Tech Mahindra Ltd.
-
5జీ : రేసులో దిగ్గజ ఐటీ కంపెనీలు
న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి పలు కంపెనీలు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా భారత్‌కు చెందిన పలు దిగ్గజ ఐటీ కంపెనీలు 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి రంగంలోకి దిగాయి. భారత్‌లో 5జీ, 6జీ టెక్నాలజీల అభివృద్ధి, విస్తరణ కోసం భారత కంపెనీలు విప్రో ,టెక్ మహీంద్రా ఫిన్‌ల్యాండ్ కంపెనీల సహకారంతో కలిసి పనిచేస్తాయని భారత సీనియర్ అధికారి మంగళవారం తెలియజేశారు. 5జీ సేవలను విస్తరించడానికి ఫిన్లాండ్ కు చెందిన నోకియా కంపెనీ ఇప్పటికే భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తోందని సెంట్రల్ యూరప్ ఇన్చార్జి జాయింట్ సెక్రటరీ నీతా భూషణ్ మంగళవారం విలేకరులతో అన్నారు. ‘2 జీ, 3జీ, 4జీ టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో ఫిన్ లాండ్ ప్రముఖ పాత్ర వహించింది. విప్రో , టెక్ మహీంద్రా కంపెనీలు ఫిన్లాండ్ సంస్థలతో కలిసి 5జీ టెక్నాలజీ అభివృద్ధి కోసం పనిచేస్తాయని అంతేకాకుండా, భవిష్యత్తులో 6జీ టెక్నాలజీను అందించడంలో పనిచేస్తాయని’ నీతా భూషణ్ తెలిపారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్, ఇరు దేశాల్లో ఆవిష్కరణ, పరిశోధన , సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులతో సహా ఇంధన రంగాలలో కొనసాగుతున్న సహకారంపై సమీక్ష నిర్వహించారు. ఇరు దేశాల ప్రధానులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్వాంటం కంప్యూటర్ను అభివృద్ధికి ఇరుదేశాలు పాటుపడతాయని మార్చి 16 న జరిగిన వర్చువల్ సమావేశంలో తెలిపారు. దేశంలో 5జీ టెక్నాలజీకి ఆదరణ పెరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు 5జీ బాటపడుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: రష్యాను అధిగమించిన భారత్..!) -
నిరాశపరిచిన టెక్ మహీంద్రా
న్యూఢిల్లీ: ఐటీ రంగ కంపెనీ టెక్ మహీంద్రా మార్చి త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతానికి పైగా క్షీణించి రూ.1,126 కోట్లకు పరిమితం అయింది. ఆదాయం మాత్రం 10 శాతం పెరిగి రూ.8,892 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1,230 కోట్ల లాభాన్ని, రూ.8,054 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.4,288 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 13% పెరిగి రూ.34,742 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. పనితీరుపై సంతృప్తి ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరం మాకు సంతృప్తిని ఇచ్చింది. మార్జిన్లు మెరుగుపడ్డాయి. డిజిటల్ పోర్ట్‌ఫోలియో వృద్ధి చెందడం, చెప్పుకోతగ్గ కాంట్రాక్టులను సొంతం చేసుకోవడం మేలు చేశాయి. కమ్యూనికేషన్ వ్యాపారం పుంజుకోవడం మాకు ఉత్సాహాన్నిచ్చింది’’ అని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి నాటికి 1,21,082కు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా 8,275 మంది ఉద్యోగులు పెరిగారు. కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య మార్చి త్రైమాసికంలో 938గా ఉంది. ‘‘ఎన్నో విభాగాల్లో నిర్వహణ పనితీరు మెరగుపడిన సంవత్సరం ఇది(2018–19). దీనివల్ల ఎబిట్డా మార్జిన్ గణనీయంగా విస్తరించింది. తగినన్ని నగదు నిల్వలు ఉండడంతో వాటాదారులకు మెరుగైన విలువను తిరిగి అందించేందుకు షేర్ల బైబ్యాక్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం’’ అని టెక్ మహీంద్రా సీఎఫ్‌వో మనోజ్భట్ పేర్కొన్నారు. ఒక్కో షేరుపై 2019 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు టెక్‌మహీంద్రా బోర్డు నిర్ణయం తీసుకుంది. -
టెక్ మహీంద్రా బై బ్యాక్
సాక్షి, ముంబై : సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) చేయనున్నామని టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా ప్రకటించింది. ఈ మేరకు సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా లిమిటెడ్ బోర్డు బైబ్యాక్‌ప్రతిపాదను ఆమోదం తెలిపింది రూ. 1956 కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు ఆమోదం లభించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గురువారం తెలిపింది. షేరుకి రూ. 950 ధర మించకుండా దాదాపు 2.06 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇది 2.1 శాతం ఈక్విటీ వాటాకు సమానం. ఇందుకు రూ. 956 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందుకు కంపెనీ అంతర్గత వనరుల నుంచి నిధులను వినియోగించనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత ట్రేడింగ్ రేటుకు 14.59 ప్రీమియం ధరలో బై బ్యాక్ చేపడుతున్నట్టు పేర్కొంది. బైబ్యాక్‌కు మార్చి 6 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం టెక్ మహీంద్రా 2.1 శాతం లాభాల్లో రూ.830 స్థాయి వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రూ.840 వద్ద 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. -
ఈడీ కేసులో టెక్ మహీంద్రాకు ఊరట
హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో టెక్నాలజీ సంస్థ టెక్ మహీంద్రాకు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌కు చెందిన రూ.822 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేయాలన్న ఈడీ ఆదేశాలను నిలుపుదల చేస్తూ హైదరాబాద్ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. మనీ లాండరింగ్ కేసులో 2012లో అప్పటి సత్యం కంప్యూటర్స్ ఫిక్స్డ్ డిపాజిట్లను స్తంభింపజేస్తూ ఈడీ తాత్కాలిక ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ మార్గంలో వచ్చిన సొమ్ము అన్న ఆరోపణలతో ఈ మొత్తాన్ని ఈడీ జప్తు చేసింది. జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవిల బెంచ్ ఈడీ ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చారు. ఆ సమయంలో నిధులేవి? టెక్ మహీంద్రా తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘2009లో టెక్ మహీంద్రా కొనుగోలు చేసిన సమయంలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌లో నిధులే లేవు. పైగా సత్యంను తిరిగి గాడిలో పెట్టేందుకు మహీంద్రా గ్రూప్ నిధులు వెచ్చించాల్సి వచ్చింది. టెక్ మహీంద్రా టేక్ ఓవర్ చేసిన సమయంలో సత్యం కంప్యూటర్స్‌కు ఆదాయమే లేదు. నెగటివ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అక్రమ ఆదాయం అన్న ప్రశ్నే తలెత్తదు’ అని అన్నారు. ఇదిలావుంటే, బి.రామలింగ రాజు, ఆయన అనుచరులు అక్రమంగా కంపెనీ షేరు ధరను పెంచి, వాటిని విక్రయంతోపాటు తనఖా పెట్టారని ఈడీ చెబుతోంది. బినామీ కంపెనీల నుంచి పొందిన రూ.2,171.45 కోట్ల రుణాల్లో రూ.822 కోట్లు సత్యం కంప్యూటర్స్‌లోకి వచ్చిచేరాయి. వీటిని రోజువారీ వ్యయాలు, వేతనాలకు ఖర్చు చేసినట్టుగా ఈడీ గుర్తించింది. సుప్రీంకు వెళతాం.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉందని ఈడీ తరఫు న్యాయవాది పి.వి.పి.సురేష్ కుమార్ వెల్లడించారు. సీబీఐ ప్రత్యేక కోర్టు రామలింగ రాజు, ఆయన సోదరులను దోషులుగా బోనులో నిలబెట్టడాన్ని బలమైన కారణంగా ఉన్నత న్యాయ స్థానం ముందు చూపెడతామని అన్నారు. ‘దోషిగా నిలబెట్టడం విషయంలో ఐపీసీ నిబంధనలకు, మనీ లాండరింగ్ యాక్టుకు మధ్య ప్రతికూలతలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈడీ అటాచ్మెంట్ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయి. ఇదే సరైనది కూడా’ అని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. కాగా, కేసు పూర్వాపరాలు ఏమంటే.. ఈడీ అటాచ్మెంట్ ఆర్డర్‌పై సింగిల్ బెంచ్ జడ్జ్ గతంలో స్టే విధించారు. దీనిని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ముందు ఈడీ రిట్ అప్పీల్ చేసింది. ఈడీ విన్నపం నిబంధనలకు విరుద్ధమంటూ 2014 డిసెంబరు 31న కేసును కొట్టివేసింది. -
టెక్ మహీంద్రా చేతికి ఎల్సీసీ కంపెనీ
న్యూఢిల్లీ: టెక్ మహీంద్రా కంపెనీ అమెరికాకు చెందిన లైట్‌బ్రిడ్జ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్(ఎల్సీసీ)ని 24 కోట్ల డాలర్లు(రూ.1,468 కోట్లకు పైగా)కు కొనుగోలు చేయనున్నది. వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తయ్యే ఈ డీల్ ఈ ఏడాది అతి పెద్ద ఐటీ డీల్ అని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఎల్‌సీసీని పూర్తిగా నగదుతోనే టక్ మహీంద్రా కొనుగోలు చేయనున్నది. కాగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే టెక్ మహీంద్రా కంపెనీ మొత్తం ఏడు కంపెనీలను కొనుగోలు చేసింది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్, హచిసన్ గ్లోబల్ సర్వీసెస్, కామ్వివా టెక్నాలజీస్ వంటివి వాటిల్లో కొన్ని. టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో నెట్వర్క్ ఇంజినీరింగ్ సర్వీస్‌లను అందిస్తున్న అంతర్జాతీయ పెద్ద కంపెనీల్లో ఎల్సీసీ ఒకటి. వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఎల్సీసీ 50 దేశాల్లో 5,700 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ వార్షికాదాయం 43 కోట్ల డాలర్లు. కాగా ఈ కంపెనీ కొనుగోలుకు అవసరమైన వనరులను అంతర్గతంగానే సమకూర్చుకుంటున్నామని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు.