హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018–19, క్యూ4)లో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్) నికర లాభం 44 శాతం ఎగిసింది. రూ. 434.4 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే కాలంలో లాభం రూ.302.2 కోట్లు. మరోవైపు, తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం 14% వృద్ధి చెందింది. రూ.3,535 కోట్ల నుంచి రూ.4,017 కోట్లకు పెరిగింది. పూర్తి ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20 తుది డివిడెండు ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్‌ఎల్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి ఈ విషయాలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 ఔషధాలు మార్కెట్లోకి ప్రవేశపెట్టామని, ఈసారి కూడా సుమారు అదే స్థాయిలో కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికాలో మూడు డెర్మటాలజీ బ్రాండ్స్ విక్రయాలకు సంబంధించి నాలుగో త్రైమాసికంలో ఎన్‌కోర్ డెర్మటాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పనితీరును గణనీయంగా మెరుగుపర్చుకోగలిగినట్లు సంస్థ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంలోనూ పురోగతి సాధించినట్లు వివరించారు. ‘రాబోయే రోజుల్లో లాభదాయక వృద్ధిని సాధించడంతో పాటు కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్దేశించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేషంట్లకు అధిక ప్రయోజనం చేకూర్చే నూతన ఆవిష్కరణలపైనా దృష్టి పెడతాం‘ అని ప్రసాద్ చెప్పారు. సుబాక్సోన్ జనరిక్ ఔషధ విక్రయాలను నిలిపివేయాలంటూ అమెరికా కోర్టులో కేసు వేసిన ఇండీవియర్ సంస్థ.. ఒకవేళ కేసు వీగిపోయిన పక్షంలో పరిహారంగా చెల్లించేందుకు 72 మిలియన్ డాలర్ల బాండు సమర్పించినట్లు పేర్కొన్నారు. తుది తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన పక్షంలో అంతకుమించి పరిహారం కోరనున్నట్లు తెలిపారు.
జనరిక్స్‌కు వర్ధమాన మార్కెట్ల ఊతం..
యూరప్, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం నాలుగో త్రైమాసికంలో మెరుగైన పనితీరు కనపర్చింది. వార్షికంగా తొమ్మిది శాతం వృద్ధితో ఆదాయం రూ. 3,038 కోట్లకు పెరిగింది. అటు కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ కేవలం మూడు శాతం వృద్ధికి పరిమితమైంది. ఈ మార్కెట్ నుంచి క్యూ4లో ఆదాయం రూ. 1,449 కోట్ల నుంచి రూ. 1,496 కోట్లకు పెరిగింది. నాలుగో త్రైమాసికంలో కొత్తగా 5 ఉత్పత్తులను ఉత్తర అమెరికా మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటిలో యాడ్‌సిర్కా, సయాలిస్ ప్రధానమైనవని సంస్థ తెలిపింది. భారత మార్కెట్ నుంచి క్యూ4లో ఆదాయాలు 6 శాతం పెరిగి రూ. 650 కోట్లకు, వార్షికంగా 12 శాతం వృద్ధితో రూ. 2,620 కోట్లకు పెరిగాయి
వార్షికంగా రూ. 1,880 కోట్ల లాభం..
2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను డీఆర్‌ఎల్ ఆదాయం రూ. 15,385 కోట్లు కాగా.. లాభం రూ. 1,880 కోట్లుగా నమోదైంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతమున్న ఉత్పత్తుల మార్కెట్ వాటా పెరగడంతో పాటు సానుకూల విదేశీ మారక రేటు తదితర అంశాలు ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి ఆదాయాలు మెరుగుపడటానికి దోహదపడినట్లు చక్రవర్తి తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలపై రూ. 1,560 కోట్లు వెచ్చించినట్లు వివరించారు.
డాక్టర్ రెడ్డీస్ లాభం 44% అప్
Published Sat, May 18 2019 12:17 AM | Last Updated on Sat, May 18 2019 12:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment