కంపెనీ తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం లాభం రూ.470 కోట్లు. ఇక ఆదాయం సుమారు 3 శాతం వృద్ధితో రూ.3706 కోట్ల నుంచి రూ.3,806 కోట్లకు చేరుకుంది. వ్యయాల నియంత్రణ, ఉత్పాదకత మెరుగుపర్చుకోవడంతో పాటు వివిధ మార్కెట్లలో పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకుంటున్నట్లు గురువారమిక్కడ ఆర్థిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా సంస్థ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలియజేశారు. అలాగే సంక్లిష్టమైన జనరిక్స్, బయో సిమిలర్స్ మొదలైన ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. గడిచిన మూడు త్రైమాసికాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై సుమారు రూ.1,400 కోట్ల దాకా వెచ్చించామని, ఇది అమ్మకాల్లో సుమారు 12 శాతమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులను నిర్దేశించుకోగా.. ఇప్పటిదాకా రూ. 779 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. యూరప్ జనరిక్స్ విభాగం మరింత మెరుగుపడటానికి మరో త్రైమాసికం పట్టొచ్చని సంస్థ సీవోవో అభిజిత్ ముఖర్జీ తెలిపారు. కొంగొత్త వర్ధమాన మార్కెట్లలో బయోలాజిక్స్ విభాగంపై మరింతగా దృష్టి సారిస్తున్నామని తెలియజేశారాయన. దేశీ మార్కెట్లో 10–12 శాతం మేర వృద్ధి ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ముఖర్జీ పేర్కొన్నారు. రెండు శాతం తగ్గిన గ్లోబల్ జనరిక్స్ యూరప్ జనరిక్స్ మార్కెట్ విభాగం క్షీణించడం, విదేశీ మారకం హెచ్చుతగ్గుల కారణంగా గ్లోబల్ జనరిక్స్ ఆదాయాలు క్యూ3లో వార్షిక ప్రాతిపదికన 2% క్షీణించాయి. కొన్ని ఔషధాల విభాగాల్లో పోటీ పెరగడం, ధరలపరమైన ఒత్తిడి తదితర అంశాల కారణంగా అమెరికా మార్కెట్లో ఆదాయాలు 3% తగ్గి రూ. 1,600 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని ఉత్పత్తులు ఆదాయం మెరుగుదలకు కొంత తోడ్పడ్డాయి. మరోవైపు, యూరప్‌లో ఆదాయం ఏడు శాతం క్షీణించగా.. భారత మార్కెట్లో మాత్రం 3 శాతం పెరిగింది. డిసెంబర్ ఆఖరు నాటికి మొత్తం జనరిక్ ఔషధాలకు సంబంధించి 102 దరఖాస్తులు (ఏఎన్‌డీఏ) అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు చక్రవర్తి పేర్కొన్నారు. అటు ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం నామమాత్రంగా 1% పెరిగి రూ. 543 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు 2% క్షీణించి రూ.2,504 వద్ద క్లోజయ్యింది. -
పరిశోధనకు రూ. 1,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్నాళ్ల కిందటి దాకా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ఒక స్థాయికి మించి చేపట్టని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్... మళ్లీ వాటిపై దృష్టిపెట్టింది. సంక్లిష్టమైన జనరిక్స్, అధిక విలువ ఉండే ఔషధాలను రూపొందించేందుకు పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వ్యయాలను భారీగా పెంచింది. ఇందుకోసం దాదాపు రూ.1,000 కోట్లు పైగా వెచ్చించబోతోంది. ఎందుకంటే కంపెనీ తన ఆదాయంలో 7-8 శాతాన్ని ఆర్అండ్డీపై వెచ్చించనున్నట్లు 2012-13 వార్షిక నివేదికలో పేర్కొంది. గడిచిన మూడేళ్లుగా చూసినా సంస్థ తన ఆదాయంలో 6-7 శాతం మధ్య ఆర్ అండ్ డీపై వెచ్చిస్తోంది. ఇక ఆదాయానికి వస్తే సగటున 20 శాతం వృద్ధితో ఈసారి రూ.13,951 కోట్లు ఆర్జించవచ్చని అంచనా. దీన్లో 8 శాతం అంటే దాదాపు 1,116 కోట్లు. తద్వారా ఆర్ అండ్ డీపై వెయ్యి కోట్లకు పైగా వెచ్చిస్తున్న దేశీ ఫార్మా దిగ్గజంగా డీఆర్ఎల్ మారుతుంది. ఇటీవల విడుదల చేసిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఇప్పటికే ఆర్అండ్డీపై రూ.243 కోట్లు ఖర్చు చేసింది. బయోసిమిలర్స్‌పై దృష్టి..: రాబోయే కొన్నాళ్లలో అమెరికా, యూరప్‌లలో పలు బయోఫార్మా డ్రగ్స్ పేటెంట్ గడువు ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై డీఆర్ఎల్ దృష్టి సారిస్తోంది. బయోఫార్మా ఔషధాలకు జనరిక్స్ అయిన బయోసిమిలర్స్ తయారీలో పటిష్టంగా ఎదిగేందుకు యత్నిస్తోంది. డీఆర్ఎల్ ఇప్పటికే దేశీ మార్కెట్లో రెడిటక్స్, గ్రాఫీల్ తదితర 4 బయోసిమిలర్స్ని ప్రవేశపెట్టింది. కొత్త ఉత్పత్తుల రూపకల్పన కోసం జర్మనీకి చెందిన మెర్క్ సంస్థతో కూడా డీఆర్ఎల్ చేతులు కలిపింది. గడచిన అయిదేళ్లలో బయోసిమిలర్స్ సహా వివిధ ఔషధాల ఉత్పత్తి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రూ. 3,600 కోట్ల పైగా వెచ్చించింది. మరోవైపు, తమ కార్యకలాపాలకు అనుగుణంగా ఉండే సంస్థల కొనుగోలుపై కూడా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దృష్టి సారిస్తోంది. 2017 ఆర్థిక సంవత్సరం నాటికి సుమా రు 40% ఆదాయాలను వివిధ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా సాధించాలని నిర్దేశించుకుంది.