న్యూఢిల్లీ: ఐటీ రంగ కంపెనీ టెక్ మహీంద్రా మార్చి త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతానికి పైగా క్షీణించి రూ.1,126 కోట్లకు పరిమితం అయింది. ఆదాయం మాత్రం 10 శాతం పెరిగి రూ.8,892 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1,230 కోట్ల లాభాన్ని, రూ.8,054 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.4,288 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 13% పెరిగి రూ.34,742 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది.
పనితీరుపై సంతృప్తి
‘‘గడిచిన ఆర్థిక సంవత్సరం మాకు సంతృప్తిని ఇచ్చింది. మార్జిన్లు మెరుగుపడ్డాయి. డిజిటల్ పోర్ట్‌ఫోలియో వృద్ధి చెందడం, చెప్పుకోతగ్గ కాంట్రాక్టులను సొంతం చేసుకోవడం మేలు చేశాయి. కమ్యూనికేషన్ వ్యాపారం పుంజుకోవడం మాకు ఉత్సాహాన్నిచ్చింది’’ అని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి నాటికి 1,21,082కు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా 8,275 మంది ఉద్యోగులు పెరిగారు. కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య మార్చి త్రైమాసికంలో 938గా ఉంది. ‘‘ఎన్నో విభాగాల్లో నిర్వహణ పనితీరు మెరగుపడిన సంవత్సరం ఇది(2018–19). దీనివల్ల ఎబిట్డా మార్జిన్ గణనీయంగా విస్తరించింది. తగినన్ని నగదు నిల్వలు ఉండడంతో వాటాదారులకు మెరుగైన విలువను తిరిగి అందించేందుకు షేర్ల బైబ్యాక్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం’’ అని టెక్ మహీంద్రా సీఎఫ్‌వో మనోజ్‌భట్ పేర్కొన్నారు. ఒక్కో షేరుపై 2019 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు టెక్‌మహీంద్రా బోర్డు నిర్ణయం తీసుకుంది.
నిరాశపరిచిన టెక్ మహీంద్రా
Published Wed, May 22 2019 12:14 AM | Last Updated on Wed, May 22 2019 12:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment