హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) నికర లాభం 29 శాతం క్షీణించింది. ఐఎఫ్‌ఆర్‌ఎస్ అకౌంటింగ్ విధానం ప్రకారం రూ.334 కోట్లకు పరిమితమైంది. పన్ను పరంగా రూ.93 కోట్ల వన్ టైమ్ చార్జీకి సర్దుబాటు చేయటమే ఇందుకు కారణమని కంపెనీ తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం లాభం రూ.470 కోట్లు. ఇక ఆదాయం సుమారు 3 శాతం వృద్ధితో రూ.3706 కోట్ల నుంచి రూ.3,806 కోట్లకు చేరుకుంది.
వ్యయాల నియంత్రణ, ఉత్పాదకత మెరుగుపర్చుకోవడంతో పాటు వివిధ మార్కెట్లలో పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకుంటున్నట్లు గురువారమిక్కడ ఆర్థిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా సంస్థ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలియజేశారు. అలాగే సంక్లిష్టమైన జనరిక్స్, బయో సిమిలర్స్ మొదలైన ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. గడిచిన మూడు త్రైమాసికాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై సుమారు రూ.1,400 కోట్ల దాకా వెచ్చించామని, ఇది అమ్మకాల్లో సుమారు 12 శాతమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులను నిర్దేశించుకోగా.. ఇప్పటిదాకా రూ. 779 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. యూరప్ జనరిక్స్ విభాగం మరింత మెరుగుపడటానికి మరో త్రైమాసికం పట్టొచ్చని సంస్థ సీవోవో అభిజిత్ ముఖర్జీ తెలిపారు. కొంగొత్త వర్ధమాన మార్కెట్లలో బయోలాజిక్స్ విభాగంపై మరింతగా దృష్టి సారిస్తున్నామని తెలియజేశారాయన. దేశీ మార్కెట్లో 10–12 శాతం మేర వృద్ధి ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ముఖర్జీ పేర్కొన్నారు.
రెండు శాతం తగ్గిన గ్లోబల్ జనరిక్స్
యూరప్ జనరిక్స్ మార్కెట్ విభాగం క్షీణించడం, విదేశీ మారకం హెచ్చుతగ్గుల కారణంగా గ్లోబల్ జనరిక్స్ ఆదాయాలు క్యూ3లో వార్షిక ప్రాతిపదికన 2% క్షీణించాయి. కొన్ని ఔషధాల విభాగాల్లో పోటీ పెరగడం, ధరలపరమైన ఒత్తిడి తదితర అంశాల కారణంగా అమెరికా మార్కెట్లో ఆదాయాలు 3% తగ్గి రూ. 1,600 కోట్లకు పరిమితమయ్యాయి.
అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని ఉత్పత్తులు ఆదాయం మెరుగుదలకు కొంత తోడ్పడ్డాయి. మరోవైపు, యూరప్‌లో ఆదాయం ఏడు శాతం క్షీణించగా.. భారత మార్కెట్లో మాత్రం 3 శాతం పెరిగింది. డిసెంబర్ ఆఖరు నాటికి మొత్తం జనరిక్ ఔషధాలకు సంబంధించి 102 దరఖాస్తులు (ఏఎన్‌డీఏ) అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు చక్రవర్తి పేర్కొన్నారు.
అటు ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం నామమాత్రంగా 1% పెరిగి రూ. 543 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో డీఆర్‌ఎల్ షేరు 2% క్షీణించి రూ.2,504 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment